ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొలువైన అందాల రాముడికి స్థానిక భక్తుడు (రైతు) ఒకరు సమర్పించిన కానుక విశేషంగా నిలుస్తోంది. తాను పండించిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండును నైవేద్యంగా అందించారు. ఈ పండు విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా, తులసి దళంతో కలిపి ఈ పండును సోమవారం దేవుడికి సమర్పించారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండుగా పేరుగాంచిన జపాన్‌కు చెందిన 'మియాజాకి' (Miyazaki) రకాన్ని అయోధ్యలోని రామ్ మందిరంలో రాముడికి తొలి సారిగా సమర్పించారు. ఈ విశేషమైన మామిడి పండును "సూర్యుని గుడ్డు" (Egg of the Sun) అని కూడా పిలుస్తారు. ఈ రకం మామిడి ఒక్కో పండు ధర సుమారు రూ. లక్ష ఉంటుందని అంచనా. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకాల్లో ఒకటిగా నిలిచింది.
అయోధ్య వాతావరణ పరిస్థితులకు ఈ రకం మామిడి ఎంతవరకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకునే ఉత్సాహంతో సుమారు రెండేళ్ల క్రితం రైతు ఓంప్రకాష్ సింగ్ దీనిని నాటారు. సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ చెట్టు స్థానిక వాతావరణానికి విజయవంతంగా అలవాటు పడి, ఈ సీజన్‌లో దాదాపు డజను పండ్లను కాసింది. మియాజాకి మామిడి దాని అద్భుతమైన తీపి, అధిక పీచు పదార్థం (ఫైబర్) , పోషక విలువలకి ప్రసిద్ధి చెందిందని సింగ్ వెల్లడించారు.
సింగ్ అందించిన వివరాల ప్రకారం ఒక్కో పండు బరువు 150 గ్రాముల నుండి 300 గ్రాముల మధ్య ఉంది. తోటలోని తొలి పండును దేవుడికి అంకితం చేసే సుదీర్ఘ సంప్రదాయం ప్రకారం శ్రీరాముడికి సమర్పించా మన్నారు. మియాజాకితో పాటు, థాయిలాండ్ వెరైటీ 'బనానా మ్యాంగో', ఆస్ట్రేలియా రకం 'R2E2' , భారతదేశానికి చెందిన 'చౌసా', 'దశేరి' వంటి వివిధ రకాలను కూడా పండిస్తున్నారు.
మహంత్ సీతారాం దాస్ జీ మహరాజ్ హర్షం
ఓంప్రకాష్ సింగ్ తోటను సందర్శించిన మహంత్ సీతారాం దాస్ జీ మహరాజ్ ఈ సందర్భాన్ని కొనియాడారు. ఈ మామిడి పండు రంగు విశ్వాన్ని ప్రకాశింపజేసే సూర్య భగవానుడిని పోలి ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు అయోధ్య గడ్డపై పండటం, తొలి పంటను శ్రీరాముడికి ప్రసాదంగా సమర్పించడం ఎంతో అదృష్టమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.


