
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ జరిపిన కాల్పులకు ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’(Operation Sindhur)లో సాధించిన విజయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా కేవలం మూడు నిమిషాల్లో 13 శత్రు స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని ఆర్మీకి చెందిన కల్నల్ ఒకరు మీడియాకు తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మే 6- 7 తేదీల మధ్య రాత్రి శత్రువులు రెండు మోర్టార్ బాంబులను(Mortar bombs) పేల్చారు. మేము ముందస్తు సమన్వయంతో కూడిన కాల్పుల ప్రణాళికతో శత్రువులకు చెందిన 13 పోస్టులను (బంకర్లు) నాశనం చేశాం. ఇందుకు మాకు కేవలం మూడు నిమిషాలు పట్టింది. ఆ సమయంలో ప్రతి జవాన్ సిద్ధంగా ఉన్నారని, కమాండర్, ఉన్నత ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలు అందరికీ అందాయని అన్నారు. అలాగే శత్రువులపై ఏ ఆయుధాలను ప్రయోగించాలో, వారికి గరిష్ట నష్టం కలిగించడానికి ఎంత సమయం పడుతుందో తమకు ముందుగానే తెలుసన్నారు.
మే 6-7 తేదీల మధ్య రాత్రి వేళ తాము సాగించిన ప్రతీకార దాడులను చూసిన శత్రు సైన్యం, మళ్లీ ఇలాంటి తప్పు చేసేందుకు వందసార్లు ఆలోచించేలా బదులిచ్చామని ఆ కల్నల్ పేర్కొన్నారు. పహల్గామ్‌లో పాక్ ఉగ్రవాదులు 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్నందుకు ప్రతిస్పందనగా భారత్ ఈ సైనిక చర్య చేపట్టింది. లష్కరే తోయిబా శాఖ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ ఘటన భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచింది.
ఇది కూడా చదవండి: Rajiv death anniversary: ఆ రోజు ఏం జరిగింది? గంధపు దండే ప్రాణాలు తీసిందా?