
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో షురూ
ఇకపై దేశమంతటా అమలు
అనుమానాలకు తావులేకుండా ఉండటానికే..
ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 కంటే తక్కువ మంది ఓటర్లు
ఈవీఎంలపై అభ్యర్థులు, పార్టీ గుర్తుల కలర్ ఫొటోలు
ఓటర్లకు స్పష్టంగా కనిపించేలా పెద్ద అక్షరాలు
మొబైల్ ఫోన్లు భద్రపర్చుకోవడానికి ప్రత్యేక గది
వంద శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కవరేజీ
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెల్లడి
పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో 17 నూతన మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని వివరించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశానికి ఒక రోల్‌మోడల్ అవుతాయని అన్నారు. ఎన్నికల నిర్వహణతోపాటు ఓట్ల లెక్కింపులో ఈ కొత్త మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు.
బిహార్ రాజధాని పట్నాలో ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సింధూ, వివేక్ జోషీతో కలిసి జ్ఞానేశ్‌కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త ఓటర్ రిజి్స్ట్రేషన్ తర్వాత 15 రోజుల్లోగా ఎలక్టర్ ఫొటో గుర్తింపు కార్డు(ఎపిక్)ను సంబంధిత ఓటర్‌కు అందజేయడానికి ప్రామాణిక నియమావళి (ఎస్‌ఓపీ)ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను భద్రపర్చుకొనే సౌలభ్యం కల్పించబోతున్నామని వివరించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు.
మార్పుల్లో కీలకమైనవి..
→ బిహార్‌లో ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 కంటే తక్కువ మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల జనం బారులు తీరి గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. త్వరగా ఓటు వేసి వెళ్లిపోవచ్చు. తక్కువ మంది ఓటర్లతో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న తొలి రాష్ట్రంగా బిహార్
రికార్డుకెక్కనుంది.
→ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యపై పరిమితి విధించారు. 1,500 నుంచి 1,200కు తగ్గించారు. దీనివల్ల బిహార్‌లో అదనంగా 12,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మొత్తం కేంద్రాల సంఖ్య 90,712కి చేరుకోనుంది.
→ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) బ్యాలె ట్లపై అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తుల విషయంలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఈసారి కలర్ ఫోటోలు ముద్రించబోతున్నారు. పేర్లు, సీరియల్ నంబర్లు స్పష్టంగా కనిపెంచేలా పెద్ద అక్షరాల్లో ముద్రిస్తారు. ప్రస్తుతం ఈవీఎంలపై నలుపు తెలుపు రంగు ఫొటోలే ఉంటున్నాయి. దీనివల్ల అభ్యర్థులను గుర్తించడంలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిహార్‌లో ఈ కష్టాలకు తెరపడినట్లే. దేశవ్యాప్తంగా ఇదే విధానం అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయానికి వచి్చంది. దేశంలో ఈవీఎంలపై కలర్ ఫొటోలు ముద్రించిన మొట్టమొదటి ఎన్నికలుగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు చరిత్రకెక్కబోతున్నాయి.
→ ఎన్నికల విధులు నిర్వర్తించే బూత్–లెవెల్ అధికారులకు అధికారికంగా గుర్తింపు కార్డులు జారీ చేయబోతున్నారు. తద్వారా ఓటర్లు వారిని సులభంగా గుర్తించడానికి వీలవుతుంది.
→ బిహార్ ఎన్నికల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వంద శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కవరేజీని తప్పనిసరి చేశారు. అనుమానాలకు తావులేకుండా ప్రతి అంశాన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు చేశారు.
→ పోలింగ్ కేంద్రాల వల్ల మొబైల్ ఫోన్లు భద్రపర్చుకోవడానికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయిస్తారు.
→ పోలింగ్ ఏజెంట్లకు ప్రిసైడింగ్ అధికారి ఫామ్ 17సీని అందజేస్తారు. ఫామ్ 17సీలోని వివరాలకు, ఈవీఎం కౌంటింగ్ యూనిట్లలోని ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమైతే దానికి సంబంధించిన వీవీప్యాట్లను రీకౌంటింగ్ చేస్తారు.
→ ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడానికి ముందే పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు.
నవంబర్ 22లోగా బిహార్ ఎన్నికలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది నవంబర్ 22వ తేదీలోగా నిర్వహిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగుస్తుందని అన్నారు. రాష్ట్రంలో 243 శాసనసభ స్థానాలు ఉండగా, వీటిలో 38 ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు ఉన్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) కోసం బూత్–లెవెల్ అధికారులకు సైతం శిక్షణ ఇచ్చామన్నారు.
243 అసెంబ్లీ స్థానాలకు గాను 243 మంది ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారులను(ఈఆర్‌ఓ) నియమించామని తెలిపారు. ఎస్‌ఐఆర్‌ను జూన్ 24న ప్రారంభించామని, ఈఆర్‌ఓతోపాటు బూత్–లెవెల్ అధికారుల సాయంతో గడువులోగా విజయవంతంగా పూర్తిచేశామని వివరించారు. ఎస్‌ఐఆర్ విజయవంతం అయినందుకు ఓటర్లకు జ్ఞానేశ్ కుమార్ అభినందనలు తెలియజేశారు. తమకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాస్వామ్య పండుగలో చురుగ్గా భాగస్వాములు కావాలని బిహార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఛత్ వేడుకలో పాల్గొన్నంత ఉత్సాహంగా ఎన్నికల పండుగలో పాల్గొనాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. బిహార్‌లో 90,217 మంది బూత్ లెవెల్ అధికారులు ఎస్‌ఐఆర్ నిర్వహించారని, అద్భుతంగా పనిచేసి దేశానికి ఒక ఉదాహరణగా నిలిచారని జ్ఞానేశ్ కుమార్ ప్రశంసించారు. ఓటర్ల జాబితా శుద్ధీ్ధకరణ విషయంలో మొత్తం దేశానికే వారు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. బిహార్‌లో 22 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసినట్లు వెల్లడించారు.