
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో మరణించిన మురళీ నాయక్ మృతి పట్ల కేంద్ర మంత్రి 'బండి సంజయ్' దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మురళి నాయక్ వీరమరణాన్ని యావత్ భారతదేశం గుర్తుంచుకుంటుంది. దేశం కోసం మురళీనాయక్ చేసిన త్యాగం వెలకట్టలేనిది. మురళీనాయక్ త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని బండి సంజయ్ అన్నారు. మురళీ నాయక్ తండ్రితో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పిన సంజయ్.. వారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ తుపాకులకు బలయ్యారు. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీలో చేరిన మురళీ నాయక్.. నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ చేసిన కాల్పులకు మురళీ నాయక్ వీర మరణం పొందారు.
మురళీ నాయక్ అవివాహితుడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి కన్నీరు మున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ స్వగ్రామం కళ్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.