
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మేం తిరిగి తీసుకొస్తాం
రాజ్యసభలో అమిత్ షా
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై రాజ్యసభలో 16 గంటల చర్చకు ప్రభుత్వం తరఫున సమాధానంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పాపం కాంగ్రెస్‌దే అని ధ్వజమెత్తారు. ‘‘ దేశ భద్రత అనేది కాంగ్రెస్ ప్రాధాన్యతాంశాల్లో అస్సలు లేదు. ఓటు బ్యాంక్, బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే కాంగ్రెస్ అజెండా. వీటిపై మాత్రమే కాంగ్రెస్ దృష్టిపెట్టి జాతీయభద్రత వంటి మిగతా కీలకాంశాలను గాలికొదిలేసింది.
దీంతో ఉగ్రవాదం విపరీతంగా విస్తరించింది. దీనికి ఏకైక కారణం కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు, పేలవమైన రాజకీయ విధానాలు. కాంగ్రెస్ ఘోర తప్పిదాల కారణంగానే కశ్మీర్‌లో కొంతభాగం మన చేజారింది. అలా కాంగ్రెస్సే పాకిస్తాన్‌కు పీఓకేను అప్పగించింది. వాళ్లు ఇచి్చన పీఓకేను మేం తిరిగి తీసుకొస్తాం. ఘటన జరిగాక సమీక్ష జరపడం కాంగ్రెస్ విధానం.
అసలు అలాంటివి సంభవించకుండా ముందే అప్రమత్తంగా ఉండటం మా నైజం’’ అని అమిత్ షా అన్నారు. ‘‘పహల్గాం పాశవిక హత్యాకాండలో అమాయకులు చనిపోయారు. వాళ్ల తలకు గురిపెట్టి మరీ ఉగ్రవాదులు తూటాలు పేల్చారు. అదే తీరులో ఆపరేషన్ మహాదేవ్‌లో పహల్గాం ఉగ్రవాదుల తలల్లోకి మేం కూడా తూటాలు దించాం. పహల్గాం బాధిత కుటుంబాలు కోరుకున్నది మేం నెరవేర్చాం.
ఆపరేషన్ మహదేవ్‌లో అంతమైన ముగ్గురు ఉగ్రవాదులకు లష్కరే తోయిబాతో సంబంధాలున్నట్లు ఆర్మీ దర్యాప్తులో స్పష్టమైంది. మహిళలు, చిన్నారుల ఎదుట నీ మతమేంటి? అని అడిగిమరీ అమాయకుల ప్రాణాలు తీసిన పహల్గాం వంటి హేయమైన ఘటన గతంలో ఎన్నడూ జరగలేదు’’ అని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్వయంగా వచ్చి మాట్లాడాలని విపక్షసభ్యులు పట్టుబట్టారు. ఆయన బదులు నేను మాట్లాడుతున్నానని అమిత్ షా సర్దిచెప్పే ప్రయత్నంచేసినా విపక్షసభ్యులు వినిపించుకోకుండా నిరససగా వాకౌట్ చేశారు. తర్వాత అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగించారు.