
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో గల బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్‌లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం పార్క్‌లో సఫారీ సందర్భంగా 13 ఏళ్ల బాలుడు చిరుతపులి దాడిలో గాయపడ్డాడు. జంతువులను వీక్షించేందుకు సందర్శకులను తీసుకెళ్తున్న సఫారీ వాహనం ఆగగానే, ఒక చిరుత ఆ వాహనంపైకి దూకి, కిటికీ గుండా బాలునిపై దాని పంజాతో గాయపరిచింది. అధికారులు బాధిత బాలుడిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
బాధిత బాలుడు సుహాస్.. బొమ్మసంద్ర నివాసి. తన తల్లిదండ్రులతో కలిసి సెలవు రోజున బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్క్‌లో సఫారీకి బయలుదేరాడు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిలో చిరుత దాడికి సంబంధించిన దృశ్యాలున్నాయి. ఈ ఘటన దరిమిలా బన్నెర్ఘట్ట నేషనల్ పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ‘శ్రీఎక్స్’ పోస్టులో.. చిరుతపులి సఫారీ జోన్ లో.. నాన్ ఏసి బస్సు సఫారీ జరుగుతుండగా, 12 ఏళ్ల బాలునిపై చిరుత దాడి చేసిందన్నారు.
బాలునికి వెంటనే ప్రధమ చికిత్స అందించారన్నారు. సఫారీ వాహనంలోని కెమెరా స్లాట్‌లతో సహా అన్ని విండో గ్రిల్‌లను సురక్షితంగా కవర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నాన్-ఎసి సఫారీ బస్సుల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. బన్నెర్ఘట్ట జూలాజికల్ పార్క్‌లోని వన్యప్రాణుల సఫారీ పర్యాటకులను ఎంతగానే ఆకర్షిస్తుంటుంది. కాగా ఈ పార్కులోని చిరుతలు, ఏనుగులు తరచూ, నగర శివార్లలోని నివాస ప్రాంతాలలోపికి ప్రవేశిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.