బూత్‌ లెవల్‌ ఏజెంట్లకూ ఈసీ శిక్షణ | ECI begins training booth-level agents of political parties | Sakshi
Sakshi News home page

బూత్‌ లెవల్‌ ఏజెంట్లకూ ఈసీ శిక్షణ

Apr 24 2025 1:07 AM | Updated on Apr 24 2025 1:07 AM

ECI begins training booth-level agents of political parties

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తొలి సారిగా బూత్‌ లెవల్‌ ఏజెంట్‌(బీఎల్‌ఏ) లకూ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల ప్రక్రియలో క్షేత్రస్థాయిలో రాజకీయపార్టీల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎలక్షన్‌ కమిషన్‌..  బీఎల్‌ఏలకు శిక్షణ ఇవ్వడం మొదలెట్టింది. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెమొక్రసీ అండ్‌ ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఐడీఈఎం) భవనంలో ఈ శిక్షణ ఆరంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో బిహార్‌లోని 10 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 280 మంది బీఎల్‌ఏలకు శిక్షణ ఇస్తున్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్, ఎలక్షన్‌ కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, వివేక్‌ జోషీలు బీఎల్‌ఏలనుద్దేశిస్తూ ప్రసంగించారు. మార్చి నాలుగోతేదీన జరిగిన చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్ల సమావేశంలో బీఎల్‌ఏల శిక్షణ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ప్రతినిధుల చట్టం, 1950, 1951, ఎలక్టర్‌ రిజిస్ట్రేషన్‌ నిబంధనలు–1960, ఎన్నికల నిబంధనల అమలు–1961లతో సమ కాలీనంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన నియమనిబంధనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా బీఎల్‌ఏలు నడుచు కునేలా ఈ శిక్షణా కార్యక్రమం ఎంతగానో దోహదంచేయనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం తమ పాత్ర, బాధ్యతలు ఎలాంటివో ఈ శిక్షణ తర్వాత బీఎల్‌ఏలకు మరింత స్పష్టమైన అవగాహన వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ఆశిస్తోంది. ఇందుకోసమే బీఎల్‌ఏలకు శిక్షణా కార్యక్రమం ఆచరణ లోకి వచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement