
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం జరుగుతున్న దుర్గా పూజలను అడ్డుకునేందుకు అధికార టీఎంసీ ప్రయత్నిస్తున్నదని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్‌లో ‘ఆపరేషన్ సింధూర్’ థీమ్‌తో ఏర్పాటు చేసిన వేదికపై జరుగుతున్న దుర్గా పూజ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోందని, ఇది సిగ్గుచేటని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా పేర్కొన్నారు. టీఎంసీ కల్పిస్తున్న ఆటంకాలను చూస్తుంటే, మండప నిర్వాహకులు భయంతో విజయదశమికి ముందుగానే దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేసేలా ఉన్నారని అమిత్ మాల్వియా ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది కోల్‌కతాలో దుర్గా పూజలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ పూజల ప్రారంభానికి ముందు నుంచే అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని, ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ థీమ్‌తో ఏర్పాటు చేసిన మండపంలో పూజలను టీఎంసీ అడ్డుకుంటున్నదని మాల్వియా ఆరోపించారు. మరోవైపు భక్తులు వేడుకల్లో పాల్గొనకుండా నిరోధించేందుకు కోల్‌కతా వీధుల్లో బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారని అన్నారు. మాల్వియా తన ‘ఎక్స్’ ఖాతాలో .. దుర్గా పూజల్లో టీఎంసీ అనుసరిస్తున్న చర్యలు భారతదేశ ప్రజల జాతీయ గౌరవాన్ని కోల్పోయేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అడ్డంకులు ఇలాగే కొనసాగితే, దశమి కంటే ముందే నిర్వాహకులు దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయవలసిన స్థాయికి పరిస్థితి దిగజారాలా ఉందని ఆయన పేర్కొన్నారు. కోల్‌కతా నడిబొడ్డున ఇటువంటి హిందూ వ్యతిరేక చర్యలకు మమతా సర్కారు అనుమతిస్తే, అది తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.
కాగా శుక్రవారం అమిత్ షా కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్‌లో దుర్గా పూజా మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన.. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వర్ణ బెంగాల్ వైభవాన్ని పునరుద్ధరించగల ప్రభుత్వాన్ని తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కలలను ప్రతిబింబించే విధంగా, సురక్షితమైన, సంపన్నమైన, ప్రశాంతమైన బెంగాల్ దార్శనికతను నెరవేర్చేలా తదుపరి ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆయన దుర్గామాతను ప్రార్థించారు. ప్రజలకు దుర్గాపూజ శుభాకాంక్షలు తెలిపారు.