
న్యూఢిల్లీ: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురిపై నుంచి కారును పోనిచ్చిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలోని శివ క్యాంప్ సమీపంలో చోటుచేసుకుంది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు జంటలతో పాటు ఎనిమిదేళ్ల బాలిక.. మొత్తం ఐదుగురు పైకి డ్రైవర్ ఉత్సవ్ శేఖర్ (40) కారును ఎక్కించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమయంలో శేఖర్ మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు.
కారు డ్రైవర్ ఉత్సవ్ శేఖర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికే.. స్థానికులు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బాధితులను లాధి (40), ఆమె ఎనిమిదేళ్ల కుమార్తె బిమ్లా, భర్త సబామి అలియాస్ చిర్మా (45), రామ్ చందర్ (45), అతని భార్య నారాయణి (35)గా గుర్తించారు. వీరందరూ రాజస్థాన్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, సంఘటనల ఖచ్చితమైన క్రమాన్ని నిర్ధారించేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.