రాహుల్‌కు ఈసీ సూటిప్రశ్న
న్యూఢిల్లీ: బీజేపీతో అంటకాగి హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన ఎన్నికల కమిషన్ కారణమైందంటూ రాహుల్‌గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెనువెంటనే స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్‌ఏ) ఎందుకు ఆనాడే ఈ అభ్యంతరాలను తెలపలేదని ఈసీ ఎదురు ప్రశ్నించింది. హరియాణాలో ఎన్నికల ముందు జరిగిన ఓట్ల సవరణల ప్రక్రియ వేళ కాంగ్రెస్ ఎందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదని ఈసీ ప్రశ్నించింది.
‘‘గత ఏడాది అక్టోబర్‌లో హరియాణాలో ఎన్నికలు జరిగాయి. అంతకుముందే ఆయా నియోజకవర్గాల్లో డూప్లికేట్ ఓట్లు ఉంటే తక్షణం రాజకీయ పార్టీలు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఇచ్చాం. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు ఫిర్యాదు చేయకుండా ఏం చేస్తున్నట్లు? ఓట్లేసేటప్పుడు పోలింగ్ కేంద్రాల్లో కూర్చున్న కాంగ్రెస్ ఏజెంట్లు చూస్తూ ఊరుకున్నారా? ఫలానా ఓటు అప్పటికే పోల్ అయినట్లు మీకు అనుమానం వస్తే ఎందుకు వెంటనే అక్కడి అధికారులకు తెలియజేసి అభ్యంతరం చెప్పలేదు? ఓటరు గుర్తింపుపై అనుమానాలుంటే ఎందుకు అధికారులకు సమాచారం ఇవ్వలేదు?’’ అని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారి రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
‘‘ఇంటి నంబర్ సున్నా ఎందుకు వేశారని, ఈ ప్రక్రియలో తప్పలు ఉన్నాయంటూ రాయ్, హోడల్ నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 22 పిటిషన్లు అందాయి. అవన్నీ ఇంకా పంజాబ్, హరియాణా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వాస్తవానికి 23 పిటిషన్లు వస్తే ఒకటి ఉపసంహరించుకున్నారు. తన ఆరోపణలకు సంబంధించి పూర్తి, సమగ్ర ఆధారాలను రాహుల్ బయటపెడితే బాగుంటుంది’’ అని అధికారి హితవు పలికారు. ‘‘ ప్రతి రాష్ట్రంలో డూప్లికేట్ ఓ ట్లు, మృతిచెందిన ఓటర్ల ఓట్లు, వలస వెళ్లిన వారి ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వేను మొదలెట్టాం. ఎస్‌ఐఆర్‌కు రాహుల్ మద్దతు పలుకుతున్నారా? వ్యతిరేకిస్తున్నారా? కనీసం బిహార్‌లో అయినా ఎస్‌ఐఆర్ వేళ ఎందుకు కాంగ్రెస్ బూత్‌లెవల్ ఏజెంట్లు అభ్యంతరాలు తెలపలేదు?’’ అని అధికారి ప్రశ్నించారు.
రాహుల్ అబద్ధాలాడుతున్నారు: హరియాణా సీఎం
నకిలీ ఓట్లతో హరియాణాలో బీజేపీ గెల్చిందని, అందుకే నాయబ్ సింగ్ సైనీ సర్కార్ కొలువుతీరందని రాహుల్ చేసిన విమర్శలపై సైనీ స్పందించారు. ‘‘ రాహుల్ అబద్ధాలు చెప్తున్నారు. ఆయన కుటుంబంలో నాలుగు తరాల వాళ్లు దేశాన్ని పరిపాలించారు. అయినాసరే అబద్ధాలు చెప్పే అలవాటు రాహుల్‌కు పోలేదు. ఇక్కడ ఎలాంటి చర్చనీయాంశం లేకపోయినా కాంగ్రెస్ వాళ్లు జనాలను తప్పుదోవ పట్టిస్తారు’’ అని సైనీ వ్యాఖ్యానించారు.


