Rajiv death anniversary: ఆ రోజు ఏం జరిగింది? గంధపు దండే ప్రాణాలు తీసిందా? | Rajiv Gandhi 34th Death Anniversary his Killing and how it was Executed | Sakshi
Sakshi News home page

Rajiv death anniversary: ఆ రోజు ఏం జరిగింది? గంధపు దండే ప్రాణాలు తీసిందా?

May 21 2025 10:16 AM | Updated on May 21 2025 10:24 AM

Rajiv Gandhi 34th Death Anniversary his Killing and how it was Executed

అది 1991, మే 21.. తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో యావత్‌దేశం కంటతడిపెట్టే ఉదంతం చోటుచేసుకుంది. నాటి దేశ యువ ప్రధాని రాజీవ్‌గాంధీ విద్రోహుల ఘాతుకానికి బలయ్యారు. ఈ రోజు (మే 21, 2025) రాజీవ్‌గాంధీ 34వ వర్థంతి. ఇంతకీ నాడు రాజీవ్‌ హత్య ఎలా జరిగింది? ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజీవ్‌ గాంధీ ఎలా ప్రాణాలు కోల్పోయారు? వివరాల్లోకి వెళితే..

మరకతం చంద్రశేఖర్‌కు మద్దతుగా..
శ్రీ పెరంబుదూర్.. చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. నాడు రాజీవ్‌ గాంధీ ఎన్నికల ప్రచారం చేయాల్సిన ప్రాంతం ఇదే. ఇందిరాగాంధీకి సన్నిహిత మిత్రురాలైన మరకతం చంద్రశేఖర్ అనే సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు అక్కడి నుంచే పోటీ చేస్తుండడంతో ఆమె తరఫున ప్రచారం చేయడానికి రాజీవ్‌గాంధీ ఒప్పుకున్నారు. దీంతో పెరంబుదూర్‌లోని ఒక మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన నిర్వాహకులు రాజీవ్ వచ్చేవరకు ప్రజలను ఉత్సాహపరిచేందుకు సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. జరగబోయే దారుణం తెలియని ప్రజలు రాజీవ్‌ను చూడడానికి తండోపతండాలుగా తరలి వచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్‌కే రాఘవన్‌ సభాస్థలి వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

పటిష్టంగా లేని బారికేడ్లు..
దాదాపు 300 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారు. ఈ ఏర్పాట్లు రాఘవన్‌కు సంతృప్తి కలిగించలేదు. రాజీవ్ నడిచే ఎర్ర తివాచీకి ఇరు వైపులా కట్టిన బారికేడ్లు గట్టిగా లేవన్నారు. ఈ వాదనను స్థానిక నేతలు పట్టించుకోలేదు. జనాన్ని కంట్రోల్ చేసే బాధ్యతను మరకతం అసిస్టెంట్ ఏజే దాస్‌కు అప్పగించారు. రాజీవ్ వద్దకు ఎవరిని అనుమతించాలనే జాబితాను ఆయనే చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న లతా కణ్నన్‌.. తన కుమార్తె కోకిలను ఆ లిస్ట్‌లో చేర్చాలంటూ దాస్‌పై ఒత్తిడి తెచ్చారు. లతా కణ్నన్ మరకతం కుమార్తె లతా ప్రియకుమార్ దగ్గర పని చేస్తుండేవారు. అయితే లతా కణ్నన్ ఎంత బతిమాలినా దాస్ ఒప్పుకోలేదు. చివరకు లతా ప్రియాకుమార్ చెప్పడంతో రాజీవ్‌కు అభివాదం చేసే 24మందిలో కోకిలను చేర్చడానికి ఒప్పుకున్నాడు.

ఫ్లైట్‌ రిపేర్‌ కాకుంటే..
ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజీవ్‌గాంధీ వైజాగ్‌ నుంచి బయల్దేరడానికి రెడీ అవుతున్నారు. అయితే విమానంలో లోపం ఏర్పడినట్లు కెప్టెన్ చందోక్ గుర్తించారు. కమ్యూనికేషన్ సిస్టమ్ పని చేయడం లేదని కనుక్కున్నారు. స్వతహాగా పైలట్ అయిన రాజీవ్ దానిలోని లోపాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. ఇక ప్రయాణం లేదని అనుకుంటూ రాజీవ్‌ హోటల్‌కు వెళ్లిపోయారు. పరిస్థితి అలాగే ఉంటే రాజీవ్‌ బతికే ఉండే వారేమో కానీ కాసేపటికే ఫ్లైట్ రిపేర్ అయిందంటూ సమాచారం రావడంతో రాజీవ్ తిరిగి విమానం వద్దకు వచ్చేశారు.

స్వయంగా ఫ్లైట్ నడుపుతూ..
సాయంత్రం 6.30కి రాజీవ్ స్వయంగా ఫ్లైట్ నడుపుతూ రాత్రి 8.20 నిమిషాలకు మద్రాస్‌లోని మీనంబాకం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి బుల్లెట్ ప్రూఫ్‌ కారులో మరకతం చంద్రశేఖర్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు వాళప్పాడి రామ్మూర్తి, పర్సనల్ సెక్యూరిటీ అధికారులతో కలసి రాజీవ్ బయల్దేరారు. న్యూయార్క్ టైమ్స్, గల్ఫ్ న్యూస్ పత్రికలకు కారులో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన దారిలో పోరూరు, పూనమల్లిల్లో ప్రసంగించారు. అలా పెరంబుదూర్ వైపు ఆయన ప్రయాణం సాగింది. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో రాజీవ్ పెరంబుదూర్ చేరుకున్నారు.

జనం మధ్యకు కళ్లద్దాల యువతి
రాజీవ్ రాకతో సభా ప్రాంగణం సందడిగా మారిపోయింది. ముందుగా సభా స్థలి దగ్గర్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూల మాల వేసిన రాజీవ్ అక్కడి నుంచి సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. రాజీవ్‌ను చూడడానికి ప్రజలు పోటీపడ్డారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో లతా కణ్నన్ తన కూతురుతో సహా స్టేజీ దగ్గరకు చేరుకున్నారు. అయితే ఇంతలో ఊహించని విధంగా కళ్లద్దాలు పెట్టుకున్న ఓ యువతి.. గంధపు దండ చేతిలో పట్టుకొని లోపలికి వచ్చేసింది. మరో ఇద్దరు అమ్మాయిలు నళిని, శుభలతో కలసి మహిళా విభాగంలో కూర్చుంది.

అభివాదాలు, పూలమాలలు స్వీకరిస్తూ..
రాజీవ్ చకచకా నడుస్తున్నారు. ఆయన వెంట మరకతం చంద్రశేఖర్ కార్యకర్తలను అదుపు చేస్తూ, పరుగులు పెడుతున్నారు. స్టేజి వద్దకు వచ్చిన రాజీవ్‌ అభిమానుల నుంచి అభివాదాలు, పూలమాలలు స్వీకరిస్తున్నారు. లత కణ్నన్ కూడా తన కూతురు కోకిలని పరిచయం చేసింది. ఇదే అదనుగా కోకిల వెనన నిలుచున్న కళ్లద్దాల యువతి.. రాజీవ్‌ ముందుకు రావడానికి ప్రయత్నించింది. ఐతే మహిళా ఎస్‌ఐ అనసూయ ఆమెను ఆపేయడంతో ఆ యువతి నిరాశ చెందింది.

20 అడుగుల ఎత్తున మంటలు
ఎస్‌ఐ వద్దన్నప్పటికీ రాజీవ్‌ అంగీకరించడంతో కళ్లద్దాల యువతి రాజీవ్‌ వద్దకు చేరింది. తాను తీసుకొచ్చిన గంధపు పూలమాలను రాజీవ్ మెడలో వేసే ప్రయత్నం చేసింది. ఆ దండని స్వీకరించడానికి రాజీవ్ కొద్దిగా తల వంచారు. ఆయన మళ్లీ తల ఎత్తేలోపే ఆ యువతి పాదాభివందనం చేయడానికి అన్నట్లు కిందకు వంగింది. అంతే చెవులు బద్దలైపోయేంత శబ్దంతో మైదానం మారుమోగిపోయింది. దాదాపు 20 అడుగుల ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. స్జేజ్ చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్మకుంది. హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అప్పటి వరకు చిరునవ్వులు చిందించిన రాజీవ్‌ను మృత్యువు కబళించింది. 

ఇది కూడా చదవండి: జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement