
న్యూఢిల్లీ: కుంభమేళా సమయంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న విషాదానికి దారితీసిన కారణాలపై రాజ్యసభలో ఒక సభ్యుడు అడిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. స్టేషన్‌లో అత్యంత రద్దీగా ఉన్న సమయంలో మెట్లపై నుంచి వస్తున్న ఎవరో ప్రయాణికుని తలపై నుంచి భారీ లగేజీ పడిపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నదని తెలిపారు.
2025 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందగా, 15 మంది గాయపడ్డారు. అది ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతున్న సమయం కావడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంజీ లాల్ సుమన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, మంత్రి అశ్విని వైష్ణవ్ తన లిఖిత పూర్వక సమాధానంలో.. నాటి దురదృష్టకర ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ అందించిన నివేదిక వివరాలను తెలియజేశారు.
రైల్వే మంత్రి ఆ ఘటనను ‘తొక్కిసలాట’ అని పేర్కొననకుండానే వివరాలు అందించారు. విషాదం జరిగిన రోజున, రైల్వే స్టేషన్‌లో 49 వేల జనరల్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇది రోజువారీ సగటు కంటే 13 వేలు ఎక్కువ అని వైష్ణవ్ గత మార్చిలో లోక్ సభకు తెలియజేశారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన ఆయన ఆరోజు స్టేషన్‌కు అధిక సంఖ్యలో చేరుకున్న ప్రయాణీకులను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారని, రాత్రి 8.15 గంటల తర్వాత ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరిగింది. వీరిలో చాలామంది ప్రయాణికులు పెద్ద లగేజీలను తలపై మోస్తున్నారు. ఇది ప్రయాణికుల కదలికలను అమితంగా ప్రభావితం చేసింది.
ఇంతలో ప్రయాణికులలోని ఒకరి తలపై నుండి పెద్ద లగేజీ అమాంతం కింద పడిపోవడంతో దుర్ఘటన సంభవించింది. మెట్లపై ఉన్న ప్రయాణికులు జారిపడ్డారు. ఈ ఘటన రాత్రి 8.48 గంటలకు జరిగిందని మంత్రి చెప్పారు. పెద్ద లగేజీ ఒక్కసాగిగా పడగానే ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారని ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ. లక్ష పరిహారం అందించామని, మొత్తం 33 బాధిత కుటుంబాలకు రూ. 2.01 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వైష్ణవ్ తన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. ఈ ఘటన దరిమిలా రైల్వేలు భద్రత కోసం నూతన చర్యలను అమలులోకి తెచ్చాయి. శాశ్వత హోల్డింగ్ ప్రాంతాలు, విశాలమైన ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలు, సీసీటీవీ కెమెరాలు, ప్రధాన స్టేషన్లలో వార్ రూమ్‌లు ఏర్పాటు చేశారని చెప్పారు.