
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పేరుతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో 1,200 పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటైంది. దీనిని శుక్రవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ప్రారంభించారు. కార్యక్రమంలో మన్మోహన్ సతీమణి గురుశరణ్ కౌర్, ఇతర కుటుంబ సభ్యులతోపాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.
లైబ్రరీలో మహాత్మాగాం«దీ, జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్, ఇందిరాగాంధీ తదితరులకు సంబంధించిన గ్రంథాలతోపాటు ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ కాంగ్రెస్’, పార్టీ మేనిఫోస్టోలు ఉన్నాయి. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో డాక్టర్ మన్మోహన్ సింగ్ రీసెర్చ్ సెంటర్ అండ్ లైబ్రరీ మన్మోహన్ సింగ్ 93వ జయంతినాడు ప్రారంభమైందని రాహుల్ గాంధీ ఎక్స్‌లో తెలిపారు. గ్రంథాలయంలో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన రాజ్యాంగ సభ సభ్యులతో కూడిన అరుదైన చిత్రం ప్రధాన ఆకర్షణగా ఉంది. ప్రముఖ స్వాతంత్య్ర యోధుల జీవిత చరిత్రలు, ప్రసంగాలు, ఎంపిక చేసిన గ్రంథాలు ఉన్నాయి.