కేంద్రానికి బాంబే హైకోర్టు నిర్దేశం
ముంబై: ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో భారత్‌కు తొలి వ్యక్తిగత పతకాన్ని అందించిన మహారాష్ట్ర రెజ్లర్ ఖషాబా దాదాసాహెబ్ (కేడీ) జాదవ్‌కు ‘పద్మవిభూషణ్’ పురస్కారం అందించే విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని బాంబే హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీనికి సంబంధించి గడువునిస్తూ మే 4లోగా తేల్చాలని స్పష్టం చేసింది. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన జాదవ్ 1984లో మృతి చెందారు.
మరణాంతరం 2001లో ప్రభుత్వం ఆయనకు ‘అర్జున అవార్డు’ను ప్రకటించింది. అయితే దేశంలో రెండో అత్యుత్తమ పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ను ఆయనకు ప్రకటించాలని కోరుతూ కుస్తీవీర్ ఖషాబా జాదవ్ ఫౌండేషన్ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేసింది. జాదవ్ కుమారుడు రంజిత్ ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాడు.
గతంలో పలుమార్లు అవార్డు విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ అంశంపై విచారించిన బాంబే హైకోర్టు (కొల్హాపూర్ బ్రాంచ్) న్యాయమూర్తులు జస్టిస్ మాధవ్ జామ్‌దార్, జస్టిస్ ప్రవీణ్ పాటిల్ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సూచనలు చేస్తూ కేసును మే 5కు వాయిదా వేశారు.


