
ఈసీపై రాహుల్ ధ్వజం
2014 నుంచి ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయి
గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది
సాక్ష్యాల అణు బాంబు త్వరలో ప్రయోగిస్తా
ఎన్నికల వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించడం తథ్యం
ఎన్డీయేకు 15 సీట్లు తక్కువొస్తే మోదీ ప్రధాని అయ్యేవారు కాదని వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ ఇప్పటికే చచ్చిపోయిందని అన్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయని మండిపడ్డారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై తన వద్దనున్న అణు బాంబును అతిత్వరలో ప్రయోగిస్తానని, అది మన ఎన్నికల వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని తేల్చిచెప్పారు.
శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ ప్రసంగించారు. నరేంద్ర మోదీ ఈసారి అతి తక్కువ మెజారీ్టతో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారని గుర్తుచేశారు. ఎన్డీయేకు మరో 15 సీట్లు తక్కువ వచ్చి ఉంటే ఆయన ఆ పదవిలో ఉండేవారే కాదని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికలను రిగ్గింగ్ చేయొచ్చని, గత ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని త్వరలో నిరూపిస్తామని పేర్కొన్నారు. రాహుల్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
ఆ కొత్త ఓటర్లు ఎవరు?
ఎన్నికల సంఘం స్వతంత్రను కాపాడుతున్నది రాజ్యాంగమే. కానీ, రాజ్యాంగాన్ని ఎన్నికల సంఘం అతిక్రమిస్తోంది. లెక్కలేకుండా వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై గతంలో నా దగ్గర ఆధారాల్లేవు. అందుకే ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయలేదు. కానీ, ఇప్పుడు 100 శాతం సాక్ష్యం ఉంది కాబట్టే పూర్తివిశ్వాసంతో మాట్లాడుతున్నా.
ఎన్నికల్లో అవకతవకలు ఎలా సాధ్యమని కురీ్చలో కూర్చున్నవారు అడుగుతున్నారు. కానీ, అది ముమ్మాటికీ సాధ్యమే. గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి. ఎన్నికల వ్యవస్థపై నాకు ఎప్పటి నుంచో అనుమానాలున్నాయి. 2014 నుంచే జగరానిది ఏదో జరుగుతున్నట్లు సందేహాలు తలెత్తాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో అనుమానాలు బలపడ్డాయి. అక్కడ బీజేపీ ఏకపక్షంగా విజయం సాధించించింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. మధ్యప్రదేశ్, గుజరాత్‌లోనూ సీట్లు రాలేదు. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.
మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో మంచి స్కోర్ సాధించిన మూడు పారీ్టలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సీట్లు గెల్చుకోలేదు. ఎన్నికల్లో అక్రమాలపై అప్పటి నుంచే సీరియస్‌గా దృష్టి పెట్టాం. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్తగా కోటి మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్నికల్లో ఈ ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయి. ఆ కొత్త ఓటర్లు ఎవరన్నదానిపై నావద్ద స్పష్టమైన ఆధారం లేదు. ఎన్నికల్లో చీటింగ్ జరిగిందని మా మిత్రపక్షాలతోనూ చెప్పా. ఇప్పుడు ఆధారం దొరికింది. దేశంలో ఎన్నికల సంఘం అనేదే లేదు, అది అదృశ్యమైపోయిందని నిరూపించే సాక్ష్యాధారాన్ని దేశానికి చూపిస్తాం.
ఓటర్ల జాబితాల సంగతేంటి?
లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన మోసంపై ఆధారాలు సేకరించడానికి ఆరు నెలలపాటు శ్రమించాం. ఎల్రక్టానిక్ రూపంలోని ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం మాకు ఇవ్వలేదు. బూత్‌ల వారీగా కాగితాల రూపంలోని జాబితాలు ఇచ్చారు. ఎన్నికల సంఘం వాటిని స్కాన్ చేయలేదు. ఓటర్ల జాబితాలను స్కాన్ చేసి ఎందుకు భద్రపర్చడం లేదు? వాటి ఎల్రక్టానిక్ కాపీలను భద్రపర్చాల్సిన అవసరం లేదా? ఒక లోక్‌సభ నియోజకవర్గంలో భౌతిక రూపంలోని ఓటర్ల జాబితాలను క్షుణ్నంగా పరిశీలిస్తే 6.5 లక్షల ఓట్లలో 1.5 లక్షల ఓట్లు తప్పుడు వని తేలిపోయింది’ అని రాహుల్ స్పష్టం చేశారు.
జైట్లీ బెదిరించారు
నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నేను తీవ్రంగా వ్యతిరేకించా. కానీ, వ్యతిరేకించవద్దని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడితే నాపై చర్యలు తీసుకుంటామని బెదిరించాలని చూశారు. ఆయన కళ్లల్లోకి సూటిగా చూస్తూ గట్టిగా బదులిచ్చా. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదనుకుంటా... మేము కాంగ్రెస్ మనుషులం. పిరికిపందలం కాదు. మేము ఎవరికీ తలవంచం. బ్రిటిష్ పాలకులే మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. మాకు చెప్పడానికి మీరెవరు? అని నిలదీశా’’ అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
2019లో చనిపోతే 2020లో బెదిరించారా?: రోహన్ జైట్లీ
ఆరుణ్ జైట్లీ బెదిరించడానికి ప్రయతి్నంచారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై అరుణ్ జైట్లీ తనయుడు రోహన్ జైట్లీ ఖండించారు. తన తండ్రి 2019లో మరణించారని, వ్యవసాయ చట్టాలు 2020లో వచ్చాయని గుర్తుచేశారు. అలాంటప్పుడు రాహుల్ గాం«దీని బెదిరించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ మేరకు రోహన్ జైట్లీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినవారిని బెదిరింపులకు గురి చేయడం తన తండ్రికి అలవాటు లేదని, అది ఆయన వ్యక్తిత్వం కాదని పేర్కొన్నారు.