
‘డీప్ ఓషన్ మిషన్ ’ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం
విలువైన వనరులను వెలికితీయడమే లక్ష్యం
ఇందుకోసం మత్స్య–6000 వాహనం రెడీ
పరిశోధనకు ముగ్గురు వెళ్లేలా రూపకల్పన
చంద్రుడు, అంగారకుడి గురించి తెలిసినంతగా మనకు సముద్రాల గురించి అవగాహన లేదు. అత్యంత స్వచ్ఛమైన, మనిషి నీడ కూడా తాకని వాతావరణాలే కాదు.. మనకు తెలియకుండా దాగి ఉన్న విలువైన వనరులు సైతం విశాలమైన సముద్రాల్లో నిక్షిప్తమై ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. సముద్రం లోపల ఉన్న ఈ విస్తారమైన ప్రాంతాలను అన్వేషించే ప్రయత్నంలో మనదేశం సాహసోపేత ‘డీప్ ఓషన్ మిషన్ ’కు శ్రీకారం చుట్టింది. ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు శుక్లాను పంపినట్టే.. సముద్ర గర్భంలోకి మనుషులను పంపే దిశగా సముద్రయాన్ ప్రాజెక్టుతో అడుగు ముందుకేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
భారత సముద్ర జలాల పరిధిలో విలువైన ఖనిజాలు, ఇంధన వనరులు, ప్రత్యేక జీవవైవిధ్యం వెలికితీయడం లక్ష్యంగా సముద్రయాన్ ప్రాజెక్టు ప్రారంభం అయింది. లోతైన సముద్ర అన్వేషణకు సంబంధించి సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ ఐఓటీ), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు మత్స్య–6000 వాహనం అభివృద్ధి చేశారు. ఇటీవలే ఈ వాహనానికి కీలక వెల్డింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు.
లక్ష్యాన్ని సాధించడానికి..: ‘ప్రస్తుతం మహాసముద్రాల గురించి మనం అర్థం చేసుకున్నది కేవలం 5 శాతమే. 95 శాతం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. విశాలమైన సముద్రపు అడుగుభాగాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని అన్వేషణలు అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి భారత్‌కు సముద్రయాన్ మిషన్ తోడ్పడుతుంది’ అని మిషన్ ను చేపట్టిన భారత ప్రభుత్వ భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
ఈ మిషన్ లో భాగంగా మనుషులను సముద్రమట్టానికి 6,000 మీటర్ల లోతుకు పంపుతారు. గుండ్రని సబ్‌మెర్సిబుల్ నౌక అయిన మత్స్య–6000 ద్వారా సముద్రపు లోతుల్లోకి వెళ్లి పరిశోధనలు సాగిస్తారు. నౌక వ్యాసం 2,260 మిల్లీ మీటర్లు. 80 మిల్లీ మీటర్ల మందంతో నౌక గోడ తయారైంది. టైటానియం–మిశ్రమంతో రూపొందిన గోడలు తీవ్రమైన బాహ్య ఒత్తిళ్లను, –3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు.
ఇప్పటికే పలు పరీక్షలు..: సముద్రంలో జీవ, నిర్జీవ వ్యవస్థలను అంచనా వేయడానికి, లోతైన సముద్ర పర్యాటకానికి గల అవకాశాలకు కొత్త దారులు తెరుస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రయోగం దశలవారీగా చేపట్టేలా ప్రణాళిక రచించారు.
సిబ్బందితో, అలాగే సిబ్బంది లేకుండా ఈ వాహనంతో 2025 జనవరి, ఫిబ్రవరిలో పలు పరీక్షలు పూర్తి చేశారు. 500 మీటర్ల లోతుకు వెళ్లే కీలక పరీక్ష 2025 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ పరిధిలో మత్స్య–6000 వాహనం వెళ్లి రావడానికి 8 గంటల సమయం పడుతుంది. ముఖ్యమైన ఇంధన, ఖనిజ వనరులు అయిన మీథేన్ , కోబాల్ట్ అన్వేషణ సైతం సాగిస్తారు.
