నేడే డీకే ప్రమాణ స్వీకారం | DK Shivakumar swearing-in ceremony on june 03 | Sakshi
Sakshi News home page

నేడే డీకే ప్రమాణ స్వీకారం

Jun 3 2026 6:01 AM | Updated on Jun 3 2026 12:43 PM

DK Shivakumar swearing-in ceremony on june 03

ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌తో డీకే శివకుమార్‌

దాదాపు 14 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం

హాజరుకానున్న ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్, సూర్జేవాలా  

బెంగళూరు: డీకే శివకుమార్‌ బుధవారం కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లోక్‌భవన్‌లో సాయంత్రం 4.05 గంటలకు నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. డీకే శివకుమార్‌తోపాటు మరి కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత గత నెల 30న డీకే శివకుమార్‌ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి పాలి త రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలను కూడా ఆహ్వానించారు. 

మంత్రివర్గం కూర్పుపై....  
డీకే శివకుమార్, సిద్ధరామయ్య మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. కేబినెట్‌ కూర్పుపై వారు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీతో వారిద్దరూ భేటీ అయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా కూడా పాల్గొన్నారు. తర్వాత వేణుగోపాల్, సూర్జేవాలాను సిద్ధరామయ్య, శివకుమార్‌ ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఎవరెవరికి మంత్రి పదవులు కట్టబెట్టాలన్న దానిపై వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

తన రాజకీయ ప్రస్థానానికి సోనియా గాంధీ కుటుంబం అందించిన సహకారానికి డీకే శివకుమార్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో సమావేశమై తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పాత, కొత్త కలయికగా మంత్రివర్గం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీనియర్‌ నేతలు కేజే జార్జ్, రామలింగారెడ్డి, ఎంబీ పాటిల్, ఈశ్వర ఖండ్రె,  జి.పరమేశ్వర్, సతీశ్‌ జార్కిహొళి, కేహెచ్‌ మునియప్ప, ఎస్‌ఎస్‌ మల్లికార్జున్, యూటీ ఖాదర్, హెచ్‌కే పాటిల్, హెచ్‌సీ మహదేవప్ప, శివానంద పాటిల్, భైరతి సురేశ్, చెలువరాయస్వామిల పేర్లు వినిపిస్తున్నా యి.

ఒక్కరి కంటే ఎక్కువ మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒక దళిత నేతను తప్పనిసరిగా ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టబోతున్నట్లు సమాచారం. జి.పరమేశ్వర, ప్రియాంక్‌ ఖర్గేలో ఒకరికి ఈ పదవి దక్కేందుకు ఆస్కారం ఉంది. సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. కొత్త స్పీకర్‌గా ఆర్‌వీ దేశపాండే, హెచ్‌కే పాటిల్‌ పేర్లు ప్రస్తావనకు వచ్చా యి. కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవిని సతీశ్‌ జార్కిహొళికి ఇస్తామని ప్రతిపాదించగా, ఆయన మంత్రి పదవిని కోరుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది.  

సీడబ్ల్యూసీ సభ్యుడిగా సిద్ధరామయ్య  
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడిగా నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారానికి ఒక్క రోజు ముందు సిద్ధరామయ్యను సీడబ్ల్యూసీ సభ్యుడిగా నియమించడం విశేషం. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్రంలో అధికార మార్పిడికి వీలుగా సిద్ధరామయ్య ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు.  

‘కావేరి’లోనే సిద్ధరామయ్య
సిద్ధరామయ్య బెంగళూరులోని సీఎం అధికారిక నివాసమైన ‘కావేరి’లోనే నివసించనున్నారు. నూతన సీఎం డీకేకు మరో ప్రభుత్వ నివాసాన్ని కేటాయించబోతున్నారు. ఈ మేరకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. సిద్ధరామయ్య 2028 దాకా ‘కావేరి’లోనే ఉంటారు. డీకే శివకుమార్‌ కొన్నిరోజుల పాటు తన సొంత ఇంటి నుంచే కార్యకలాపాలు సాగిస్తారు. తర్వాత ప్రభుత్వం కేటాయించే నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన నాయకుడు ప్రభుత్వ అధికారిక నివాసంలో ఉండడం ఇదే మొదటిసారి కాదు. 2021లో అప్పటి సీఎం యడ్యూరప్ప రాజీనామా చేశారు. అయినప్పటికీ ‘కావేరి’లోనే చాలారోజులు నివసించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement