సాక్షి, తాడేపల్లి: సత్యమేవ జయతే అని మహాత్మా గాంధీజీ చెప్పినట్టు తిరుమల లడ్డూ విషయంలోనూ నిజమైందని.. సీబీఐ సిట్ ఛార్జిషీట్ ద్వారా కూటమి నాయకులు చేసిన కుట్రలు, చెప్పిన అబద్ధాలు ప్రజలకు తెలిసిపోయాయని వైఎస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహాత్మా గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్ని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాల నుంచి స్ఫూర్తి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలని, ఆయన చూపించిన అహింసా మార్గంలోనే సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పేద రైతు కూలీలు, కార్మికుల కోసం ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై వారు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ హయాంలో గాంధీజీ స్ఫూర్తితో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారని, శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం ద్వారా వందేళ్ల తర్వాత భూ సర్వేనిర్వహించి దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారని కొనియాడారు. వారు ఇంకా ఏమన్నారంటే..
కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్, పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు వెన్నపూస రవీంద్రరెడ్డి, మలసాని మనోహర్‌రెడ్డి, నలమారు చంద్రశేఖర్ రెడ్డి, అంకంరెడ్డి నారాయణ మూర్తితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చివరికి సత్యమే గెలిచింది: లేళ్ల అప్పిరెడ్డి
శాంతి, సత్యం అహింస ఆయుధాలుగా దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు మహాత్మా గాంధీజీ. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరికీ స్వాతంత్ర్య కాంక్షను రగిలించడంలో ఆయన చేసిన కృషికి కొలమానం లేదు. భారత జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించి ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన చూపిన తెగువ, మహాత్ముడు చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శం. గాంధీజీ మనదేశంలో పుట్టడం మన అదృష్టం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
రాజకీయ కక్షలు, దోపిడీ, అరాచకాలతో పాలన సాగిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడుకుంటూ నిర్వీర్యం చేశారు. పౌరుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వాన్ని విమర్శించిన వారి మీద గంజాయి, దేశద్రోహం కేసులు పెడుతున్నారు. ఆఖరుకి రాజకీయ లబ్ధి కోసం దిగజారిపోయి తిరుమల లడ్డూ గురించి విష ప్రచారం చేశారు. అయినా సరే సత్యమేవ జయతే అన్నట్టు సీబీఐ దర్యాప్తు తర్వాత లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని తేలిపోయింది.
గాంధీజీ మార్గం అనుసరణీయం: దొంతిరెడ్డి వేమారెడ్డి
ఆంగ్లేయుల నిరంకుశ పాలన నుంచి దేశానికి స్వేచ్ఛా ఊపిరి ఊదిన మహాత్మా గాంధీ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. దేశం కోసం నిస్వార్థంగా ఆయన చేసిన పోరాటం, త్యాగం దేశప్రజలంతా నిత్యం స్మరించుకుంటారు. ఆయన చూపించిన అహింసా మార్గంలో సమస్యలపై ప్రతిఒక్కరూ పోరాడాలి.

గుంటూరు, కృష్ణా జిల్లాలతో అనుబంధం: మల్లాది విష్ణు
మహాత్మా గాంధీజీకి గుంటూరు, కృష్ణా జిల్లాలతో మంచి అనుబంధం ఉంది. ఉప్పు సత్యాగ్రహం, చీరాల-పేరాల ఉద్యమం ప్రారంభించారు. ఆయన ఇక్కడి నాయకులను స్వాతంత్ర్య పోరాటంలో కార్యోన్ముఖుల్ని చేసి ముందుకు నడిపించారు. శాంతి, అహింసా మార్గంలో ఓర్పు సహనంతో బ్రిటీష్ నిరంకుశంత్వంపై పోరాడి విజయం సాధించడంలో గాంధీజీ పాత్ర గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. ఆయన మార్గంలోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా అవిశ్రాంతంగా పోరాటం చేశారు. రాష్ట్రంలో వలసల నివారణకు ఆయన పేరుతోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురంలో ప్రారంభించారు. రైతు కూలీలు, కార్మికులకు అండగా నిలబడ్డారు. వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేసి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి చూపించారు. అవినీతి, పక్షపాతానికి తావులేకుండా గడప వద్దకే పాలన అందించారు.
అంటరానితనంపైనా పోరాటం: గోరంట్ల మాధవ్
స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వారిపై యుద్ధం చేయడమే కాకుండా దేశంలో వేళ్లూనుకుని ఉన్న అస్ప్రశ్యత నివారణ కోసం దీనజనోద్ధరణ కోసం గాంధీజీ పోరాటం చేసి విజయం సాధించారు. అంటరానితనంతో వెనుకబడిన వర్గాలకు జరుగుతున్నఅన్యాయంపై గళమెత్తి వారికి అండగా నిలబడ్డారు. ఆయన చూపించిన మార్గంలోనే వైయస్ జగన్ గారు ఐదేళ్ల పాలన అందించడంతో పాటు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.

అణుబాంబుల కన్నా అహింసే పవర్‌ఫుల్: జూపూడి ప్రభాకర్
అంటరానితనాన్ని దేశం పారద్రోలాలంటే న్యాయవాద వృత్తిని వదిలేయడమే కాకుండా తన వేషధారణలో మార్పులు చేసి అతి సామాన్యుడిగా మారిపోయాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంపను చూపించాలని అహింసా మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప సామాజిక మేధావి గాంధీజీ. అణుబాంబుల కన్నా గొప్పదైన అహింసా శాంతి సందేశాన్ని పంపాడు. ఐదేళ్ల వైయస్సార్సీపీ పాలనలో గాంధీజీ వైయస్ జగన్ గారు గాంధీజీ అడుగుజాడల్లోనే నడిచారు.

గాంధీజీ పేరును తీసేయడం దుర్మార్గం - వెలంపల్లి శ్రీనివాస్
మహాత్మా గాంధీ చూపించిన అహింసా మార్గం అందరికీ అనుసరణీయం. ఆయన అడుగుజాడల్లో నడిచి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. రైతు కూలీలకు పనులు కల్పించి వారికి చేదోడుగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో దివంగత వైయస్సార్ తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం ఎన్నో లక్షల కుటుంబాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చింది. ఇలాంటి పథకం నుంచి గాంధీ పేరును తీసేయడం ఆయన్ను అవమానించడమే


