
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో స్వల్ప వ్యవధిలో కిష్ట్‌వార్, పహల్గాంలో రెండో చోట్ల జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆకస్మికంగా ముంచెత్తిన వరదల కారణంగా గురువారం సాయంత్రం (ఐదుగంటల) సమయానికి 33 మంది మరణించారు. 220మంది గల్లంతయ్యారు. ఓవైపు క్లౌడ్ బరస్ట్ మరోవైపు కుండపోత వర్షంతో భారీ ఎత్తున ఆస్తినష్టం,ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గురువారం మధ్యాహ్నం కిష్ట్‌వార్ జిల్లాలోని చషోటీ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. స్థానికులు ఏర్పాటు చేసుకున్న గుడారాలు ఎగిరిపోయాయి. కిష్ట్‌వార్‌లో క్లౌడ్ బరస్ట్ అయిన కాసేపటికే పహల్గాంలో క్లౌడ్ బరస్ట్ జరిగింది. పహల్గాంకు సమీపంలో మెరుపు వరదలు ముంచెత్తాయి. జల ప్రవాహం ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. కిష్ట్‌వార్‌లో మెరుపు వరదలతో 220మంది గల్లంతయ్యారని అధికారులు చెబుతున్నారు.
క్లౌడ్ బరస్ట్‌తో అప్రమత్తమైన రెస్క్యూబృందాలు వరదల్లో చిక్కుకున్న వందల మంది బాధితుల్ని రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాయి.
చషోటీ ప్రాంతంలో ప్రతీ ఏడాది జూలై 25 నుండి సెప్టెంబర్ 5 వరకు మచైల్ మాతా యాత్ర (Machail Mata Yatra) ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ ఏడాది చండీ మాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా మచైల్ మాతా ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు, స్థానికుల మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వరద సంభవించిన చషోటీ ప్రాంతం మచైల్ మాతా యాత్రకు ప్రారంభ ప్రాంతంతో పాటు కిష్ట్‌వార్‌లోని హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో వాహన సదుపాయం ఉన్న చివరి గ్రామం కూడా. దీంతో క్లౌడ్ బరస్ట్ కారణంగా చషోటీ ప్రాంతంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రధాని మోదీ విచారం
జమ్మూ కశ్మీర్‌లోని కిష్ట్‌వార్ క్లౌడ్ బరస్ట్‌పై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.వరదల కారణంగా గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన వారికి సాధ్యమైన ప్రతి సహాయం అందిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
My thoughts and prayers are with all those affected by the cloudburst and flooding in Kishtwar, Jammu and Kashmir. The situation is being monitored closely. Rescue and relief operations are underway. Every possible assistance will be provided to those in need.
— Narendra Modi (@narendramodi) August 14, 2025
ఇప్పటికే ముంచెత్తిన వరద నుంచి గ్రామస్తులతో పాటు భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కిష్ట్‌వార్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పంకజ్ శర్మ తెలిపారు. వరదలపై జమ్మూకశ్మీర్ ఉదంపూర్ ఎంపీ, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అప్రమత్తమయ్యారు. క్లౌడ్ బరస్ట్ జరిగిన ప్రాంతంలోని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. సహాయకచర్యల్ని వేగవంతం చేయాలని అదేశాలు జారీ చేశారు.
Massive cloudburst struck Chishoti area in the Jammu and Kashmir’s Kishtwar district, along the route to the Machail Matta Yatra.
Casualties are feared, though further details and official confirmation are awaited. https://t.co/d5AQMPAbfU pic.twitter.com/xJgI5WrpwP— Rakesh Kumar (@RiCkY_847) August 14, 2025

సీఎం ఒమర్ అబ్దుల్లా విచారం
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కార్యాలయం జిల్లా యంత్రాంగంతో సంప్రదిస్తున్నట్లు, అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. కిష్ట్‌వార్‌లో జరిగిన విషాదంపై సీఎం ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాలు
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పోలీసు,సైన్యం,రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ‘కిష్ట్‌వార్‌లో జరిగిన క్లౌడ్ బరస్ట్ బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలనేది నా ఆకాంక్ష. పౌరులు, పోలీసు,సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారులు రక్షణ, సహాయ కార్యకలాపాలను బలోపేతం చేయాలని, బాధితులకు కావాల్సిన సహాయం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు.