terrorist camps
-
ప్రతీ దాడికి పక్కా రికార్డు
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను బాంబులు, క్షిపణులతో ధ్వంసం చేస్తున్న భారత బలగాలు.. ఆ దాడుల వివరాలను పక్కాగా రికార్డు చేస్తున్నాయని సమాచారం. ఈ నెల 7న పాక్, పీవోకేలోని 9 లక్ష్యాలపై భారత్ దాడి చేసింది. ఆయా స్థావరాలు ఎవరివి? ఏ ఉగ్రవాద సంస్థ వాడుతోంది? ప్రస్తుతం అందులో ఎవరు ఉంటున్నారు? అనే వివరాలను భారత బలగాలు రికార్డు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాడులకు సంబంధించిన వీడియోలను కూడా చిత్రీకరించి భద్రపరిచినట్లు వెల్లడించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేసినట్లు సమాచారం. పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ ఆధారాలను ఉపయోగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
Operation Sindoor: ఉగ్ర తండాలపై 'రక్త సిందూరం'
అమాయక మహిళల నుదుటి నుంచి ముష్కరులు తుడిచేసిన సిందూరం వారి పాలిట రక్తసిందూరమే అయింది. దెబ్బతిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో పాక్‌కు, దాని ప్రేరేపిత ఉగ్ర ముఠాలకు తెలిసొచ్చింది. పహల్గాం ఉగ్ర దాడికి భారత్ అంతకంతా బదులు తీర్చుకుంది. పాక్, పీఓకేల్లోని 9 ప్రాంతాలపై సైన్యం విరుచుకుపడింది. లష్కరే, జైషే వంటి ఉగ్ర సంస్థల ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను సమూలంగా తుడిచిపెట్టింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి ‘ఆపరేషన్ సిందూర్’ను దిగి్వజయంగా పూర్తి చేసింది. ‘జైహింద్’ అంటూ పహల్గాం మృతులకు ఘనంగా నివాళులు అర్పించింది.న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి పక్షం రోజుల్లోనే భారత్ బదులు తీర్చుకుంది. అమాయక పర్యాటకులను పాశవికంగా పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముష్కరులకు జన్మలో మర్చిపోలేని గుణపాఠం నేరి్పంది. వారిని ప్రపంచం అంచుల దాకా వేటాడైనా కలలో కూడా ఊహించనంత కఠినంగా శిక్షిస్తామన్న ప్రధాని ప్రతిజ్ఞను సైన్యం దిగి్వజయంగా నెరవేర్చింది. ప్రతీకార దాడుల విషయంలో పూర్తి స్వేచ్ఛనిస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక మెరుపు దాడులు చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజర్ సారథ్యంలోని జైషే మహ్మద్, హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కరే తొయిబాతో పాటు హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్ర తండాల వెన్ను విరిచింది. వాటి ప్రధాన స్థావరాలతో పాటు శిక్షణ శిబిరాలను కూడా నేలమట్టం చేసేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట 25 నిమిషాల దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. త్రివిధ దళాలు పూర్తి సమన్వయంతో, అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్ నిర్వహించాయి. