బెంగ‌ళూరు విషాదం: పాపం.. ఆ 11 మంది | Bengaluru stampede 11 deceased list and family details | Sakshi
Sakshi News home page

బెంగ‌ళూరు విషాదం.. మృతుల వివ‌రాలు

Jun 6 2025 5:48 PM | Updated on Jun 6 2025 6:47 PM

Bengaluru stampede 11 deceased list and family details

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజ‌యోత్స‌వం సంద‌ర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి వివ‌రాల‌ను క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. మృతుల్లో ఎక్కువగా ఇతర ప్రాంతాలవాసులు ఉన్నారు. చదువుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ బెంగళూరులో ఉంటున్న‌వారు ప్రాణాలు కోల్పోయారు. చిన్న వయసులోనే మృత్యువు బారిన ప‌డ్డారు. మృతుల్లో ఇద్ద‌రు మైన‌ర్లు ఉన్నారు. కాగా, మృతుల తల్లిదండ్రులు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 194 కింద‌ కబ్బన్‌ పార్కు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.  

మృతుల వివరాలు 
దివ్యాన్షి (14), నివాసం.. యలహంక కట్టిగేనహళ్లి
శివలింగ (17), యాదగిరి జిల్లా హూనిగేరి గ్రామం
మనోజ్‌కుమార్‌ (18), తుమకూరు జిల్లా నాగసంద్ర గ్రామం
చిన్మయ శెట్టి (19), బెంగళూరు దొడ్డకల్లసంద్ర
శ్రవణ్‌ కేటీ (20), చిక్కబళ్లాపుర జిల్లా కురటిహళ్లి గ్రామం
పూర్ణచంద్ర (20) మండ్య జిల్లా రాయసముద్ర
భూమిక్‌ ల‌క్ష్మ‌ణ్(21), ఎం.ఎస్‌.రామయ్య లేఔట్‌, బెంగళూరు
అక్షతా పాయ్‌ (26), ఉత్తర కన్నడ జిల్లా రవీంద్రనగర
ప్రజ్వల్‌(22), యలహంక న్యూ టౌన్‌
సహన (23), కోలారు ఎస్‌.వీ.లేఔట్‌
కామాక్షిదేవి (29), తమిళనాడు కోయంబత్తూరు జిల్లా ఉడుమాలపేట్

దివ్యాన్షి
ఆర్‌సీబీ జట్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అన్నమయ్య జిల్లాకు చెందిన బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గురువారం మీడియాకు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం వండాడికి చెందిన బి.శివకుమార్, అశ్విని దంపతులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ బెంగళూరులోని యలహంకలో స్థిరపడ్డారు. వారి కుమార్తె దివ్యాన్షి(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. దివ్యాన్షికి ఆర్‌సీబీ జట్టు అంటే ఎనలేని అభిమానం. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు ఆమె కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది. కానీ తొక్కిసలాటలో దివ్యాన్షి ప్రాణాలు కోల్పోయింది.    

శివలింగ
10వ తరగతి బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణుడైన శివలింగ, పాఠశాల నుంచి తన బదిలీ సర్టిఫికేట్ (TC) తీసుకోవ‌డానికి వెళ్లి మృత్యువాత ప‌డ్డాడు. ఆర్సీబీ అంటే అత‌డికి ఎంతో అభిమానం. త‌న ఫేవ‌రేట్ ప్లేయ‌ర్ల‌ను చూసేందుకు వెళ్లి చిన్న వ‌య‌సులోనే మ‌ర‌ణించాడు. యాద్గిర్ జిల్లాలోని హోనిగెరె గ్రామానికి చెందిన అతడి తల్లిదండ్రులు బెంగ‌ళూరులో రోజువారీ కూలీలుగా ఉన్నారు. పిల్ల‌ల‌కు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆశతో 10 సంవత్సరాల క్రితం బెంగ‌ళూరు వ‌ల‌స వ‌చ్చారు. కొడుకు అకాల మ‌ర‌ణంతో వారి జీవితం అంధ‌కార‌మయం అయింది.

