
ముంబై: ఉష్ణమండల ప్రాంతాల్లో తీరానికి సుదూర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే మాస్క్డ్ బూబీ పక్షి ముంబైలో ప్రత్యక్ష మైంది. ఇవి జన సంచారం ఉన్న చోట కనిపించడం చాలా అరుదు, అనూహ్యమని నిపుణులు అంటున్నారు. గోరెగావ్ ఈస్ట్‌లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీలోని భవానీ బిల్డింగ్‌లో బుధవారం సాయంత్రం బూబీ బర్డ్ వాలింది. ఎన్నడూ చూడని పక్షి కావడంతో స్థానికులు సునీల్ గుప్తా అనే వన్యప్రాణి సంరక్షకునికి సమాచారమిచ్చారు.
ఆయన దానిని జాగ్రత్తగా పట్టుకుని తదుపరి సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు అందజేశారు. సునీల్ గుప్తా గత పదిహేనేళ్లుగా వన్య ప్రాణుల సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ‘బుధవారం సాయంత్రం 5.10 గంటల సమయంలో రెసిడెన్షియల్ సొసైటీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తమ భవనంలోకి ఓ కొత్తరకం పక్షి వచ్చి వాలిందని చెప్పారు. సాయి మొండ్‌కర్ అనే మరో సంరక్షకునితో కలిసి ఆ ప్రాంతానికి హుటాహుటిన వెళ్లాను.
పరిశీలించి చూడగా అది అరుదైన జాతికి చెందిన మాస్క్డ్ బూబీ పక్షిగా తేలింది’అని గుప్తా చెప్పారు. ‘ఇవి సముద్రంలో మారుమూల దీవుల్లో, ముఖ్యంగా అరేబియా సముద్రంలో కనిపిస్తుంటాయి. చేపలు వీటి ఆహారం. తరచూ సమూహాలుగా సంచరిస్తుంటాయి. బలమైన గాలుల తాకిడికో లేదా దారి తప్పో ఇటుగా వచ్చి ఉంటుంది. మనుషులంటే వీటికి చాలా భయం. కాకులు వెంటాడటంతో మరో దారి లేక ఇక్కడికి వచ్చి ఉంటుంది’అని వివరించారు. ‘బూబీ అనే పేరు బోబో అనే స్పానిష్ మాట నుంచి వచ్చింది. బోబో అర్థం హాస్యగాడు. చూడటానికి ఇవి నవ్వు తెప్పించేలా ఉంటాయి. అందుకే వీటికా పేరు వచ్చి ఉంటుంది’అని గుప్తా వివరించారు.
రూపం, లక్షణాలు
మాస్క్డ్ బూబీల తల, ఆపై భాగం బూడిద–గోధుమ రంగులో ఉంటుంది. రెక్కలు ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ముక్కులు పసుపు రంగులో కనిపిస్తాయి. వీటి ముఖం నీలం–బూడిద రంగులోనూ, కళ్లు ముదురు గోధుమ రంగులోనూ ఉంటాయి. పెద్దవయ్యేకొద్దీ ఈకలు ప్రధానంగా తెల్లగా మారుతాయి. ఈ జాతి పక్షులు బలమైన ముక్కు, పొడవైన, కోణాల రెక్కలకు ప్రసిద్ధి చెందింది. సముద్రంలోకి డైవ్ చేసి ఎరను పట్టుకోవడానికి ఇవి మాస్క్డ్ బూబీలకు ఎంతో అనుకూలంగా ఉంటాయి.