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్‌తో వైమానిక దళం, సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులతో ఆర్మీ ద్విముఖ వ్యూహంతో ఏక కాలంలో దాడులకు దిగాయి. అత్యాధునిక స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ ప్రెసిషన్ బాంబులు, గైడెడ్ బాంబ్ కిట్లు, ఆత్మాహుతి డ్రోన్లతో 9 ఉగ్రవాద శిబిరాలను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేశాయి. వీటిలో ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండగా నాలుగు స్వయానా పాక్ గడ్డ మీదే ఉండటం విశేషం! బాలాకోట్ దాడుల మాదిరిగా పాక్ గగనతలంలోకి వెళ్లకుండా మన ఎయిర్‌ఫోర్స్ అమ్ములపొదిలోని అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు సరిహద్దులకు ఇవతలి నుంచే అరగంట లోపే పని ముగించేశాయి. అర్దరాత్రి 1:05కు మొదలైన దాడులు 1:30కు ముగిశాయి. ఆ వెంటనే 1:44 గంటలకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ‘‘కాసేపటి క్రితం ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. పాక్, పీఓకేల్లో నుంచి భారత్‌పై ఉగ్ర దాడులకు వ్యూహరచన చేసిన ఉగ్రవాద మౌలిక వ్యవస్థలపై దాడులు చేశాం. ఉద్రిక్తతలకు తావులేని రీతిలో, పూర్తి కచ్చితత్వంతో కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే ధ్వంసం చేశాం. పాక్ సైన్యాన్ని, సైనిక వ్యవస్థలను, పౌరులను ఏ మాత్రమూ లక్ష్యం చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక, దాడిలో ఆ మేరకు పూర్తి సంయమనం పాటించాం’’ అని వెల్లడించింది. ‘‘ఈ రోజు మనం చరిత్ర సృష్టించాం. భారత్ మాతా కీ జై’’ అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘పహల్గాం బాధితులకు న్యాయం జరిగింది. జైహింద్’’ అని సైన్యం పేర్కొంది. దాడుల వీడియోను ఎక్స్‌లో ఉంచింది. మృతుల్లో జైషే చీఫ్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది ఉన్నారు. దీన్ని అజర్ కూడా ధ్రువీకరించాడు. జైషే ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడుల్లో వారితో పాటు తన నలుగురు సన్నిహిత సహచరులు కూడా మరణించినట్టు చెప్పుకొచ్చాడు. పాక్ ప్రేరేపిత ఉగ్ర తండాల పీచమణచేలా అద్భుతంగా సాగిన సైనిక చర్య భారతీయులందరికీ గర్వకారణమంటూ ప్రధాని మోదీ ప్రస్తుతించారు. భారత దాడుల్లో 26 మందే మరణించారని, 46 మందికి పైగా గాయపడ్డారని పాక్ చెప్పుకుంది. సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ తొలుత ప్రగల్భాలకు దిగినా కాసేపటికే దిగొచ్చింది. గట్టి ప్రతి చర్యలు తప్పవంటూ బీరాలు పలికిన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ‘ఇప్పటికైనా ఉద్రిక్తతలు పెరగకుండా భారత్ చూస్తే మేమూ సహకరిస్తాం’ అంటూ సాయంత్రానికల్లా మాట మార్చారు. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో బైసారన్ మైదానంలో 26 మంది పర్యాటకులను లష్కరే ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపడం తెలిసిందే.