పెరుగుతున్న కేసులు.. కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాపై చేతులెత్తేసిన కేంద్రం

Buy It Yourself: Union Health Minister SaysTo States On Covid Vaccine - Sakshi

న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో అతి ముఖ్యమైన వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్రం.. వ్యాక్సిన్ సరఫరాలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తోంది. తమకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కోరిన పలు రాష్ట్రాల మంత్రులకు వ్యా క్సిన్ సరఫరా చేసేది లేదని, రాష్ట్రాలే సొంతంగా కొనుగోలు చేసుకోవాలని సూచించింది. దీంతో వ్యాక్సిన్ సరఫరాపై కేంద్రం చేతులెత్తేసినట్లయింది.

శుక్రవారం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులు, సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్, అప్రాప్రియేట్ బిహేవియర్ వంటి 5 అంచెల వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలని తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో, వ్యాక్సినేషన్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా పరిస్థితులు రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయని, ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ప్రికాషనరీ డోసులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు చెప్పారు. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో రాష్ట్రంలో నిల్వలు లేకుండా పోయినట్లు చెప్పారు. దీంతో వ్యాక్సినేషన్ నిలిచిపోయిందన్నారు.

రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్ డోసులను తక్షణం సరఫరా చేయాలని మంత్రి హరీష్‌ రావు కోరారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం తమకు వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయిందని, దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలుగుతున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ మాట్లాడుతూ.. కావాల్సిన వ్యాక్సిన్లు ఆయా రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చని, బహిరంగా మార్కెట్లో పుష్కలంగా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా హైదరాబాద్ ఫార్మా సంస్థ బయోలాజికల్ ఇ సహకారంతో 15 లక్షల డోసులు సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన బయోలాజిక్ ఇ ఎండీ మహిమా ధాట్లకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ధన్య వాదాలు తెలిపారు.

కాగా భారత్‌లో కొత్తగా ఆరు వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. నానాటికీ కేసుల సంఖ్య ముందుకే పోతోంది. నిన్నటితో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ.  కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు యూపీ, ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top