లైంగిక నేరాల ఫిర్యాదుల్లో జాప్యం సహజమే | Bombay High Court Refuses To Quash FIR For Delay | Sakshi
Sakshi News home page

లైంగిక నేరాల ఫిర్యాదుల్లో జాప్యం సహజమే

Jun 14 2026 12:55 AM | Updated on Jun 14 2026 12:55 AM

Bombay High Court Refuses To Quash FIR For Delay

పరువు భయంతో బాధితులు సంఘర్షణకు గురవుతారు

ఆలస్యమైందనే కారణంతో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయలేం

బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సాక్షి, న్యూఢిల్లీ: పరువు, ప్రతిష్టలకు ప్రాధాన్యమిచ్చే మన సమాజంలో లైంగిక నేరాల బాధితులు అపవాదు భయంతో తీవ్ర సంఘర్షణకు గురవుతారని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తొందరగా ముందుకు రారని తెలిపింది. ఇలాంటి కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమో దు కొంత జాప్యం అవ్వడం సహజమేనని పేర్కొంది. కేవలం ఈ ఒక్క కారణంతో ప్రాథమిక దశలోనే కేసును కొట్టివేయలేమని తేల్చిచెప్పింది. పని మనిషిపై లైంగిక వేధింపుల కేసును రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్‌ రంజిత్‌సిన్హా భోంస్లే ఈ వ్యాఖ్యలు చేశారు.

ముంబైకి చెందిన నందకుమార్‌ పనిక్కర్‌ తన ఇంట్లో వంటకోసం 2019 మార్చిలో ఒక మహిళను నెలకు రూ.5వేల వేతనంతో పనికి కుదుర్చుకున్నారు. అయితే, అదే నెలలో నందకుమార్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ బాధిత మహిళ ఏప్రిల్‌ 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్‌ 354 కింద కేసు నమోదైంది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ నందకుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఘటన జరిగిన 21 రోజుల తర్వాత తనపై ఆమె ఉద్దేశపూర్వకంగానే ఫిర్యాదు చేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు.

వంట సరిగా చేయకపోవడంతో ఆమెను పనిలో నుంచి తీసేశారని, ఆ కక్షతో పాటు డబ్బుల కోసమే తప్పుడు కేసు పెట్టిందని వాదించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, సెటిల్మెంట్‌ వివరాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనపై న్యాయమూర్తి స్పందిస్తూ ‘లైంగిక నేరాలు, గృహహింస లాంటి కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదులో జాప్యం జరిగితే, ఆ కేసుల పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకోవాలి. మనలాంటి సంప్రదాయ సమాజంలో ఇలాంటి ఘటనలపై పోలీసులను ఆశ్రయించడానికి బాధిత కుటుంబాలు ఎంతో సంఘర్షణకు గురవుతాయి.

అపవాదు భయంతోనే చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు’అని వ్యాఖ్యానించారు. దురుద్దేశంతో కేసు పెట్టినట్లు ప్రాథమికంగా రుజువైతే తప్ప, కేవలం జాప్యం జరిగిందన్న ఒకే ఒక్క కారణంతో మహిళలపై లైంగిక నేరాల కేసులను కొట్టివేయలేమని స్పష్టం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించారు. నిందితుడు చెబుతున్న సీసీటీవీ ఫుటేజ్, వంట సరిగా చేయలేదన్న వాదనలు తదితర అంశాలన్నీ కింది కోర్టులో జరిగే విచారణలో నిరూపించుకోవాల్సినవని స్పష్టం చేశారు. కేవలం ఆ కారణాలతో కేసును కొట్టి వేయలేమంటూ పిటిషన్‌ను తిరస్కరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement