ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని సలహాదారు జహీద్ ఉర్ రెహమాన్‌కు దిల్లీ విమానాశ్రయంలో ఉహించని ఘటన ఎదురైంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను రెండు గంటలకు పైగా తనిఖీకోసం ఎదురు చూసేలా చేశారు. దీంతో ఆగ్రహం చెందిన రెహమాన్ ఢిల్లీ విమానాశ్రయంలో నుంచి వెనుదిరిగారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఏం జరిగింది?
ఐఓఆర్ఏ (ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్) సీనియర్ అధికారుల కమిటీ 28వ సమావేశంలో పాల్గొనేందుకు జహీద్ ఉర్ రెహమాన్ ఆదివారం (జూన్ 14, 2026) ఎయిర్ ఇండియా విమానంలో దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్ కథనాల ప్రకారం "మొదట ఇమిగ్రేషన్ అధికారులు ఎటువంటి కారణం చెప్పకుండా ఆయన్ను ఆపేశారు. కారణం అడిగినప్పుడు, అంతా బానే ఉందని, కొన్ని వివరాలు సరిచూస్తున్నామని చెప్పారు. వారి ప్రవర్తన, విచారించిన తీరు కనీస మర్యాద లేకుండా సాగింది. ఒక రాష్ట్ర మంత్రి హోదా ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఇవ్వకుండా, సాధారణ ప్రయాణికులతో పాటు సోఫాలో కూర్చోబెట్టారు. రెండు గంటల నిరీక్షణ తర్వాత క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు. కానీ, అప్పటికే నిరాశకు గురైన రెహమాన్ వెనక్కి వెళ్లడానికే మొగ్గు చూపారు." అని ఢాకా పేర్కొంది.
అయితే ఈ అంశంపై దౌత్యపరమైన దుమారం చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలూర్ రెహమాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది "విచారకరం" అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై నిరసనగా ఢాకాలోని భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పవన్ బాథేను బంగ్లాదేశ్ ప్రభుత్వం సమన్లు జారీ చేసి వివరణ కోరినట్లు తెలుస్తోంది.
భారత్ స్పందన ఏంటి?
భారత అధికారులు మాత్రం ఈ చర్యను సమర్థించుకున్నారు. జహీద్ ఉర్ రెహమాన్‌కు యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని, గత కొన్నేళ్లుగా భారత్‌కు వ్యతిరేకంగా, అలాగే బంగ్లాదేశ్ విషయంలో భారత్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారని అధికారులు గుర్తుచేశారు.జాహెద్ ఉర్ రెహమాన్ గతంలో పలుమార్లు భారత్‌ను కించపరుస్తూ వ్యాఖ్యానించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని ఫాసిస్ట్ అని పిలవడంతో పాటు భారత్ హిందూ కార్డు వాడుతోందనే ఆరోపణలు చేశారు.
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలుమార్లు భారత్‌ను కించపరుస్తూ మాట్లాడారు. భారత్ బంగ్లాదేశ్‌ను అస్థిరపరచాలని చూస్తోందని, బంగ్లాదేశ్‌లోని తమ ప్రాజెక్టుల నుండి అదానీ గ్రూప్‌కు వచ్చే లాభాలు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వెళ్తున్నాయని కూడా అతను ఆరోపించారు. ఈ చర్యలతో అతని పేరును గతంలోనే ఇమ్మిగ్రేషన్ వాచ్‌లిస్ట్‌లో చేర్చామని పేర్కొన్నారు.


