
ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వందల మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు మాట మార్చాడు. తనతో బలవంతంగా ఈ ప్రకటన చేయించారని సిట్ ఎదుట మరో ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో.. ఆ వ్యక్తిని మరోసారి ప్రశ్నించడంతోపాటు తవ్వకాలను ఆపేయాలని సిట్ నిరణయించింది.
‘నాకు ఒకరు పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారు. న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు. నేను 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నా’ అని సోమవారం ఆ వ్యకతి ప్రకటించాడు. దీంతో ముసుగు వ్యక్తిని ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతీ తెలిపారు. మరోవైపు..
భీమా, చిన్నయ్యగా కన్నడ మీడియా పిలుస్తున్న ముసుగు మనిషికి లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలని కర్ణాటక విధానసభలో బీజేపీ సభ్యులు సోమవారం డిమాండ్ చేశారు. అతడు చూపించిన అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరిపారని, ఒక ప్రదేశంలో మినహా మరెక్కడా కళేబరాలు, అస్థిపంజరాలు లభించలేని హోంమంత్రి పరమేశ్వర్ ప్రకటించారు. యూట్యూబర్లు ఇకపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే..
సిట్ తవ్వకాలు నిలిచిపోవడంపైనా ఆయన స్పందించారు. ఇప్పటిదాకా తవ్వకాల్లో దొరికిన అవశేషాల విశ్లేషణ పూర్తై.. ఆ నివేదిక వచ్చేదాకా సిట్ తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారాయన. అయితే.. అది పూర్తిగా సిట్ సొంత నిర్ణయమని, ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారాయన.