కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆయన కేబినెట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఏకైక మహిళా నేత 51 ఏళ్ల అగ్నిమిత్ర పాల్. బాలీవుడ్ గ్లామర్ ప్రపంచం నుంచి బెంగాల్ గల్లీ రాజకీయాల వరకు ఆమె సాగించిన ప్రస్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది.
అలనాటి హీరోయిన్లకు దుస్తుల తయారీ..
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ వేడుకలో దిలీప్ ఘోష్, నిశిత్ ప్రమాణిక్ వంటి ఉద్దండులతో పాటు అగ్నిమిత్ర పాల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న ఏకైక మహిళా ప్రతినిధి ఈమె కావటం విశేషం. రాజకీయాల్లోకి రాకముందు అగ్నిమిత్ర పాల్ కోల్‌కతా ఫ్యాషన్ రంగంలో తిరుగులేని సెలబ్రిటీగా వెలుగొందారు. ‘ఇంగా’ అనే ఫ్యాషన్ లేబుల్‌తో శ్రీదేవి, హేమమాలిని వంటి దిగ్గజ నటీమణులకు ఆమె దుస్తులను డిజైన్ చేశారు.
2019లో రాజకీయ అరంగేట్రం
పశ్చిమ బెంగాల్ సంప్రదాయ ‘కాంతా’ ఎంబ్రాయిడరీని అంతర్జాతీయ వేదికలపైకి అగ్నిమిత్ర పాల్ తీసుకువచ్చారు. 2019లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుండి టీఎంసీ అభ్యర్థిపై 40,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి, పార్టీలో తన పట్టును నిరూపించుకున్నారు. బీజేపీలో చేరిన అతి తక్కువ కాలంలోనే మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, పార్టీ ఉపాధ్యక్షురాలిగా అగ్నిమిత్ర కీలక బాధ్యతలు చేపట్టారు.
ముఖ్యమంత్రి రేసులో..
ఒకానొక దశలో ముఖ్యమంత్రి రేసులో కూడా ఆమె పేరు వినిపించడం విశేషం. అయితే ఆమె రాజకీయ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. తన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, నిరసనలు, ఆందోళనలకు సంబంధించి ఆమెపై 23 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏ కేసులోనూ శిక్ష పడకపోయినప్పటికీ, బెంగాల్ మట్టి బిడ్డగా పోరాట పటిమను ప్రదర్శిస్తూ, ఆమె కేబినెట్‌లో కీలక స్థానాన్ని దక్కించుకున్నారు.


