
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా(Delhi Chief Minister Rekha Gupta) మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఢిల్లీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖను కూడా సీఎం రేఖ గుప్తానే పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేఖా గుప్తా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. ఒక లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను సమర్పించారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్(Budget) కంటే ఈ బడ్జెట్ 31.5 శాతం అధికం. ఈ బడ్జెట్‌లో ఢిల్లీ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ఏఏ వరాలను అందించిందంటే..
ఆరోగ్య బీమా
ఢిల్లీ ప్రజలకు ఇకపై రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందుతుందని ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రకటించారు. ‘మహిళా సమృద్ధి యోజన’ కోసం బడ్జెట్‌లో రూ.5,100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం పరిధిలోకి వచ్చే ఢిల్లీలోని ప్రతి మహిళకు ప్రతీనెల రూ. 2,500 ఆర్థిక సహాయం అందుతుందన్నారు.
ఢిల్లీ బడ్జెట్‌లోని కీలక ప్రకటనలు
మూలధన వ్యయం దాదాపు రెట్టింపు చేశారు. గత బడ్జెట్‌లో మూలధన వ్యయం రూ. 15 వేల కోట్లుగా ఉండగా, ఈ బడ్జెట్‌లో దానిని రూ. 28 వేల కోట్లకు పెంచారు.
త్వరలో ఢిల్లీలో ఆయుష్మాన్ యోజన అమలు.
ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ జన ఆరోగ్య యోజనకు అదనంగా మరో రూ. ఐదు లక్షలు జత చేస్తుంది. అంటే రూ. 10 లక్షల కవర్ అందుతుంది. ఈ పథకానికి ₹2144 కోట్లు కేటాయించారు.
మహిళా సమృద్ధి యోజనకు రూ.5,100 కోట్లు కేటాయింపు.
ప్రసూతి వందన పథకానికి రూ.210 కోట్లు.
నీరు, విద్యుత్, రోడ్లు అభివృద్ధికి ప్రణాళికలు.
ఢిల్లీ రోడ్డు రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఎన్‌సీఆర్‌తో అనుసంధానం కోసం రూ.1,000 కోట్లు ఖర్చు.
మహిళల భద్రత కోసం అదనంగా 50 వేల సీసీటీవీల ఏర్పాటు.
జేజే కాలనీ అభివృద్ధికి రూ.696 కోట్లు కేటాయింపు.
ప్రధానమంత్రి గృహనిర్మాణ పథకానికి రూ.20 కోట్లు కేటాయింపు.
100 చోట్ల అటల్ క్యాంటీన్లు ఏర్పాటు. ఇందుకోసం రూ. 100 కోట్ల బడ్జెట్ కేటాయింపు.
ఢిల్లీ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానంతో పాటు గిడ్డంగి విధానాన్ని అమలులోకి తీసుకురానుంది.
సింగిల్ విండో వ్యవస్థ అమలు.పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి.
వ్యాపారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహణ.
ఇది కూడా చదవండి: Bihar: ఆగని పోస్టర్ వార్.. సీఎం నితీష్ టార్గెట్