అద్భుత నైపుణ్యం దాడులపై నిపుణులు సైన్యం ఆపరేషన్ సిందూర్‌ను అమలు చేసిన తీరును రక్షణ నిపుణులు ఎంతగానో కొనియాడుతున్నారు. ఉగ్ర శిబిరాల పరిసరాల్లోని నివాసాలు తదితరాలకు ఏమాత్రమూ నష్టం జరగకుండా, కేవలం లక్ష్యాలను మాత్రమే నేలమట్టం చేస్తూ అత్యంత కచ్చితత్వంతో దాడులు జరపడం అద్భుతమని చెబుతున్నారు. ‘‘పాక్ సైనిక స్థావరాలు, కీలక మౌలిక వ్యవస్థల వంటివాటి జోలికే వెళ్లకుండా సంయమనం పాటించడం నిస్సందేహంగా అద్భుతమైన దౌత్య ఎత్తుగడే. తద్వారా ప్రతీకార దాడులకు దిగేందుకు పాక్‌కు ఎలాంటి సాకూ లేకుండా పోయింది. పైగా 9 ఉగ్ర శిబిరాల్లో 4 స్వయానా పాక్ భూభాగంలోనే ఉండటంతో ఆ తండాలను దాయాది ఇప్పటికీ పెంచి పోషిస్తోందని నిర్ద్వంద్వంగా నిరూపణ అయింది. దాంతో పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అంతర్జాతీయ సమాజం ముందు మరోసారి ధూర్త దేశంగా మిగిలింది’’ అని వారు వివరించారు. దాడులు చేసిన ప్రాంతాల్లో కొన్ని సరిహద్దుల నుంచి ఏకంగా 100 కి.మీ. లోపల ఉండటం విశేషం. తద్వారా పాక్‌లో ఏ లక్ష్యాన్నైనా, ఎప్పుడైనా అత్యంత కచ్చితత్వంతో ఛేదించే సత్తా తనకుందని భారత్‌కు మరోసారి నిరూపించింది. 25 నిమిషాలు.. 9 లక్ష్యాలుదాడుల విషయంలో సైన్యం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పక్కాగా వ్యవహరించి అత్యంత విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. నిఘా వర్గాలు పక్షం రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి లష్కరే, జైషే తదితర ఉగ్రవాద సంస్థ శిబిరాలతో పాటు ప్రధాన కార్యాలయాల ఆనుపానులను పక్కాగా సేకరించాయి. వాటి ఆధారంగా ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాయి. సరిహద్దులకు ఆవల క్షిపణి నిరోధక వ్యవస్థలు తదితరాలతో కాచుకుని కూచున్న శత్రు సైన్యం అంచనాలకు అందకుండా వ్యవహరించాయి. సరిహద్దులు దాటకుండానే ఆపరేషన్ నిర్వహించాయి. మురిద్కే, బహావల్‌పూర్‌ల్లోని లష్కరే, జైషే ప్రధాన స్థావరాల్లో ఒక్కోచోట కనీసం 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. -
Operation Sindoor: ఆ 9 లక్ష్యాలు ఇవే..
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ కోసం ఎంపిక చేసిన 9 లక్ష్యాలను పక్కాగా సేకరించిన నిఘా సమాచారం ఆధారంగా సైన్యం నిర్ణయించుకుంది. ఇవన్నీ ఆరోగ్య కేంద్రాలు తదితర ముసుగుల్లో నడుస్తున్నాయి. వీటిని కచ్చితంగా గుర్తించడం మన నిఘా వర్గాలకు సవాలుగా నిలిచింది. ఈ ఉగ్ర కేంద్రాలు, శిబిరాలను బయటి ప్రపంచం దృష్టి నుంచి దాచి ఉంచేందుకు పాక్ ప్రభుత్వం, సైన్యం అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటాయి. ఇందుకోసం ఎప్పటికప్పుడు వాటి గుర్తింపులు మార్చడం వంటి పనులు చేస్తుంటాయి. పాకిస్తాన్ భూభాగంలో ఉన్నవి (4) 1: మర్కజ్ సుభాన్జైషే మహ్మద్ ప్రధాన స్థావరం. అంతర్జాతీయ సరిహద్దులకు 100 కి.మీ. దూరంలో పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో బహావల్పూర్ సమీపంలో నరోవల్ జిల్లా తెహ్రా కలాన్ గ్రామంలో ఉంది. ఉగ్రవాదుల చేరిక, శిక్షణ వంటివి ఇక్కడ జరుగుతాయి. జైషే చీఫ్ మసూద్ అజర్ ఇక్కడినుంచే కార్యకలాపాలు సాగిస్తుంటాడు. భద్రతా దళాలకు చిక్కిన అతన్ని 1999లో జైషే ఉగ్రవాదులు ప్రయాణికుల విమానాన్ని హైజాక్ చేసి విడిపించుకున్నారు. అజర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్ తదితర అగ్ర నేతల నివాసాలు తదితరాలూ ఇక్కడే ఉన్నాయి. ప్రస్తుతం ఇది అస్గర్ కనుసన్నల్లో నడుస్తోంది. సరిహద్దుల గుండా ముష్కరులు చొరబడేందుకు అనువైన ప్రాంతాలను ఇక్కడినుంచే గుర్తించడం, అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సొరంగాలు తవ్వడం జేషేకు నిత్యకృత్యం. అంతేగాక డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలు, డ్రగ్స్ వంటివి పంపే లాంచ్‌ప్యాడ్ కూడా ఇదే. 