బ్రిక్స్‌లోకి మరో ఆరు దేశాలు | Sakshi
Sakshi News home page

బ్రిక్స్‌లోకి మరో ఆరు దేశాలు

Published Fri, Aug 25 2023 5:50 AM

BRICS Summit 2023: Brics to more than double with admission of six new countries - Sakshi

న్యూఢిల్లీ: బ్రిక్స్‌ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న మూడు రోజుల శిఖరాగ్ర భేటీలో ఆఖరు రోజైన గురువారం మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా ఈ మేరకు ప్రకటించారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందని తెలిపారు.

బ్రిక్స్‌ బలం అయిదు నుంచి 11 దేశాలకు పెరగనుంది. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డ సిల్వా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్‌ అధ్యక్ష పీఠంపై ఉన్న దక్షిణాఫ్రికాలో కూటమి శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతోంది. ‘సిద్ధాంతాలు, ప్రమాణాలు, విధానాల ప్రాతిపదికన విస్తరణ ప్రక్రియను ఏకాభిప్రాయంతో చేపట్టాం. మున్ముందు కూడా కూటమిని విస్తరిస్తాం’అని రమఫోసా చెప్పారు.

బ్రిక్స్‌ విస్తరణ, ఆధునీకరణ.. ప్రపంచంలోని అన్ని సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే సందేశం ఇస్తుందని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘బ్రిక్స్‌ విస్తరణకు భారత్‌ మొదట్నుంచీ మద్దతుగా నిలిచింది. కొత్తగా సభ్య దేశాలను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్‌ మరింత బలోపేతమవుతుంది. ఉమ్మడి ప్రయత్నాలకు కొత్త ఊపునిస్తుంది. బహుళ ధ్రువ ప్రపంచ క్రమతపై విశ్వాసం పెంచుతుంది’అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన వర్చువల్‌ ప్రసంగంలో బ్రిక్స్‌ తాజా విస్తరణపై హర్షం వ్యక్తం చేశారు. కూటమిలో సహకారానికి కొత్త అధ్యాయం మొదలైందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు.

బ్రిక్స్‌ భాగస్వామ్య దేశం నమూనా, కూటమిలో చేరాలనుకునే దేశాల జాబితాను ఏడాది జరిగే శిఖరాగ్ర సమ్మేళనం నాటికి సిద్ధం చేసే బాధ్యతను విదేశాంగ మంత్రులకు అప్పగించినట్లు రమఫోసా చెప్పారు. స్థానిక కరెన్సీలు, చెల్లింపు విధానాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంపై నివేదిక రూపొందించాల్సిందిగా బ్రిక్స్‌ ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్లకు సూచించేందుకు అంగీకారానికి వచి్చనట్లు ఆయన వివరించారు. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్‌గా ఏర్పాటయ్యాయి. దక్షిణాఫ్రికా చేరికతో 2010 నుంచి బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది. బ్రిక్స్‌లో చేరేందుకు 40 వరకు దేశాలు ఆసక్తి చూపుతుండగా వీటిలో 23 దేశాలు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుత కూటమి ప్రపంచ జనాభాలో 41%, ప్రపంచ జీడీపీలో 24%, ప్రపంచ వాణిజ్యంలో 16% వరకు వాటా కలిగి ఉంది. పశి్చమదేశాల కూటమికి బ్రిక్స్‌ను ప్రధాన పోటీ దారుగా భావిస్తున్నారు.

ఇరాన్‌ అధ్యక్షుడితో ప్రధాని భేటీ
బ్రిక్స్‌ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఇరాన్‌ అధ్యక్షుడు ౖఇబ్రహీం రైసీ సహా పలు దేశాల నేతలతో సమావేశమయ్యారు. రైసీతో చర్చల సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, ఉగ్రవాదం, అఫ్గానిస్తాన్‌ వంటి ద్వైపాక్షిక అంశాలతో చాబహర్‌ పోర్టు అభివృద్ధిపైనా చర్చించారు. బ్రిక్స్‌లో ఇరాన్‌ చేరికకు మద్దతుగా నిలిచినందుకు ప్రధాని మోదీకి రైసీ కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రయాన్‌–3 విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలియజేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వివరించారు. ప్రధాని మోదీ ఇథియోపియా అధ్యక్షుడు అబీ అహ్మద్‌ అలీ, సెనెగల్‌ అధ్యక్షుడు మాకీ సాల్, మొజాంబిక్‌ అధ్యక్షుడు ఫిలిప్‌ న్యూసీ తదితరులతో జరిగిన భేటీలో పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ చర్చించారని బాగ్చీ వివరించారు. కాగా, బ్రిక్స్‌ శిఖరాగ్రం అనంతరం ప్రధాని మోదీ గురువారం సాయంత్రం జొహన్నెస్‌బర్గ్‌ నుంచి గ్రీస్‌కు బయలుదేరారు.  

ఆఫ్రికాకు భారత్‌ విశ్వసనీయ భాగస్వామి
‘ఎజెండా 2063’సాధనలో ఆఫ్రికాకు భారత్‌ సన్నిహిత, విశ్వసనీయ భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్‌ సౌత్‌కు భారత్‌ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, సైబర్‌ సెక్యూరిటీ అంశాల్లో సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. బ్రిక్స్, ఆఫ్రికా దేశాల ముఖ్య నేతలతో గురువారం జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా యూనియన్‌ శక్తివంతంగా రూపుదిద్దుకునేందుకు వచ్చే 50 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై 2013లో తయారు చేసిన ఆర్థికాభివృద్ధి నమూనాయే ‘అజెండా 2063’. ప్రపంచమే ఒక కుటుంబమనే భావనను భారత్‌ వేల ఏళ్లుగా విశ్వసిస్తోందని ప్రధాని చెప్పారు. ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం, పెట్టుబడుల్లో భారత్‌ నాలుగు, అయిదో స్థానాల్లో ఉందన్నారు.

ఎల్‌ఏసీని గౌరవిస్తేనే సాధారణ సంబంధాలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ«దీన రేఖ(ఎల్‌ఏసీ) పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ఉద్దేశాలు, అభిప్రాయాలు చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో గురువారం జిన్‌పింగ్‌తో మోదీ మాట్లాడారు. భారత్‌–చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి, స్నేహభావం నెలకొనాలని, ఎల్‌ఏసీని గౌరవించాలని మోదీ తేలి్చచెప్పారు. ఎల్‌ఏసీ నుంచి ఇరుదేశాల బలగాలను ఉపసంహరించే చర్యలను వేగవంతం చేసేలా తమ అధికారులను ఆదేశించాలని ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. 2020 మే నెలలో తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య త్రీవస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement