మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Attended Manmohan singh funeral | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్‌

Dec 29 2024 5:59 AM | Updated on Dec 29 2024 5:59 AM

CM Revanth Reddy Attended Manmohan singh funeral

నివాళులు అర్పించిన మంత్రులు పొంగులేటి, సీతక్క

సాక్షి, న్యూఢిల్లీ: అశేష జనవాహిని అశ్రునయనాలు, అధికార లాంఛనాల మధ్య మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. శనివారం జరిగిన అంతిమయాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. పార్థివ దేహం తీసుకెళ్తున్న వాహనంలో రాహుల్‌ గాంధీ పక్కనే కూర్చున్న రేవంత్, నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వరకు ఆయనతో కలిసి వెళ్లారు. అంతకుముందు ఏఐసీసీ కార్యాలయంలో మన్మోహన్‌ పార్థివ దేహానికి మంత్రులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీతక్క నివాళులు అర్పించారు. 

అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలాగే.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, అనిల్‌కుమార్‌ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ తదితరులు అంతిమయాత్రలో పాల్గొని అభిమాన నేతకు తుది వీడ్కోలు పలికారు. 

శ్రద్ధాంజలి ఘటించిన కేటీఆర్‌ 
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొన్నారు. అంత్యక్రియలు నిర్వహించిన నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, దీవకొండ దామోదర్‌రావులతో కలిసి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement