Ayodhya Ram Mandir: కొనసాగుతున్న భక్తుల వరద | Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: కొనసాగుతున్న భక్తుల వరద

Published Thu, Jan 25 2024 5:22 AM

Ayodhya Ram Mandir: Devotees crowded continues to Balak Ram Darshan - Sakshi

అయోధ్య/లఖ్‌నవూ: అయోధ్యకు భక్తుల వరద కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా మధ్యాహ్న సమయానికే దాదాపు 3 లక్షల మంది బాలక్‌ రామ్‌ దర్శనం చేసుకున్నట్టు శ్రీరామ జన్మభూమి ట్రస్టు వర్గాలు తెలిపాయి. మంగళవారం తొలి రోజు 5 లక్షల మందికి పైగా దర్శనాలు చేసుకున్న విషయం తెలిసిందే. బుధవారం కూడా తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైంది.

వణికిస్తున్న చలిని కూడా లెక్కచేయకుండా క్యూ లైన్లలో భారీగా బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. వారికి తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను కలి్పస్తున్నారు. మరోవైపు, అయోధ్యకు దారితీసే హైవేలు, ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి.

రానున్న రెండు మూడు రోజుల్లో భక్తుల ప్రవాహం మరింత పెరిగేలా ఉండటంతో ఉత్తరప్రదేశ్‌ సర్కారు రంగంలోకి దిగింది. భక్తుల సంఖ్యను నియంత్రించేందుకు పలు చర్యలు చేపడుతోంది. వాటిలో భాగంగా అయోధ్యకు యూపీ రోడ్డు రవాణా సంస్థ బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేసింది. నగరానికి ప్రైవేటు బస్సుల రాకపోకలపైనా నిషేధం విధించారు. వీఐపీలు అయోధ్య సందర్శనను వీలైనంత కాలం వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

మంత్రులూ, ఫిబ్రవరిలో వెళ్లొద్దు: మోదీ
భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో అయోధ్య సందర్శన యోచన మానుకోవాల్సిందిగా కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ కోరినట్టు సమాచారం. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీ ఇందుకు వేదికైంది. ఇప్పటికిప్పుడు వారు అయోధ్యలో పర్యటిస్తే ప్రొటోకాల్స్‌ తదితరాలతో భారీగా వస్తున్న సాధారణ భక్తులకు ఇబ్బందికరంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు. అయోధ్య రామ మందిర ప్రారంభం, రామ్‌ లల్లా ప్రాణప్రతిష్టపై భక్తుల ఫీడ్‌బ్యాక్‌ గురించి మంత్రులను అడిగి తెలుసుకున్నారు.

గర్భాలయంలోకి వానరం
హనుమ ఆశీర్వాదమే: ట్రస్టు
అయోధ్య రామాలయంలో ఆసక్తికర సన్నవేశం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల వేళ ఓ వానరం దక్షిణ ద్వారం గుండా గర్భాలయంలోకి ప్రవేశించింది. లోపల కలియదిరిగింది. రామల్‌ లల్లా ఉత్సవ విగ్రహం చెంతకు వెళ్లింది. విగ్రహాన్ని పడేస్తుందేమోనని లోనికొచ్చిన భద్రతా సిబ్బందిని చూస్తూ నింపాదిగా తూర్పు ద్వారం గుండా బయటికి వెళ్లింది. బారులు తీరిన భక్తుల కేసి చూస్తూ వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను క్షేత్ర ట్రస్టు ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వానరం తీరు అచ్చం మనిíÙనే తలపించిందని భద్రతా సిబ్బంది గుర్తు చేసుకున్నారు. బహుశా హనుమంతుడే బాలక్‌ రామ్‌ దర్శనార్థం వచ్చినట్టుందని వారు అభిప్రాయపడ్డారు.

అయోధ్యలో హెలికాప్టర్‌ దర్శనాలు
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య సందర్శనార్థం యూపీలో పలు నగరాల నుంచి హెలికాప్టర్‌ సరీ్వసులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గోరఖ్‌పూర్, వారణాసి, లక్నో, మధుర, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్‌ నుంచి ఈ సేవలుంటాయి. ఆయా నగరాల నుంచి వచ్చే హెలికాప్టర్ల ల్యాండింగ్‌ కోసం అయోధ్యలో సరయూ నదీ తీరంలో నూతన హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. అయోధ్య, హనుమాన్‌ గఢి, సరయూ నదీ ప్రాంతాల విహంగ వీక్షణంకు అవకాశం కలి్పస్తున్నారు. ఈ ఏరియల్‌ టూర్‌కు ఒక్కొక్కరికి రూ.3,539 వసూలు చేస్తారు. ఏరియల్‌ టూర్‌ ఒకేసారి ఐదుగురు చూడొచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement