వీబీ జీ రామ్‌జీపై చర్చ కుదరదు | Centre shuts down Opposition push for debates on MGNREGA: Minister Kiren Rijiju | Sakshi
Sakshi News home page

వీబీ జీ రామ్‌జీపై చర్చ కుదరదు

Jan 28 2026 2:43 AM | Updated on Jan 28 2026 2:43 AM

Centre shuts down Opposition push for debates on MGNREGA: Minister Kiren Rijiju

ఎస్‌ఐఆర్‌ సర్వే పైనా చర్చించడానికి ఏమీ లేదు

స్పష్టంచేసిన మోదీ సర్కార్‌

అఖిలపక్ష భేటీలో అన్నిపార్టీల సహకారం కోరిన కేంద్రం

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి

ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్‌

తొలిసారిగా ఆదివారం పద్దును ప్రవేశపెట్టనున్న మంత్రి నిర్మల

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఉపాధి హామీ పథకంలో సంస్కరణలే లక్ష్యంగా సవరణలో తీసుకొచ్చిన ‘వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్, అజీవికా మిషన్‌(గ్రామీణ్‌)(వీబీ జీ రామ్‌ జీ) చట్టంపై పార్లమెంట్‌లో చర్చ ఉండబోదని మోదీ సర్కార్‌ కుండబద్ధలు కొట్టింది. బుధవారం నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సంప్రదాయం మేరకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది. పార్లమెంట్‌ సమావేశాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌జీనరేగా)పై చర్చించాలని భేటీలో విపక్షాలు పట్టుబట్టడంతో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు మాట్లాడారు. ‘‘దేశంలో ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చాక దానిని మనందరం ఆచరించాల్సిందే. దాని నుంచి మళ్లీ రివర్స్‌గేర్‌లో వెళ్లలేం. వెనకడుగు వేసి మళ్లీ పాత చట్టాన్ని అమలుచేయబోం. అలా ఎన్నటికీ సాధ్యంకాదు. వీబీ జీ రామ్‌జీ చట్టంపై, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) సర్వేపైనా చర్చించడానికి ఏమీ లేదు.

గత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎన్నికల సంస్కరణలపై విస్తృతస్థాయిలో చర్చ జరిగింది. ఆనాడు విపక్ష సభ్యులు గంటల తరబడి మాట్లాడి మాట్లాడి అలసిపోయారు’’ అని రిజిజు వ్యాఖ్యానించారు. ‘‘ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఓటర్లు మమ్మల్ని ఎన్నుకున్నారు. అయితే విపక్ష సభ్యులందరికీ పార్లమెంట్‌లో తమ వాణిని వినిపించే వాక్‌ స్వాతంత్య్రం ఉంది. రామ్‌జీ చట్టం, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ మినహా మిగతా అంశాలను విపక్షాలు ప్రస్తావించవచ్చు. వాళ్ల వాదనలను వినడమూ మా విధే. అంశాలపై చర్చ జరిగేలా చూడాలిగానీ రభస జరిగేలా చూడొద్దు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘సభలో ఏఏ అంశాలపై చర్చిస్తారనే సభాకార్యకలాపాల జాబితాను మేం వెల్లడించట్లేమని విపక్షాలు ఆడిపోసుకుంటున్నాయి. వాస్తవానికి బడ్జెట్‌ సమావేశాల తొలిరోజున రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సభాకార్యకలాపాల షెడ్యూల్‌ను విడుదల చేస్తాం’’ అని రిజిజు స్పష్టం చేశారు.  

ఉదయం 11 గంటలకు సమావేశాలు షురూ
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. 29న కేంద్ర ప్రభుత్వం సామాజిక, ఆర్ధిక సర్వే నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. గతానికి భిన్నంగా తొలిసారిగా ఆదివారం (ఫిబ్రవరి ఒకటో తేదీ) ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో 202627 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. రాజ్యసభ, లోక్‌సభలో దీనికి ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు.

