అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో జర జాగ్రత్త
వీటితో మెదడుపైనా తీవ్ర ప్రభావం
ఇంకా ఆరగించాలనేలా ఆలోచనలు
హెల్సింకి వర్సిటీ పరిశోధనలో వెల్లడి
నోరూరించే పానీయాలు, ప్యాకేజ్డ్ స్నాక్స్, ఐస్‌క్రీమ్స్, బిస్కట్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ జాబితా పెద్దదే. చిన్న కిరాణా కొట్టుకు వెళ్లినా.. పెద్ద సూపర్ మార్కెట్‌లో అడుగుపెట్టినా.. వందలాది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ రంగురంగుల ప్యాకుల్లో ఆకట్టుకుంటున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఈ జంక్ ఫుడ్ మెదడుకు సైతం హాని కలిగిస్తున్నాయట. అంతేకాదు పదేపదే వీటిని తినాలన్న కోరికను పెంచేలా మెదడును ప్రభావితం చేస్తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. – సాక్షి, స్పెషల్ డెస్క్
సాధారణ భోజనమేకాదు పిండి వంటలు, తీపి పదార్థాలు, ఇతర అల్పాహారాలు ఇంట్లో పరిమితంగానే తయారు చేసుకోగలం. అదే మార్కెట్లో ఎప్పటికప్పుడు లెక్కలేనన్ని రుచులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఆరగిద్దామా అన్నట్టు భోజన ప్రియులను ఉసిగొల్పుతున్నాయి. ఇవే ఇప్పుడు కొంప ముంచుతున్నాయి. ఫిన్‌లాండ్‌లోని హెల్సింకి విశ్వవిద్యాలయం తాజా అధ్యయనం ప్రకారం అల్ట్రా–ప్రాసెస్డ్ ఆహారాలు మెదడు ఆలోచనలను మార్చేస్తున్నాయి.
ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల.. ఎలా, ఎప్పుడు తింటారో నియంత్రించే మెదడులోని కొన్ని భాగాల పనితీరు మారుతోందని పరిశోధకులు కనుగొన్నారు. ఆకలి, భావోద్వేగం, ప్రవర్తనకు కారణమయ్యే హైపోథాలమస్, అమిగ్డాలా, రైట్ న్యూక్లియస్ అక్యుంబెన్స్ వంటి కీలక మెదడు భాగాలను అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రభావితం చేస్తున్నాయి.
ఇంగ్లండ్‌కు చెందిన యూకే బయోబ్యాంక్, కెనడాలోని మాంట్రియల్ న్యూరోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో 33,654 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. ఒక్క హెల్సింకి మాత్రమేకాదు.. ఈ జంక్ ఫుడ్ వల్ల అనర్థాలు ఉన్నాయని ఎన్నో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
పది మందిలో ఒకరు..
పలు అధ్యయనాల ప్రకారం పిల్లలను లక్ష్యంగా చేసుకున్న ఆహార ప్రకటనలలో ఎక్కువ భాగం కేలరీలు అధికంగా ఉండే, పోషకాలు తక్కువగా ఉన్న ఉత్పత్తులు ఉంటున్నాయి. ఈ ప్రకటనల్లో నాలుగింట మూడొంతులు అనారోగ్యకరమైన ఆహారాలవేనట. వీటికి పిల్లలు ఆకర్షితులవుతున్నారు. పోషకార లోపంతో బాధపడుతున్న పిల్లల కంటే.. పాఠశాల వయస్సు, కౌమారదశలో ఉన్న పిల్లల్లో ఊబకాయులు ఎక్కువట.
ప్రపంచవ్యాప్తంగా 5–19 ఏళ్ల వయసున్న పిల్లలు, టీనేజర్లలో 18.8 కోట్ల మంది ఊబకాయులున్నారు. అంటే సుమారు ప్రతి 10 మంది పిల్లలు, యువతలో ఒకరు (9.4%) ఊబకాయం బారిన పడ్డారని యూనిసెఫ్ చెబుతోంది. 2000 సంవత్సరంలో ఈ సంఖ్య 3% నమోదైంది. ప్రధానంగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
బాల్యంలో ఊబకాయం టైప్–2 డయాబెటిస్, గుండె జబ్బులు, కొన్ని కేన్సర్స్‌తో సహా తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. పెరుగుదల, ఆలోచనా నైపుణ్యాలు, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుందని వైద్యులు అంటున్నారు.
4 రోజులు చాలు..
యూఎన్‌సీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం అధిక కొవ్వు ఉన్న జంక్ ఫుడ్ జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడులోని భాగాలకు వెంటనే అంతరాయం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
కేవలం నాలుగు రోజులపాటు బర్గర్స్, ఫ్రైస్, పిజ్జా, చిప్స్ వంటి జంక్ ఫుడ్ తినడం వల్ల హిప్పోక్యాంపస్‌లోని న్యూరాన్లు అతిగా, చురుగ్గా మారి జ్ఞాపకశక్తిని దెబ్బతీశాయని పరిశోధనలో తేలింది. ఉపవాసం లేదా ఆహార మార్పులు మెదడు ఆరోగ్యాన్ని పునరుద్ధరించగలవని, ఊబకాయం సంబంధిత చిత్తవైకల్యం, అల్జీమర్స్‌ను నివారించడంలో సహాయపడుతుందని తెలిపింది.
రక్తహీనతకు దారితీస్తోంది..
కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన క్వీన్ మేరీ హాస్పిటల్ నిర్వహించిన సర్వేలో 100 మంది యుక్త వయసు అమ్మాయిలలో 9 మంది రక్తహీనతతో బాధపడుతున్నారని తేలింది. 25% మంది అమ్మాయిలు రోజూ జంక్ ఫుడ్ తింటుండగా, 71% మంది సాధారణ భోజనాన్ని ఫాస్ట్ ఫుడ్‌తో భర్తీ చేసినట్లు అంగీకరించారు. రక్తహీనతకు జంక్ ఫుడ్ ప్రత్యక్ష కారణం కానప్పటికీ పోషకాహారాన్ని విస్మరించడంలో, ఇనుము లోపాన్ని తీవ్రతరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తోందని అధ్యయనం తెలిపింది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే..
ఇంటి వంటలో సాధారణంగా ఉపయోగించని ఆహార పదార్థాలతో ఫ్యాక్టరీల్లో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తయారు చేస్తారు. అధిక–ఫ్రక్టోజ్ కాన్ సిరప్, ఎక్కువ కాలం మన్నేలా హైడ్రోజనేటెడ్ నూనెలు, కృత్రిమ రంగులు, రుచి పెంచే ముడిపదార్థాలను ఉపయోగిస్తారు. ఈ ఉత్పత్తులను సౌలభ్యం, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా రూపొందిస్తారు. పోషక విలువలు తక్కువ. కొవ్వు, చక్కెర, ఉప్పు అధిక స్థాయిలో ఉంటాయి.
పారిశ్రామిక పద్ధతుల్లో: వీటిని ఇంట్లో కాకుండా కర్మాగారాల్లో అధునాతన పారిశ్రామిక పద్ధతుల్లో తయారు చేస్తారు.
ప్రత్యేక పదార్థాలు: పిండి పదార్థాలు, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, లాక్టోస్ వంటి ప్రాసెస్, శుద్ధి చేసిన ప్రొటీన్, కొవ్వులు, ప్రిజర్వేటివ్స్ వాడతారు.
రుచి పెంచేలా: ఇంటి వంటల్లో అరుదుగా ఉపయోగించే రుచి పెంచే ముడిపదార్థాలు, రంగులు, సరైన మిశ్రమం, దీర్ఘకాలిక మన్నిక కోసం ఎమల్సిఫైయర్స్ జోడిస్తారు.
తినడానికి సిద్ధం: సౌలభ్యం కోసం తినడానికి రెడీగా ఉన్న లేదా వేడి చేయడానికి సిద్ధంగా ఉండేలా రూపొందిస్తారు.


