
బీటెక్ విద్యార్థి తండ్రి రోదన
యశవంతపుర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన హాసన్ జిల్లా వాసి భూమిక్ (20) ఇంటిలో చెప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి విగతజీవి అయ్యాడు. ఇంజనీరింగ్ చదువుతున్న భూమిక్ మృతితో తండ్రి తల్లడిల్లిపోతున్నారు. 100 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించి భూమిక్ కోసం పెట్టానంటూ కొడుకు శవం వద్ద తండ్రి బోరుమంటున్న వీడియో అందరినీ కలిచివేస్తోంది.
హాసన్ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్. బెంగళూరులో ఉంటు ఇంజినీరింగ్ రెండో ఏడాది చదువుతున్నాడు. కాలేజీ స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియం వద్దకెళ్లి తొక్కిసలాటలో మరణించాడు. విక్టోరియా ఆస్పత్రిలో గురువారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోస్టుమార్టం చేయొద్దు
ఎంతో ముద్దుగా పెంచాను. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని తండ్రి రోదించాడు. నా కొడుక్కి పోస్టుమార్టం చేయవద్దు, కోసి ముక్కలు చేయొద్దు అని ప్రాధేయపడ్డాడు. సీఎం, డీసీఎం వచ్చి పరామర్శిస్తారు, కానీ నా కుమారుడు రాడంటూ తండ్రి లక్ష్మణ బోరుమన్నాడు. అంబులెన్స్ లేని కారణంగా జీపులో భూమిక్ మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు.
కన్నీటి మధ్య అంత్యక్రియలు
తుమకూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన మనోజ్ (20) అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య జిల్లాలోని కుణిగల్ తాలూకా ఎడెయూరు సమీపంలోని నాగసంద్ర గ్రామంలోని వారి తోటలో జరిగాయి. అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
బెంగళూరులోని హెబ్బాళ సమీపంలోని కెంపాపుర రెసిడెన్సీ కాలేజీలో బీబీఎం చదువుతున్న మనోజ్ యలహంకలో తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉండేవాడు. బుధవారం స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియానికి వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృత్యువాత పడ్డాడు.
ప్రభుత్వానిదే బాధ్యత: మంత్రి
యశవంతపుర: తొక్కిసలాటకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఐటీబీటీ మంత్రి ప్రియాంక ఖర్గే తెలిపారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటన జరగిఉండరాదు, ఎక్కువమంది అభిమానులు రావడంతో జరిగింది.

సరైన వ్యవస్థలను కల్పించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం నుంచి లోపం జరిగిన మాట వాస్తవమే, అంగీకరిస్తున్నాం అన్నారు. ఒక ప్లాన్ ప్రకారం కార్యక్రమంను నిర్వహించి ఉంటే బాగుండేదని అన్నారు. మంత్రి ప్రకటనను జేడీఎస్ ఎక్స్‌లో పోస్టు చేసింది.
చదవండి: పెళ్లి చేసి పంపాలనుకున్నాం.. పాడె కట్టి సాగనంపారు