
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అంతటా ప్రస్తుతం అత్యంత వేడుకగా దుర్గా పూజలు జరుగుతున్నాయి. అయితే కోల్‌కతాలోని ఒక దుర్గా పూజా మండపంలో విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి పూజలు జరుగుతున్న ఒక మండపానికి వచ్చిన మహిళ అనారోగ్యానికి గురై, మృతిచెందింది. అయితే మృతురాలి కుటుంబీకులు ఈ ఘటనకు పోలీసుల నిరక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.
‘ఏబీపీ ఆనంద’లోని వివరాల ప్రకారం కోల్‌కతాలోని ‘బెహలా నూతన్ దాల్’ దుర్గామాత పూజా మండపానికి వచ్చిన సంగీత రాణా అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది బాధితురాలికి వెంటనే సీపీఆర్ అందించారు. అయినా ఆమె పరిస్థితి విషమించడంతో విద్యాసాగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, ఆమె మృతిచెందింది. అనంతరం అమె మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా సంగీత దీర్ఘకాలంగా ఆస్తమాతో బాధపడుతోందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
మృతురాలి బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ‘బాధితురాలికి ఆక్సిజన్ అందించాలని తాము పదేపదే అభ్యర్థించినప్పటికీ పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. అలాగే బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన అంబులెన్స్‌లో ఆక్సిజన్ సౌకర్యాలు లేవు’ అని ఆరోపించారు. అయితే ఈ వాదనను పోలీసులు ఖండించారు. ఇదిలావుండగా బీజేపీ నేత సజల్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు జనాన్ని అదుపుచేయడంలో, వారికి సహాయం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాగా డయల్ 100కు దుర్గా మండపాలకు సంబంధించిన పలు ఫిర్యాదులు వస్తున్నాయని డీసీ సెంట్రల్ ఇందిరా ముఖర్జీ తెలిపారు. విపరీతమైన శబ్ధాల కారణంగా పలువురు అనారోగ్యం పాలవుతున్నారన్నారు.