
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో పొన్నం, అనిల్‌కుమార్, కొండా సురేఖ, మల్లు రవి, మహేశ్‌కుమార్ గౌడ్, శ్రీధర్‌బాబు
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ రాకుండా చేశారు: సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రపతి మా వినతిని వింటే బీసీ కోటా ఇవ్వాల్సి వస్తుందనే అలా చేశారు
బీజేపీది తొలి నుంచీ బీసీ వ్యతిరేక వైఖరే.. బీఆర్‌ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోంది
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయంలో కాంగ్రెస్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇస్తే 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావించే మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వం మొత్తం ఢిల్లీకి వచ్చినా..
‘బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించి పది రోజుల ముందే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరాం. అయితే కాంగ్రెస్ నేతలు అపాయింట్‌మెంట్ కోరాక మోదీ, అమిత్‌షాలు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.
కానీ, రాష్ట్రపతి మా వినతిని వింటే రిజర్వేషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావించి ఆమె అపాయింట్‌మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నట్టుగా మా మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ నిర్ధారణకు వచ్చారు. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో అందుబాటులో ఉంటామని రాష్ట్రపతికి తెలియజేసినా అపా యింట్‌మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వం మొత్తం ఢిల్లీకే వచ్చినా, రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దొరక్కపోవడం శోచనీయం, బాధాకరం, అవమానకరం..’ అని సీఎం పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ బీసీ ద్రోహులు..
‘బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు బీసీ వ్యతిరేకులుగా మారారు. 42 శాతం రిజర్వేషన్లకు బీఆర్‌ఎస్ కనీస నైతిక మద్దతు తెలపడం లేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయంటూ బీజేపీ అడ్డుకుంటోంది. బీజేపీది తొలి నుంచీ బీసీ వ్యతిరేక వైఖరే. మండల్ కమిషన్ సిఫార్సులను అడ్డుకునేందుకు కమండల్ యాత్రను ప్రారంభించింది. మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు యూత్ ఫర్ ఈక్వేషన్ పేరుతో వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీతో అంటకాగుతూ బీఆర్‌ఎస్ శిఖండిలా వ్యవహరిస్తోంది. విధ్వంసకర పాత్ర పోషిస్తోంది. పది రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను, మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించిన బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించడం ఒక్క రోజు పని అని. కానీ చిత్తశుద్ధి లేనందునే బిల్లులు ఆమోదించడం లేదు..’ అని రేవంత్ ధ్వజమెత్తారు.
గల్లీ లీడర్‌లా కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు
‘బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెట్టుకింద ప్లీడర్‌లా, గల్లీ లీడర్‌లా మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయ శాఖ మంత్రిని కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు తీసుకొని వస్తే ఆయనకు కావల్సిన వివరాలన్నీ అందిస్తాం. లేకుంటే ఆయన సమయం చెబితే మేమే ఢిల్లీలో అన్ని గణాంకాలు అందజేస్తాం. ముస్లింలు ముఖ్యమంత్రులు కావద్దనేలా కిషన్‌రెడ్డి మాట్లాడడం సరికాదు. ముస్లింలను తొలగిస్తే రిజర్వేషన్లు పెంచుతామని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలా తొలగిస్తారో.. ఎలా పెంచుతారో వాళ్లు చేసి చూపాలి. రిజర్వేషన్ల పెంపు, ఇతర విషయాల్లో కిషన్‌రెడ్డి అబద్ధాలు చెప్పినంత కాలం నేను నిజాలు చెబుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు.
మోదీని కుర్చీ దింపడమే పరిష్కారం
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అన్ని ప్రయత్నాలు చేశాం. ఇక ముందు ఏం చేయాలనే దానిపై రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)తో భేటీ అవుతాం. మంత్రులు, పీఏసీతో చర్చించిన తర్వాత త్వరలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర సమస్యలన్నింటికీ పరిష్కారం మోదీని కుర్చీ నుంచి దింపడమే. ఇప్పటికైనా రాష్ట్రపతి, మోదీ బీసీ బిల్లులను ఆమోదించాలి..’ అని రేవంత్ కోరారు.
అందుకే రాహుల్ రాలేదు..
‘రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇందిరా భవన్‌లో 4 గంటల పాటు తెలంగాణ కుల సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి సావధానంగా విన్నారని.. వంద మంది ఎంపీలకు వివరించారని సీఎం చెప్పారు. శిబుసోరెన్ అంత్యక్రియలు.. ఓ కేసు విషయమై జార్ఖండ్ వెళ్లినందునే రాహుల్ జంతర్ మంతర్ సదస్సుకు హాజరుకాలేదని వివరించారు.
ఓడిపోవడమే కేసీఆర్‌కు పెద్ద శిక్ష
విలేకరుల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెడతాం. అక్కడేం నిర్ణయిస్తారో చూద్దాం. ఈ విషయంలో ప్రతీకార చర్యలేవీ ఉండవు. కేసీఆర్‌ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. చర్లపల్లి జైలుకు, ఆయన ఫాంహౌస్‌కు పెద్దగా తేడా లేదు. ఆయన ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అక్కడా అదే నాలుగు గోడలు.. పోలీసు పహారా..ఫాంహౌస్‌లోనూ అదే పహారా. ఎన్నికల్లో ఓడిపోవడమే ఆయనకు పడిన పెద్ద శిక్ష.. ’ అని సీఎం వ్యాఖ్యానించారు.
ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే..
ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ లేవనెత్తిన ఓటరు జాబితా అక్రమాలపై ముఖ్యమంత్రి స్పందించారు. ‘ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే. 2018లో కొడంగల్‌లోనే 15 వేల ఓట్లు తొలగించారు. నేను 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయా..’ అని అన్నారు. చిట్‌చాట్ అనంతరం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమి పక్షాల విందుకు రాహుల్‌గాంధీ ఆహ్వానం మేరకు రేవంత్ కూడా హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వివేక్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.