
అనుమతిస్తున్న 60% విద్యాసంస్థలు
బోధనాంశాల అభివృద్ధికి వినియోగం
ఈవై–పార్థనాన్–ఫిక్కీ నివేదికలో వెల్లడి
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న కృత్రిమ మేధ∙(ఏఐ) తాజాగా విద్యార్థుల చదువుల్లోనూ భాగమైంది. దేశంలోని 60 శాతంపైగా ఉన్నత విద్యాసంస్థలు ఏఐ సాధనాలను ఉపయోగించడానికి విద్యా ర్థులకు అనుమతిస్తున్నట్లు ఈవై–పార్థనాన్–ఫిక్కీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం లెర్నింగ్ మెటీరి యల్స్‌ను (బోధనాంశాలు) అభివృద్ధి చేయడానికి జనరేటివ్ ఏఐని ఇప్పటికే 53 శాతం విద్యాసంస్థలు ఉపయోగించడం ప్రారంభించాయి.
దేశవ్యాప్తంగా 30 ఉన్నత విద్యాసంస్థలపై చేపట్టిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఇందులో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు బోధన, పరిపా లనలో ఏఐను ఎలా స్వీకరిస్తున్నాయో వివరించింది. 40 శాతం ఉన్నత విద్యాసంస్థలు ఏఐ–ఆధారిత ట్యూటరింగ్ సిస్టమ్స్, చాట్‌బాట్స్‌ను ఉపయోగిస్తుండగా 39 శాతం సంస్థలు అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగిస్తున్నాయి. అలాగే 38 శాతం కాలేజీలు ఆటోమేటెడ్ గ్రేడింగ్ కోసం ఏఐని ఉపయోగిస్తున్నాయని అధ్యయనం తెలిపింది. అయితే ప్రభుత్వాల విధివిధానాల మార్గనిర్దేశంలో ఏఐ వినియోగం జరగాలని నివేదిక సూచించింది.
అన్ని విభాగాలలో ఏఐ..
ఉన్నత విద్యారంగంలోని అన్ని రకాల కోర్సుల్లో ఏఐ అక్షరాస్యతను పెంపొందించాలని నివేదిక ప్రతిపాదించింది. విద్యార్థులంతా ఏఐ భావనలు, నీతి, అప్లికేషన్స్‌పై ప్రాథ మిక అవగాహనను అలవర్చు కోవాలని సూచించింది. ఇందులో డిజిటల్ నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, డేటా వినియోగం తదితర అంశాలపై నైతిక అవగాహన కల్పించాలని నివేదిక వివరించింది.
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) ప్రోగ్రామ్స్‌లో మెషీన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రోబోటిక్స్ వంటి అధునా తన కంటెంట్‌ను ప్రధాన పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడం ముఖ్యమని నివేదిక అభిప్రాయపడింది. భారతీయ గ్రాడ్యుయేట్లను కేవలం ఏఐ వినియోగదారులుగానే కాకుండా ఏఐ సృష్టికర్తలు, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నివేదిక సూచించింది.
శిక్షణ, మౌలిక వసతులకు..
విద్యార్థుల్లో ఏఐపట్ల ఉత్సాహం అధికంగా ఉన్న ప్పటికీ ఏఐ బోధకులు ఆ స్థాయిలో లేకపోవడం సవా ల్‌గా మారిందని నివేదిక పేర్కొంది. అధ్యాపకులను సన్నద్ధం చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం తక్షణ అవసరాలని పేర్కొంది. ఏఐ స్వీకరణను సమర్థంగా తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి విద్యాసంస్థలు అధ్యాపకులకు శిక్షణ, మౌలికవసతుల మెరుగుదల కోసం పెట్టుబడి పెట్టాలని సిఫార్సు చేసింది.
ఈ అంశాలు కార్యరూపం దాలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత విజ్ఞానం, ఆవిష్కరణల్లో భారత్ ముందంజలో ఉంటుందని నివేదిక వివరించింది. ఉన్నత విద్యాసంస్థలు ఏఐ–ఆధారిత కార్యకలాపాల వైపు ముందుకు సాగుతున్నప్పటికీ ఆవిష్కరణలు, సమగ్రత మధ్య సమతూకం పాటించడం సవాలేనని అధ్యయన నివేదిక అభిప్రాయపడింది.