
అల్వార్: రాజస్థాన్‌లోని అల్వార్‌లో చోటుచేసుకున్న ‘డ్రమ్ములో కుళ్లిన మృతదేహం’ కేసు మరోమలుపు తిరిగింది. ఈ ఉదంతంలో మృతుని కుమారుడే కీలక సాక్షిగా నిలిచాడు. ఆగస్టు 15న ఈ ఘటన వెలుగు చూసింది. అల్వార్‌లోని ఒక ఇంటి యజమాని తమ రెండవ అంతస్తులో దుర్వాసన వస్తుండటాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఒక నీలిరంగు డ్రమ్ములో కుళ్లిన స్థితిలో హన్స్‌రాజ్ అనే వ్యక్తి మృతదేహం బయటపడింది.
ఈ దారుణ హత్య కేసు దర్యాప్తులో మరో మలుపు తిరిగింది. మృతుని ఎనిమిదేళ్ల కుమారుడు హర్షల్ కీలక సాక్షిగా నిలిచాడు. తమ ఇంటిలో నీటిని నిల్వ చేసేందుకు ఉపయోగించే నీలిరంగు డ్రమ్ములో తన తండ్రి మృతదేహాన్ని తన తల్లి, ఆమె ప్రియుడు ఉంచారని ఆ బాలుడు పోలీసులకు తెలిపాడు. మృతుడు హన్స్‌రాజ్ పెద్ద కుమారుడు హర్షల్ తన తండ్రి హత్యకు ముందు, ఆ తరువాత ఇంట్లో ఏమి జరిగిందో పోలీసులకు వివరంగా తెలియజేశాడు.
‘ఆరోజు మా నాన్న, అమ్మ, మామ (వారి ఇంటి యజమాని కొడుకు) కలిసి మద్యం సేవిస్తున్నారు. మా అమ్ము రెండు పెగ్గులు మాత్రమే తాగింది. మామ ఫుల్‌గా తాగాడు. నాన్న కూడా మద్యం మత్తులోనే ఉండి, అమ్మను కొట్టడం మొదలుపెట్టాడు. ఇంతలో మామ జోక్యం చేసుకున్నాడు. అయితే మా నాన్న.. నువ్వు ఆమెను కాపాడితే, నిన్ను కూడా చంపేస్తాను’ అని అరిచాడు. వెంటనే మామ మా నాన్నపై దాడి చేశాడు. ఇంతలో అమ్మ మమ్మల్ని నిద్రపోమని చెప్పింది.
కాసేపటికి నేను మేల్కొని చూడగా, అమ్మ, మామ ..మా నాన్న మృతదేహాన్ని నీళ్ల డ్రమ్ములో పెట్టి, వంటగదిలో ఉంచారు. అప్పుడు నేను వారిని ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగాను. వారు తన తండ్రి చనిపోయారని చెప్పారు. మా నాన్న అమ్మను తరచూ కొట్టేవాడు. సిగరెట్లతో కాల్చాడు. నన్ను కూడా కొట్టేవాడు. ఆగస్టు 15న బ్లేడుతో నా మెడపై గాయం చేశాడు’ అని హర్షల్ తెలిపాడు.
ఈ దారుణ హత్య ఆగస్టు 15న జరిగిందని, ఇంటి యజమాని తమ రెండవ అంతస్తులో దుర్వాసన రావడాన్ని గమనించి ఫిర్యాదు చేసిన దరిమిలా ఈ ఉదంతం వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు. హన్స్‌రాజ్ భార్య సునీత, ఆమె ప్రియుడు జితేంద్ర శర్మ ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. తరువాత హన్స్ రాజ్ మృతదేహాన్ని డ్రమ్ములో ఉంచి, దానిని ఉప్పుతో నింపారని పోలీసులు పేర్కొన్నారు. సునీత, శర్మ నాలుగు నెలలుగా రిలేషన్ షిప్‌లో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నదని వారు పేర్కొన్నారు.