రూ.4,077 కోట్ల నిధులు..
డీప్ సీ మైనింగ్ మెషీన్ డిజైన్ సైతం పూర్తి అయింది. గత ఏడాది అండమాన్ సమీపంలో 1,173 మీటర్ల లోతుకు వెళ్లి 100 కిలోలకుపైగా కోబాల్ట్ ఆధారిత పాలీమెటాలిక్ నోడ్యూల్స్‌ను (లోహపు రాళ్లు) ఈ మెషీన్ సేకరించింది. ఈ ప్రాంతంలో 47 లక్షల టన్నుల నికెల్, 42.9 లక్షల టన్నుల కాపర్, 5.5 లక్షల టన్నుల కోబాల్ట్, 9.25 కోట్ల టన్నుల మాంగనీస్ నిల్వలు ఉన్నట్టు అంచనా వేశారు. ఇక సర్వే, అన్వేషణ కోసం పరిశోధన నౌక నిర్మించేందుకు ప్రభుత్వం ఆర్డర్ చేసింది. కేవలం ఈ నౌక కోసం రూ.1,277 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
సముద్ర జీవశాస్త్ర అధ్యయనం కోసం అధునాతన మెరైన్ సెంటర్ రూ.692 కోట్లతో తమిళనాడులో ఏర్పాటుచేస్తున్నారు. కేంద్రం డీప్ ఓషన్ మిషన్ కు 2021–2026 మధ్య రూ.4,077 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది మార్చి నాటికి సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేశారు. హిందూ మహాసముద్రంలో 75,000 చదరపు కిలోమీటర్లు, పశ్చిమ హిందూ మహాసముద్రంలో 10,000 చ.కి.మీ. పరిధిలో సర్వే, అన్వేషణ కొనసాగిస్తారు.
» మత్స్య–6000 వాహనం 6,000 మీటర్ల లోతులో 12 గంటల వరకు నిరంతర కార్యకలాపాలు సాగించేలా రూపొందుతోంది.
» హిందూ మహాసముద్రంలో 75,000 చదరపు కిలోమీటర్లు, పశ్చిమ హిందూ మహాసముద్రంలో 10,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే, అన్వేషణ చేపడతారు.
» సిబ్బందితో, అలాగే సిబ్బంది లేకుండా ఈ వాహనంతో 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 14 వరకు పలు పరీక్షలు పూర్తి చేశారు.
» అండమాన్ సమీపంలో 47 లక్షల టన్నుల నికెల్, 42.9 లక్షల టన్నుల కాపర్, 5.5 లక్షల టన్నుల కోబాల్ట్, 9.25 కోట్ల టన్నుల మాంగనీస్ నిల్వలు ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.
» దశలవారీగా పరీక్షలు పూర్తి చేసుకుని 2026 చివరినాటికి మిషన్ కార్యరూపంలోకి రానుంది.
2026 చివరినాటికి..
మత్స్య–6000 వాహనం 6,000 మీటర్ల లోతులో 12 గంటల వరకు నిరంతర కార్యకలాపాలు సాగించేలా రూపొందుతోంది. అలాగే లోతైన నీటి పరిశీలన, అన్వేషణను నిర్వహించడానికి అత్యవసర సమయాల్లో 96 గంటల వరకు పనిచేయగలిగే సామర్థ్యమూ దీని ప్రత్యేకత. దేశీయంగా అభివృద్ధి చేసిన వెయ్యికి పైగా విడి భాగాలు, వందలాది సాంకేతికతలు వాహన తయారీలో వినియోగించారు.
25 టన్నుల బరువుండే ఈ అత్యాధునిక వాహనంలో ముగ్గురు ప్రయాణించొచ్చు. దశలవారీగా పరీక్షలు పూర్తి చేసుకుని 2026 చివరినాటికి మిషన్ కార్యరూపంలోకి రానుంది. డీఆర్‌డీఓ, ఐఐటీలు, భారత నావికా దళం, మిశ్ర ధాతు నిగమ్ తదితర సంస్థలు కూడా ఈ మిషన్ లో పాలుపంచుకున్నాయి.