భూమిక్ ల‌క్ష్మ‌ణ్
బెంగళూరులోని ఎం.ఎస్‌.రామయ్య లేఔట్‌లో ఉంటూ ఇంజినీరింగ్‌ చదువుతున్న భూమిక్ ల‌క్ష్మ‌ణ్.. ప‌ది మంది స్నేహితుల‌తో క‌లిసి చిన్నస్వామి స్టేడియానికి వెళ్లాడు. తొక్కిస‌లాట‌లో స్నేహితుల నుంచి విడిపోయాడు. అదే అత‌డిని ఆఖరిసారిగా ప్రాణాలు చూడ‌డం. హాసన్‌ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్. త‌మ ఒక్క‌గానొక్క కొడుకు హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో భూమిక్ త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

మనోజ్‌ కుమార్‌
బెంగళూరులోని హెబ్బాళ సమీపంలోని కెంపాపుర రెసిడెన్సీ కాలేజీలో బీబీఎం చదువుతున్న 18 ఏళ్ల మనోజ్ కుమార్‌ తల్లిదండ్రులు, సోదరితో కలిసి యలహంకలో ఉండేవాడు. తాను అభిమానించే ఆర్సీబీ జ‌ట్టు విజ‌యోత్స‌వంలో పాలుపంచుకోవాల‌ని వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. మ‌నోజ్ తండ్రి దేవ‌రాజ్ ఎన్టీ(45) పానీపూరి అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తుమకూరు జిల్లాలోని కుణిగల్‌ తాలూకా ఎడెయూరు సమీపంలోని నాగసంద్ర గ్రామం.. దేవ‌రాజ్ సొంతూరు. త‌న కొడుకు చ‌నిపోయాడంటే అత‌డు న‌మ్మ‌లేక‌పోతున్నాడు. పెద్ద చ‌దువులు చ‌దివి త‌మ‌ను ఉద్ద‌రిస్తాడ‌నుకున్న కొడుకు అర్థాంత‌రంగా త‌నువు చాలించ‌డంతో మ‌నోజ్ త‌ల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లుతున్నారు.

శ్రవణ్
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో విషాదకరంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో బీడీఎస్ విద్యార్థి శ్రవణ్ కూడా ఉన్నాడు. కర్ణాటకలోని చింతామణికి చెందిన అత‌డు.. అంబేద్కర్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న 20 ఏళ్ల శ్ర‌వ‌ణ్ అకాల మ‌ర‌ణం చెందాడు.

సహన
బెంగుళూరులోని బాష్‌ కంపెనీలో ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్న సహన (23)  సహోద్యోగులతో కలిసి విక్టరీ పరేడ్ వీక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. ఉపాధ్యాయులైన త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి కోలారులోని ఎస్‌జి కాలనీలో నివాసం ఉండే స‌హ‌న.. ఆర్సీబీ మీద అభిమానంతో చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి అశువులు బాసింది. త‌న పెద్ద కూతురైన స‌హ‌న‌కు త్వ‌ర‌లో పెళ్లి చేయాల‌నుకున్నామ‌ని, ఇంత‌లోనే ఘోరం జ‌రిగిపోయింద‌ని ఆమె తండ్రి సురేశ్ కుమార్ క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.

చ‌ద‌వండి: కొడుకా.. లేవరా,  100 కోట్ల ఆస్తి పెట్టాను

ప్రజ్వల్
ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లిన కొడుకు ఇంటికి తిరిగొస్తాడ‌ని ఆ త‌ల్లిదండ్రులు ఎదురు చూశారు. కానీ అంత‌లోనే పిడుగు లాంటి వార్త వినాల్సి వ‌స్తోంద‌ని వారు అస్స‌లు ఊహించ‌లేదు. తొక్కిస‌లాట‌లో త‌మ కుమారుడు మ‌ర‌ణించాడ‌ని తెలిసి ప్రజ్వల్ ఫ్యామిలీ శోక‌సంద్రంలో ముగినిపోయింది. 22 ఏళ్ల ప్రజ్వల్ ఇంటర్వ్యూ ముగిసిన చిన్న‌స్వామి స్టేడియానికి వెళ్లి హ‌ఠాన్మ‌ర‌ణం పాల‌య్యాడు. దీంతో యలహంక న్యూ టౌన్ ప్రాంతంలోని అత‌డి నివాసంలో విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి.

కామాక్షిదేవి
అమెజాన్‌లో ప‌నిచేస్తున్న 29 ఏళ్ల కామాక్షిదేవి.. విరాట్ కోహ్లి అభిమాని. ఐపీఎల్ విజేత అయిన RCB విజయోత్సవంలో పాల్గొనేందుకు చిన్నస్వామి స్టేడియానికి వెళ్లిన ఆమె అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడు కోయంబత్తూరు జిల్లా ఉడుమాలపేట్ ఆమె స్వ‌స్థ‌లం. అక్షతా పాయ్‌, చిన్మయ శెట్టి, పూర్ణచంద్ర కూడా తొక్కిస‌లాట‌లో చ‌నిపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement