Chandrayaan 3: భూమిపై సంకల్పం.. జాబిల్లిపై సాకారం | Sakshi
Sakshi News home page

Chandrayaan 3: భూమిపై సంకల్పం.. జాబిల్లిపై సాకారం

Published Thu, Aug 24 2023 4:18 AM

Chandrayaan 3: PM Narendra Modi Congratulates ISRO As Chandrayaan Lands On Moon - Sakshi

న్యూఢిల్లీ:  చంద్రయాన్‌–3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. వారికి అభినందనలు తెలియజేశారు. భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడు చంద్రుడిపై భారత్‌ అడుగుపెట్టిందని అన్నారు. ఇది కేవలం భారత్‌ విజయం కాదని చెప్పారు.

ఈ ఘనత ప్రపంచంలోని ప్రజలందరికీ చెందుతుందని చెప్పారు. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ వెళ్లిన మోదీ బుధవారం సాయంత్రం చంద్రయాన్‌–3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు. ల్యాండింగ్‌ సకెŠస్స్‌ అయిన వెంటనే ఇస్రో సైంటిస్టులను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. బ్రిక్స్‌ సదస్సు కోసం ప్రస్తుతం తాను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటికీ తన మనసు, ఆత్మ మొత్తం భారత్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రపంచంలోని బలమైన జీ20 కూటమికి భారత్‌ నాయకత్వం వహిస్తున్న ఈ శుభసందర్భంలో చంద్రయాన్‌–3 ప్రయోగం సఫలం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు. భూగోళంపై మనం తీసుకున్న సంకల్పం చందమామపై నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం చిరస్మరణీయమని తెలిపారు. ఈ అద్భుత క్షణం శాశ్వతంగా మదిలో నిలిచిపోతుందని చెప్పారు.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించిందంటూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదొక చరిత్రాత్మక సందర్భమని ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌కు ఇది ప్రతీక అని చెప్పారు. కొత్త చరిత్రను భారత్‌ లిఖించిందని వెల్లడించారు. నవ భారతదేశంలో నూతన శిఖరాలకు చేరుకుంటున్నామని, అందుకు మనమంతా సాకు‡్ష్యలమని వివరించారు.

శాస్త్రవేత్తల అంకితభావం వల్లే..  
అమృతకాలంలో ఇది మొదటి విజయమని అన్నారు. ఇది అమృత వర్షమని అభివర్ణించారు. ఆకాశమే హద్దు కాదని భారత్‌ పదేపదే నిరూపిస్తోందని ప్రధాని మోదీ చమత్కరించారు. ఇప్పటిదాకా ఎవరూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువానికి భారత్‌ చేరుకుందని ఉద్ఘాటించారు. మన శాస్త్రవేత్తల అంకితభావం, నైపుణ్యం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. చందమామకు సంబంధించిన మన ఊహాగానాలు, ప్రచారంలో ఉన్న కథలు ఇక మారుతాయని, సామెతలు కొత్త తరం కోసం కొత్త అర్థాలను వెతుక్కుంటాయని వ్యాఖ్యానించారు.

భూమిని తల్లిగా, చంద్రుడిని మామగా మనం భావిస్తామని చెప్పారు. ‘చందమామ దూర్‌ కే’ అంటుంటామని, ఇకపై ‘చందమామ ఏక్‌ టూర్‌ కే’ అనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వివరించారు. తద్వారా జాబిల్లిపై పర్యటనలు త్వరలో ప్రారంభమవుతాయని పరోక్షంగా స్పష్టం చేశారు. సూర్యుడిపై పరిశోధనల కోసం ‘ఆదిత్య–ఎల్‌1’ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోందని చెప్పారు. శుక్రగ్రహంపైనా అధ్యయనం చేసే ప్రణాళిక ఉందన్నారు.   అనంతరం ప్రధాని మోదీ ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌తో మాట్లాడారు. అభినందనలు తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement