న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఇటీవల గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోవడంపై యోగా గురువు బాబా రాందేవ్ స్పందించారు. ఈ వివాహంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మతం ఏదైనా సరే.. ఒక వ్యక్తి మూడు లేదా నాలుగు వివాహాలు చేసుకోవడాన్ని తాను సమర్థించనని ఆయన స్పష్టం చేశారు.
‘ఏబీపీ న్యూస్’నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 61 ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్ మరో వివాహం చేసుకోవడంపై స్పందిస్తూ ‘ఈ వయసులో కొత్త చిక్కులు ఎందుకు? గత భాగస్వాములతో ఇంకా గౌరవం, అనుబంధం ఉంటే వాటినే కొనసాగించాలి’ అని రాందేవ్ సూచించారు. కుటుంబ విలువల గురించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఒకే వివాహం చేసుకుని, పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని, స్థిరమైన కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవాలని ఆయన హితవు పలికారు.
సమాజంలో ద్వేషాన్ని పక్కనపెట్టి, పరస్పర గౌరవంతో జీవించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఆమిర్ ఖాన్ మూడో వివాహంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే కూడా విమర్శలు గుప్పించారు. సినీ తారలు యువతకు ఆదర్శంగా ఉండాలని, అయితే దీనికి భిన్నంగా వారి వ్యక్తిగత నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయని, భిన్నమైన అభిప్రాయాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్య విరాళాల వివాదం.. ట్రస్ట్ కోశాధికారి సరికొత్త వాదన!


