
ఉగ్రవాద శిబిరాలపై దాడులను రికార్డు చేస్తున్న బలగాలు
వివరాల నమోదుతో పాటు వీడియో రూపంలోనూ సేకరణ
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను బాంబులు, క్షిపణులతో ధ్వంసం చేస్తున్న భారత బలగాలు.. ఆ దాడుల వివరాలను పక్కాగా రికార్డు చేస్తున్నాయని సమాచారం. ఈ నెల 7న పాక్, పీవోకేలోని 9 లక్ష్యాలపై భారత్ దాడి చేసింది.
ఆయా స్థావరాలు ఎవరివి? ఏ ఉగ్రవాద సంస్థ వాడుతోంది? ప్రస్తుతం అందులో ఎవరు ఉంటున్నారు? అనే వివరాలను భారత బలగాలు రికార్డు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాడులకు సంబంధించిన వీడియోలను కూడా చిత్రీకరించి భద్రపరిచినట్లు వెల్లడించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేసినట్లు సమాచారం. పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ ఆధారాలను ఉపయోగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.