వాడివేడిగానే చర్చలు
ఈ సమావేశాల్లో మోదీ సర్కార్‌ను నిలదీసేందుకు విపక్షాలు పదునైన అంశాల కత్తులు నూరుతున్నాయి. భారత్‌పై అమెరికా పాతిక శాతం అదనపు టారిఫ్‌ల భారం మోపడంతో దేశ వస్త్ర పరిశ్రమ, ఆహార ఎగుమతులు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని, ఇతర రంగాలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయన్నాయని అఖిలపక్ష భేటీలో విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చేసి ఎన్‌డీఏ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వీబీ జీ రామ్‌ జీ చట్టాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎస్‌ఐఆర్‌ సర్వే ప్రక్రియను తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు తప్పుబట్టాయి. ఈ అంశాలపై విపక్షాల ఆరోపణలతో పార్లమెంట్‌ అట్టుడికే అవకాశాలున్నాయి. వీటితోపాటు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, కేంద్రరాష్ట్ర సంబంధాలు, గవర్నర్‌ల తీరు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని కడిగి పారేయాలని విపక్షాలు నిర్ణయించాయి.

సహకరించాలన్న కేంద్రం
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నా«థ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, వైఎస్సార్‌సీపీ, డీఎంకే, టీడీపీ, టీఎంసీ, శివసేన షిండే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల ఫ్లోర్‌ లీడర్లు హాజరయ్యారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు.

అన్ని అంశాలపై చర్చించాలన్న విపక్షాలు
భేటీ అనంతరం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఉపనేత, పార్టీ ఎంపీ ప్రమోద్‌ తివారీ మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ పాలనలో రాజ్యాంగం కలి్పంచిన హక్కులు పూర్తిగా నిరీ్వర్యమయ్యాయి. రాజ్యాంగ సంస్థలు బలహీనపడుతున్నాయి. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది. రాజ్యాంగబద్ధ సంస్ధల్లో ఒకే భావజాలానికి చెందిన వ్యక్తులను నియమించడం ద్వారా సంస్థల స్వతంత్రతను మోదీ సర్కార్‌ దెబ్బతీస్తోంది’’ అని తివారీ మండిపడ్డారు. ‘‘డాలర్‌తో మారకం విలువ ఏకంగా 92 రూపాయలకు పడిపోయింది. రష్యా చమురు కొనుగోళ్లు, అమెరికా టారిఫ్‌ దెబ్బ, జమ్మూకశీ్మర్‌కు రాష్ట్ర హోదా, ఢిల్లీలో దారుణమైన వాయు కాలుష్యం, ఇండోర్‌ మరింత దారుణంగా నీటి కాలుష్యం.. ఇలా ఎన్నో అంశాలపై చర్చకు పట్టుబడతాం’’ అని తివారీ అన్నారు.

చమురు శుద్ధిలో గ్లోబల్‌ లీడర్‌గా..
పెట్టుబడిదారులకు లాభదాయకంగా ఉండేలా చట్టాలు, నిబంధనల విషయంలో పరిశ్రమ వర్గాల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. చమురు శుద్ధిలో భారత్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. త్వరలో గ్లోబల్‌ లీడర్‌గా మారడం ఖాయమని తెలిపారు. ప్రతిఏటా 260 మిలియన్‌ టన్నుల చమురు శుద్ధి సామర్థ్యం ఉందని, దీన్ని 300 మిలియన్‌ టన్నులకు పెంచబోతున్నామని స్పష్టంచేశారు. దేశంలో గ్యాస్‌ పంపిణీలోనూ అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. పట్టణాలు, నగరాల్లో పైప్‌లైన్, గ్యాస్‌ పంపిణీ వ్యవస్థలు వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. దేశంలో పారదర్శకమైన, పెట్టబడిదారులకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. ఇంధన రంగం అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తేల్చిచెప్పారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా, ఇన్నోవేట్‌ ఇన్‌ ఇండియా, స్కేల్‌ ఇన్‌ ఇండియా, ఇన్వెస్ట్‌ ఇన్‌ ఇండియా’ అంటూ ప్రపంచ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement