
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.30,000 కోట్లకు పైగా విలువ చేసే 142 ఎకరాల ‘వారసత్వ’ భూమిని యోగా గురువు రామ్‌దేవ్ సహాయకుడు ఆచార్య బాలకృష్ణకు కేవలం రూ. కోటి వార్షిక అద్దెతో కట్టబెట్టిందని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది.
ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కరణ్ మహారా ఒక ప్రకటనలో ఆచార్య బాలకృష్ణకు భూములు కట్టబెట్టడం అనేది ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద అవినీతి కుంభకోణం అని అన్నారు. జార్జ్ ఎవరెస్ట్ ఎస్టేట్ పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులో జరిగిన ఈ కుంభకోణం బీజేపీ అనుసరించే క్రోనీ క్యాపిటలిజంనకు స్పష్టమైన నిదర్శనమని ఆయన ఆరోపించారు. జార్జ్ ఎవరెస్ట్ భూ కుంభకోణంపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉత్తరాఖండ్‌ను దోపిడీలకు నిలయంగా మార్చివేసిందని, ఈ భూ దందాపై కాంగ్రెస్ నిరంతర పోరాటం సాగిస్తుందన్నారు.
2022 డిసెంబర్‌లో ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ బోర్డు జారీ చేసిన టెండర్‌కు మూడు కంపెనీలు బిడ్డింగ్ చేశాయన్నారు. జాబితాలోని రాజాస్ ఏరోస్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారువా అగ్రి సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతి ఆర్గానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లు రామ్‌దేవ్ సహచరుడు ఆచార్య బాలకృష్ణ ఆధీనంలో ఉన్నాయని మహారా ఆరోపించారు. ఇది టెండర్ నియమాల బహిరంగ ఉల్లంఘన అని ఆయన ఆరోపించారు. రాజాస్ ఏరోస్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 15 ఏళ్ల పాటు రూ. కోటి రూపాయల వార్షిక అద్దెకు ఇచ్చిన జార్జ్ ఎవరెస్ట్ ఎస్టేట్‌లోని 142 ఎకరాల భూమిని.. ప్రభుత్వం ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి రూ. 23.5 కోట్ల రుణం తీసుకొని అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు. ఈ భూ కుంభకోణంపై సీబీఐ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని ప్యానెల్ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.