
మండి: విపత్తులు జంతువులకు ముందే తెలుస్తాయంటారు. అది నిజమని మరోసారి నిరూపించిందో శునకం. హిమాచల్‌లో వరదలను ముందుగా హెచ్చరించి 67 మంది ప్రాణాలను కాపాడింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నది తెలిసిందే. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కనీసం 78 మంది మరణించారు. 50 మంది కొండచరియలు విరిగిపడటంతో మృత్యువాత పడగా.. 28 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
అయితే.. మండిలోని ధరంపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామంలో 67 మంది త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సియాతి నివాసి నరేంద్ర ఇంట్లో ఓ శునకం ఉంది. ప్రమాదం సంభవించిన జూన్ 30న అది ఇంట్లోని రెండో అంతస్తులో పడుకుంది. బయట బోరున వర్షం. ఉన్నట్టుండి కుక్క మొరగడం ప్రారంభించింది. అది విని.. నరేంద్ర నిద్ర నుంచి లేచాడు. రెండో అంతస్తుకు వెళ్లాడు. అప్పటికే ఇంటి గోడలో పెద్ద పగుళ్లు కనిపించాయి. నీరు లోపలికి రావడం ప్రారంభమైంది. వెంటనే కుక్కతో పాటు కిందకు పరిగెత్తి అందరినీ నిద్రలేపాడు. ఇళ్లనుంచి సురక్షిత ప్రాంతాలకు పారిపోవాలని అందరినీ కోరాడు.
వాళ్లు అలా వెళ్లిన కొద్దిసేపటికే, గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పదికి పైగా ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఆ గ్రామంలో ఇప్పుడు నాలుగైదు ఇళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలినవి కొండచరియల శిథిలాల కింద ఉన్నాయి. ప్రాణాలతో బయటపడిన వారు ఏడు రోజులుగా త్రియంబాల గ్రామంలో నిర్మించిన నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. శునకం అప్రమత్తం చేయకుండా ఉంటే.. అంతమంది ప్రాణాలు నిద్రలోనే పోయేవని గ్రామస్తులు చెబుతున్నారు.