ఢిల్లీ పేలుడు ఘటన ఉ‍గ్రవాదుల చర్యే: కేంద్రం | Cabinet Meeting Going On Under the chairmanship of PM Modi | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పేలుడు ఘటన ఉ‍గ్రవాదుల చర్యే: కేంద్రం

Nov 12 2025 6:45 PM | Updated on Nov 12 2025 8:35 PM

Cabinet Meeting Going On Under the chairmanship of PM Modi

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటన ఉ‍గ్రవాదుల చర్యేనని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్‌ ఖండించింది. రెండు నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్‌.. మృతులకు సంతాపం తెలిపింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఉగ్రవాదాన్నిపై జీరో టోలరెన్స్ విధానంతో అణిచివేస్తామని కేబినెట్‌ వెల్లడించింది. ఘటనకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి.. శిక్షిస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేబినెట్‌ సమావేశంతో పాటు కేంద్ర భద్రతా మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో ఎర్రకోట పేలుళ్లు,ఉగ్రవాద నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కారు పేలుడు ఘటనలో తదుపరి కార్యచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు, అంతర్గత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు,  కేంద్ర మంత్రివర్గంలో చర్చి జరిగినట్లు తెలుస్తోంది.

పలు కీలక నిర్ణయాలు..
కాగా, ఎగుమతుల ప్రమోషన్ మిషన్ బలోపేతానికి 25,060 కోట్ల రూపాయల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులకు  ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ మిషన్ కింద రెండు  పథకాలను కేంద్రం నిర్వహించనుంది. నిర్యాత్ ప్రోత్సాహన్, నిర్యాత్ దిశ కొత్త పథకాలను కేంద్రం అమలు చేయనుంది. ఎగుమతి దారులకు 100 శాతం క్రెడిట్ గ్యారెంటీ స్కీం అమలుకు కేబినెట్‌  ఆమోదం తెలిపింది. 20,000 కోట్ల  రూపాయల వరకు ఎలాంటి హామీ లేకుండా ఎగుమతి దారులకు ప్రభుత్వం.. క్రెడిట్ సపోర్ట్ ఇవ్వనుంది.

ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. లాల్‌ ఖిలా మెట్రోస్టేషన్‌ ఒకటో నంబర్‌ గేటు సమీపంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడటంతో ఆగిన హ్యుందాయ్‌ ఐ20 కారులో జరిగిన భారీ పేలుడు ధాటికి కారులోని ముగ్గురు సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పక్కన ఉన్న ఆరు కార్లు, రెండు ఇ–రిక్షాలు, ఆటోలు సైతం తీవ్రస్థాయిలో ధ్వంసమయ్యాయి. దీంతో మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన సమీపంలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది. 

పేలుడు ధాటికి సమీప మార్కెట్‌లోని ప్రజలు, రోడ్లమీద ఉన్న వ్యక్తులు ప్రాణభయంతో పరుగులుతీశారు. తీవ్రస్థాయి పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడ భీతావహవాతావరణం నెలకొంది. మంటలు, హాహాకారా లు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీ సమీప ఫరీదాబాద్‌లో 2,900 కేజీల పేలుడు పదార్థాలను జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ పోలీసుల బృందం స్వాదీనంచేసుకున్న కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం యాధృచ్ఛికం కాదని దర్యాప్తు వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సరిగ్గా సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు లాల్‌ఖిలా మెట్రోస్టేషన్‌ ఎదురుగా ఉన్న సుభాష్‌ మార్గ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఎర్రలైట్‌ పడటంతో కొన్ని వాహనాలు ఆగాయి. అదే సమయంలో ఐ20 మోడల్‌ కారు వెనుకభాగం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఛాందిని చౌక్‌ మార్కెట్‌లోని జనం భయంతో పరుగులు తీశారు. 

పేలుడు ధాటికి సమీప వాహనాలు సైతం మంటల్లో కాలిపోయాయని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సతీశ్‌ గోల్చా మీడియాతో చెప్పారు. ఘటనపై మంత్రి అమిత్‌ షాతో మాట్లాడారు. ఘటన వివరాలను ప్రధాని మోదీ అమిత్‌షాను అడిగి తెల్సుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement