వేర్వేరు మార్గాల్లో జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్న నిరసనకారులు
చిన్నపాటి రోడ్లు, సందుల గుండా ప్రయాణం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జంతర్‌మంతర్ వద్ద ధర్నాను ఎలాగైనా విజయవంతం చేయాలన్న నిరసనకారుల సంకల్పం పోలీసులను కొంతమేర బురిడీ కొట్టించగలిగింది. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా వేర్వేరు మార్గాల్లో సెంట్రల్ ఢిల్లీకి చేరుకున్నారు. స్కూటీ, ఆటో, క్యాబ్, కాలినడక వంటి సాధనాలను ఎంచుకున్నారు. శనివారం మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటుచేశారు. కొన్ని ప్రధాన మార్గాలను పోలీసులు మూసివేశారు. వాహనాలను అడ్డుకొని వెనక్కి పంపించారు. కొన్నిచోట్ల దారి మళ్లించారు.
జంతర్‌మంతర్ చుట్టుపక్కల బస్సులను కూడా నిలిపివేశారు. అయితే, చిన్నపాటి రోడ్లు, సందుల్లో రాకపోకలపై ఆంక్షలు లేకపోవడం నిరసనకారులకు కలిసొచ్చింది. చాలామంది ఆటోలు, ద్విచక్ర వాహనాలపై జంతర్‌మంతర్ సమీపంలోకి రాగలిగారు. కొందరు ఆహారం, నీరు కూడా వెంట తెచ్చుకోవడం గమనార్హం. కార్లను మూడు కిలోమీటర్ల దూరంలో నిలిపివేసి, కాలినడకన వచ్చామని కొందరు వెల్లడించారు. రవాణా సౌకర్యం లేనివాళ్లు రెండు గంటలపాటు నడిచిన వచ్చామని చెప్పారు. రోడ్లపై బారికేడ్ల వద్ద బైఠాయించి నినాదాలు చేసిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారిలో చాలామంది చాకచక్యంగా తప్పించుకున్నారు.
తాను మూడు గంటల పాటు స్కూటీపై ప్రయాణించి జంతర్ మంతర్ వరకు రాగలిగానని ఓ యువకుడు చెప్పాడు. కొందరైతే తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకున్నారు. ‘‘ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ దేశం మాత్రం నిలిచి ఉండాలి’’అన్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మాటలను నిరసనకారులు ప్రస్తావించారు. తమ కోసం కాకుండా దేశం కోసమే వచ్చామని అన్నారు. వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. తమ ఏ రాజకీయ పార్టీతోనూ, ప్రజా సంఘాలతోనూ సంబంధం లేదని, స్వచ్ఛందంగానే తరలివచ్చామని పేర్కొన్నారు.
పోలీసులతో దాగుడుమూతలాట
నిరసన సందర్భంగా దాగుడుమూతలాట కూడా కొనసాగింది. బారికేడ్లు, తనిఖీలు, ఆంక్షలు ఉన్నప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. నగరంలో వేలాది మంది పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది మోహరించడంతో వారి కన్నుగప్పి తప్పించుకోవడానికి పబ్లిక్ మరుగుదొడ్లలో దాక్కున్నారు. మరికొందరు శుక్రవారం రాత్రే సమీపంలోని గురుద్వారా బంగ్లా సాహిబ్‌లో మకాం వేశారు. పోలీసులు అక్కడ లేనప్పుడు బయటకు వచ్చారు. జంతర్‌మంతర్ దిశగా దూసుకెళ్లగా, పోలీసులు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
కన్నాట్ ప్లేస్‌లోని ఎన్‌ఎండీసీ వాష్‌రూమ్‌లో 20 మందికి పైగా యువకులు రాత్రంతా దాక్కున్నారు. జంతర్‌మంతర్ వైపు వెళ్లేందుకు సమయం కోసం ఎదురుచూశారు. పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో గుమికూడిన నిరసనకారులు ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్ అంటూ బిగ్గరగా నినదించారు. కేరళ హౌస్‌లో శుక్రవారం రాత్రి నుంచే వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులతో సహా పలువురు సీపీఎం నాయకులు బస చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయటకు వచ్చిన వారిని పోలీసులు నిర్బంధించారు.


