న్యూఢిల్లీ: నీట్-యుజి (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. దీనిపై నిరసనగా ఆన్‌లైన్ వేదికగా పుట్టుకొచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అమెరికా నుండి శనివారం ఉదయం నేరుగా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలపడానికి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ప్రకటించడంతో, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివస్తున్నారు.
కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్
NEET, CBSE, CUET, SSC పరీక్షల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని CJP డిమాండ్ చేస్తోంది. తొలుత అనుమతి కోసం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు రావాలని పిలుపునిచ్చినప్పటికీ, నేరుగా జంతర్ మంతర్ వద్దే నిరసనకు అనుమతి లభించిందని దిప్కే స్పష్టం చేశారు. ‘కాక్రోచ్‌లు వస్తున్నాయి.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్ళిపోతున్నారు’ అంటూ ఆయన 'X' లో తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ నిరసనకు ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కూడా మద్దతు ప్రకటించారు. ఒకవేళ దిప్కేను అరెస్ట్ చేస్తే తాను 6 వారాల పాటు నిరాహార దీక్ష చేస్తానని వాంగ్‌చుక్ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.
చేతిలో పుస్తకం.. గుండెల్లో త్రివర్ణ పతాకం
తన మద్దతుదారులకు అభిజీత్ దిప్కే ఒక వినూత్నమైన పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరు తమ వెంట ఒక పుస్తకాన్ని, దేశ త్రివర్ణ పతాకాన్ని తీసుకురావాలని కోరారు. ఈ ఉద్యమాన్ని పూర్తి శాంతియుతంగా, ప్రేమతో ముందుకు తీసుకెళ్లాలని, విధుల్లో ఉన్న పోలీసులపై కృతజ్ఞతతో వారికి పూలు ఇచ్చి గౌరవించాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి వచ్చే ముందే, తను తన భవిష్యత్తును రాజ్యాంగానికి అప్పగిస్తున్నట్లు ‘#JaiBhim’ హాష్‌టాగ్‌తో ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆన్‌లైన్ వ్యంగ్య వేదికగా ప్రారంభమైన ఈ CJP, ఇప్పుడు దేశవ్యాప్త యువతను కదిలించే ఒక పెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందింది.
ఢిల్లీలో భారీ బందోబస్తు..
ఈ నిరసన పిలుపు నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేవలం న్యూఢిల్లీ పరిధిలోనే 1,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. అయితే, సోషల్ మీడియా సమాచారం ఆధారంగానే తాము ఈ ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, తమకు ఎలాంటి అధికారిక లిఖితపూర్వక విజ్ఞప్తి రాలేదని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, ఈ నిరసనల వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
Landed.
Looking forward to meet you all at Jantar Mantar. Do not forget to carry a book and our Tiranga!
Offer flowers to policemen as a gesture of compassion & gratitude.
We have to lead this movement with love and peace! https://t.co/HgDSf2gX0U— Abhijeet Dipke (@abhijeet_dipke) June 6, 2026


