ఒక వైరల్ వీడియో దేశం మొత్తాన్ని ‘‘అయ్యో పాపం పెద్దాయన..’’ అనుకునేలా చేసింది. అటు ఇటు తిరిగి.. అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం కదిలించింది. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. అయితే.. ఈ హైడ్రామాలో చివరి క్షణంలో ‘ట్విస్ట్’ చోటు చేసుకోవడంతో విచారణను విరమించుకోవాల్సి వచ్చింది.
బిహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన ఓ కేసులో 85 ఏళ్ల వృద్ధుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడినట్లు వచ్చిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నడవడానికే కష్టపడుతున్న ఆ వృద్ధుడు కర్ర సాయంతో కోర్టు ఆవరణ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు.. ఇద్దరు వ్యక్తుల సాయంతో పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందన వ్యక్తమవుతుండగా.. సుప్రీంకోర్టు కూడా అప్రమత్తమైంది.
बिहार में 33 साल पुराने केस में 84 साल के बुजुर्ग को भेजा गया जेल, दो लोगों ने सहारा देकर पहुंचाया सलाखों तक। pic.twitter.com/HSlPTwqKAZ
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) June 1, 2026
మంగళవారం మధ్యాహ్నం సుమారు 2.40 గంటల సమయంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఆదేశాలతో కోర్టు నం.1 (ప్రధాన న్యాయమూర్తి కోర్టు)ను తక్షణం తెరవాలని సూచించారు. సుమోటో విచారణ చేపట్టే అవకాశముందని భావించి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అయితే సాయంత్రం 4 గంటల సమయానికి పరిస్థితి మారింది.
బిహార్ హైకోర్టు నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. వృద్ధుడికి అప్పీల్ దాఖలు చేసుకునేందుకు ట్రయల్ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినట్లు తెలిసింది. ఈ వివరాలు తెలిసిన వెంటనే సుప్రీంకోర్టు సుమోటో చర్యను నిలిపివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుపై తక్షణ చర్యకు ఆసక్తి చూపినట్లు సమాచారం. అదే సమయంలో ఆయన కొలీజియం సమావేశాల్లో ఉన్నప్పటికీ.. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రీకి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ వివాదానికి కారణమైన కేసు 1992 నాటి హత్యాయత్నం ఘటనకు సంబంధించినది. అప్పట్లో ఓ కుటుంబానికి చెందిన తొమ్మిది మందిపై కాల్పుల ఆరోపణలు నమోదయ్యాయి. దీర్ఘకాల విచారణ అనంతరం వారిలో నలుగురు మరణించగా, మిగిలిన ఐదుగురిపై తీర్పు వెలువడింది. ఇందులో 85 ఏళ్ల దీప్ రాయ్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది. మిగిలిన నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడింది. వైరల్ వీడియో ప్రభావంతో సుప్రీంకోర్టు వరకు చేరిన ఈ ఘటన చివరి క్షణంలో భిన్న మలుపు తిరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


