చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు మూడ్రోజుల్లో అయోధ్య విడిచి వెళ్లాలని హెచ్చరిక
అయోధ్య విరాళాల ఉదంతంలో ఫైజాబాద్ లాయర్ల సంఘం సంచలన నిర్ణయం
విరాళాల అంశంపై అత్యవసర విచారణ చేపట్టబోమన్న సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో భవ్య రామమందిరంలో లక్షలాది మంది భక్తులు భక్తితో విరాళమిచ్చిన కోట్ల రూపాయల నగదు, స్వర్ణాభరణాలను ఆలయ సిబ్బంది కొంతమేర దోచేశారన్న వార్తలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయోధ్యలోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సభ్యులైన న్యాయవాదులు సైతం తమదైన రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన విరాళాలను సిబ్బంది తమ స్వార్థం కోసం కాజేసిన వైనంపై బార్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
మహాపరాధం చేసిన నిందితుల తరఫున ఒక్క లాయర్ కూడా వాదించడానికి వీల్లేదని అసోసియేషన్ తీర్మానం చేసింది. అవసరమైతే సీబీఐ విచారణను కోరతామని సంఘం అధ్యక్షుడు కాళికా ప్రసాద్ చెప్పారు. మరోవైపు అత్యంత కీలకమైన అంశం కావడంతో కూలంకషంగా చర్చించాలని, హడావుడిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అని సర్వోన్నత న్యాయస్థానం సైతం భావించింది. వెంటనే కేసును విచారించాలంటూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టబోమని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టంచేసింది.
అయోధ్యను విడిచి వెళ్లండి
ఆలయ ట్రస్టీలుగా వ్యవహరించిన చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావులు మూడు రోజుల్లోగా అయోధ్య నగరాన్ని విడిచి వెళ్లాలని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ అల్టిమేటమ్ జారీ చేసింది. సోమవారం జరిగిన బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది. ‘‘మూడ్రోజుల్లోగా ఈ ముగ్గురూ అయోధ్యను విడిచి వెళ్లాలి. మూడ్రోజులు దాటితే అయోధ్యను దిగ్బంధిస్తాం. అప్పుడు ఎవరూ బయటకు వెళ్లలేరు’’అని సంఘం హెచ్చరించింది.
భక్తుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో నిందితుల తరఫున కోర్టులో వాదించే ప్రసక్తే లేదని సంఘం స్పష్టంచేసింది. తమ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారికి రూ.5 లక్షల జరిమానా విధిస్తామని పేర్కొంది. నిందితుల తరఫున ఎవరూ వాదించకూడదని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ 2005లోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. అప్పట్లో తాత్కాలిక రామమందిరంపై జరిగిన ఉగ్రవాద దాడి ఘటనలో నిందితుల తరఫున వాదించేందుకు న్యాయవాదులంతా నిరాకరించారు. దీంతో లక్నో లాయర్ ఒకరు వాదించడం తెల్సిందే.
ఆకాశమేమీ ఊడిపడదుగా
రామ మందిర విరాళాల చోరీ వ్యవహారంపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘‘అంత అవసరం ఏముంది? ఆకాశమేమీ ఊడిపడటం లేదు’’అని కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేసవి సెలవుల తర్వాతే విచారణకు స్వీకరిస్తామని జస్టిస్ సుందరేశ్, జస్టిస్ షీల్ నాగుల వెకేషన్ బెంచ్ తెలిపింది.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల మళ్లింపు, నిధుల దురి్వనియోగం ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ న్యాయవాదులు అజయ్ రాయ్, దినేశ్ యాదవ్ ఈ పిటిషన్ వేసినట్లు న్యాయవాది గోస్వామి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘‘ఆలయ నిధుల మళ్లింపు ఆరోపణలు చాలా తీవ్రమైనవి. విరాళాల రిజిస్టర్లు, బ్యాంకు రికార్డులు, సాఫ్ట్‌వేర్ డేటాబేస్, సీసీటీవీ ఫుటేజీ తదితర ఎల్రక్టానిక్ సాక్ష్యాధారాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. వాస్తవాలను వెలికితీసేలా తక్షణమే విచారణ చేపట్టి, సాక్ష్యాలను భద్రపరిచేలా ట్రస్ట్‌కు, ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి’’అని కోర్టును లాయర్ కోరారు.
నగదు లెక్కింపు సిబ్బందిని తొలగించాలనుకున్న ఎస్‌బీఐ
నగదు లెక్కింపుల్లో అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానించిన భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ) మూడు నెలల క్రితమే ఆలయంలోని తమ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించాలని భావించినట్లు తెలుస్తోంది. ‘‘నెలకు రూ.12,000 నుంచి రూ.15,000 జీతంతో కొందరిని ఎస్‌బీఐ ఆలయంలో విరాళాల నగదు లెక్కింపు కోసం నియమించుకుంది. అయితే ఈ లెక్కింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఎస్‌బీఐకి అనుమానం వచ్చింది. వెంటనే వాళ్లను ఉద్యోగాల నుంచి తీసేయాలని భావించింది.
తొలగింపు యోచనను పసిగట్టిన ఆలయ ట్రస్ట్ సభ్యులు ఈ ప్రక్రియను ఆదిలోనే అడ్డుకున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కొలువుల్లో కొనసాగాల్సిందేనని పట్టుబట్టారు’’అని ఎస్‌బీఐలోని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఎస్‌బీఐ తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు అంశంపై ట్రస్ట్ నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. ‘‘అయోధ్యలో లూఠీ సంగతి ఇప్పటికే బహిర్గతమైంది. ఇక కాశీ, మథుర సంగతే తేలాల్సి ఉంది. తాత్కాలిక సిబ్బందిని కాపాడుతున్నది ఎవరు? నాగపూర్(ఆర్‌ఎస్‌ఎస్), ఢిల్లీ(ఎన్‌డీఏ సర్కార్).. ఇందులో ఏది?’’అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ప్రశ్నించారు.


