ఆదివారం పుణ్యస్నానాల కోసం సంగమం ప్రాంతానికి అసంఖ్యాకంగా తరలివచ్చిన భక్తులు
త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ (యూపీ): మౌని అమావాస్య సందర్భంగా ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణిసంగమ స్థలిలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సాయంత్రానికే వారి సంఖ్య 4.52 కోట్లు దాటిందని ఉత్తర ప్రదేశ్ అధికారులు వెల్లడించారు. దట్టంగా కమ్ముకున్న పొగమంచును, వణికించే చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు శనివారం అర్ధరాత్రి కల్లా త్రివేణి సంగమ ఘాట్లకు చేరుకున్నారు.
తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్ ద్వారా గులాబీ రేకుల వర్షం కురిపించారు. ఇటీవల మకర సంక్రాంతి సందర్భంగా సంగమంలో కోటి మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేయగా ఏకాదశి రోజున 85 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. ‘‘భిన్న మార్గాల నుంచి వస్తున్న భక్తులు నచ్చిన ఘాట్‌కు చేరుకునేందుకు వీలుగా మార్గసూచీలు ఏర్పాటుచేశాం.
భక్తులకు సాయపడేందుకు పెద్ద సంఖ్యలో పౌర వలంటీర్లను రంగంలోకి దించాం. మాఘ మేళా ప్రాంతమంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశాం. 800 హెక్టార్లలో జరుగుతున్న మేళాను ఏడు సెక్టార్లుగా విభజించాం. 25,000 మరుగుదొడ్లను నిర్మించాం. శుభ్రతా కార్యక్రమాల కోసం 3,500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు’’ అని డివిజనల్ కమిషనర్ సౌమ్యా అగర్వాల్ చెప్పారు.
కళకళలాడుతున్న టెంట్ సిటీ
స్వల్పకాలిక కల్పవాస్ దీక్ష కోసం, మేళాను తిలకించేందుకు విచ్చేసే లక్షలాది మంది విదేశీ పర్యాటకులు, సందర్శకుల కోసం యూపీ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ‘‘వారికోసం టెంట్ సిటీ నిర్మించాం. ధ్యానం, యోగాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వృద్దులు, అలసిపోయిన భక్తులు వెంటనే తిరుగుపయనం అయ్యేందుకు వీలుగా బైక్ ట్యాక్సీలు, గోల్ఫ్ కార్ట్ వాహనాలనూ సిద్ధంగా ఉంచాం’’ అని సౌమ్య పేర్కొన్నారు.
‘‘మేళాలో భద్రత, రక్షణ, పర్యవేక్షణ విధుల నిమిత్తం 10,000 మందికిపైగా పోలీస్ సిబ్బందిని మొహరించాం. జనం ఒకే ఘాట్‌లో గుమికూడకుండా చూసేందుకు, వాహనాలను వేర్వేరు చోట్ల నిలిపి ఉంచేందుకు 42 తాత్కాలిక పార్కింగ్ జోన్‌లను ఏర్పాటుచేశాం. ఒకేసారి 1,00,000 వాహనాలు వచ్చినా పార్కింగ్ చేసేలా పార్కింగ్ జోన్‌ల సామర్థ్యాన్ని పెంచాం’’ అని మేళా సూపరింటెండెంట్ నీరజ్ పాండే వెల్లడించారు. ఈ ఏడాది మేళా కోసం 12 వేల అడుగుల పొడవునా స్నాన ఘాట్లను నిర్మించారు. కనీస సదుపాయాలన్నింటినీ సమీపంలోనే అందుబాటులో ఉంచారు.


