సాక్షి,చెన్నై: చెన్నై శివారులోని పల్లావరం అనకాపుత్తూరులో లైంగిక వేధింపునకు గురిచేస్తున్న మామను, ఆగ్రహానికి గురైన కోడలు కాయగూరలు నరికే కత్తితో గొంతుపై పొడిచి చంపేసింది. బుధవారం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది.
పోలీసుల కథనం మేరకు తమిళనాడులోని అనకాపుత్తూరు ప్రాంతానికి చెందిన ఇలం పెరుమాళ్ కుమారుడు మణికండన్‌కు పదేళ్ల క్రితం మీనా (38)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు నెలల క్రితం మణికండన్ హఠాత్తుగా మరణించడంతో, భార్య మీనా తన పిల్లలతో కలిసి అత్తమామల ఇంట్లోనే ఉంటోంది. భర్త మరణించిన నాటి నుండి మీనా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఒంటరిగా ఉన్న సమయం చూసి..
రెండు రోజుల క్రితం మణికండన్ తల్లి (మీనా అత్త) కాంచీపురంలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. దీంతో ఇంట్లో మామ ఇలపెరుమాళ్, కోడలు మీనా పిల్లలు మాత్రమే ఉన్నారు. తన భార్య ఊరెళ్లినన్పటి నుంచి ఇలం పెరుమాల్‌లోని కామాంధుడు బయటకు వచ్చారు. మద్యం సేవిస్తూ కోడలిపై కన్నేశాడు. మంగళవారం రాత్రి మద్యం మత్తులో వచ్చిన ఇలం పెరుమాల్ తన కోడలు మీనా గదిలోకి ప్రవేశించి, ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. మామ ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురైన మీనా.. తనను తాను రక్షించుకునే క్రమంలో ఇంట్లో ఉన్న కాయగూరలు కట్ చేసేందుకు ఉపయోగించే కత్తిని తీసుకుని ఇలంపెరుమాళ్ మెడపై బలంగా పొడిచింది. కత్తిపోటు తీవ్రంగా తగలడంతో ఇలపెరుమాళ్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. శంకర్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