2000లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2001లో పార్లమెంటుపై దాడి మొదలుకుని 2019లో 40 మంది సీఆరీ్పఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడుల దాకా ప్లానింగ్ జరిగిందిక్కడే. 2: మర్కజ్ తొయిబా‘టెర్రర్ ఫ్యాక్టరీ’గా పేరు పొందింది! నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో లాహర్ సమీపంలో మురిద్కేలో ఉంది. ఇది హఫీజ్ సయీద్ నేతత్వంలో పని చేసే లష్కరే తొయిబా ప్రధాన కేంద్రం. దానికి ఆయువుపట్టు కూడా. 1990లో ఉనికిలోకి వచ్చింది. నిత్యం కనీసం 1,000 మంది రిక్రూట్లకు ఇక్కడ 2 వారాల ప్రాథమిక కోర్సు నడుస్తుంటుంది. అందులో భాగంగా శారీరక, మతోన్మాద శిక్షణ ఇస్తారు. ముంబై ఉగ్ర దాడుల కుట్ర పురుడు పోసుకుంది ఇక్కడే. వాటికి పాల్పడ్డ కసబ్ బృందానికి దౌరా–ఎ–నిబ్బత్ (నిఘా) సంబంధిత శిక్షణ ఇక్కడే ఇచ్చారు. ముంబై దాడుల సూత్రధారులు డేవిడ్ హెడ్లీ, తహవ్వుర్ రాణా కూడా ఇక్కడ శిక్షణ పొందారు. ఇక్కడ ‘అతిథి గృహం’నిర్మాణానికి అప్పటి అల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ రూ.10 లక్షలిచ్చాడు. జమ్మూ కశ్మీర్‌తో పాటు హైదరాబాద్, బెంగళూరు తదితర చోట్ల బాంబు పేలుళ్లు లష్కరే పనే. 3: సర్జాల్ అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 6 కి.మీ. దూరంలో సియాల్కోట్లో ఉంది. గత మార్చిలో నలుగురు జమ్మూ కశ్మీర్ పోలీసు సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు శిక్షణ పొందింది ఇక్కడే. 4: మెహమూనా జోయా అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 12 కి.మీ. దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉంది. హిజ్బుల్‌కు కీలక శిక్షణ కేంద్రం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముసుగులో పని చేస్తోంది. జమ్మూలోని కథువా ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే కార్యకలాపాలకు ఇది కంట్రోల్ సెంటర్‌గా వ్యవహరిస్తోంది. పఠాన్‌కోట్ వైమానిక బేస్‌పై దాడుల వంటివాటికి ఇక్కడినుంచే వ్యూహరచన జరిగింది. జమ్మూ నగరంలో పలు ఉగ్ర దాడులకు కారకుడైన ఇర్ఫాన్ టండా ఈ కేంద్రానికి సారథి. పీఓకేలో ఉన్నవి (5) 5: అహ్నే హదీత్ (బర్నాలా) క్యాంప్ నియంత్రణ రేఖకు 9 కి.మీ. దూరంలో భీంబర్ వద్ద ఉంది. ఆయుధాల వాడకంతో పాటు అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ) తయారీలో ఇక్కడ శిక్షణ ఇస్తారు. 150 మంది దాకా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వగలదు. 6: మర్కజ్ తొయిబాలష్కరే తొయిబా ముఖ్య కేంద్రాల్లో ఒకటి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో తాంగ్దార్ సెక్టర్లో ఉంది. కీలక ఉగ్ర శిక్షణకు ఇఎది కేంద్రం. ముంబైపై 26/11 దాడులకు తెగబడ్డ అజ్మల్ కసబ్ ఉగ్రవాద బృందం పూర్తిస్థాయి శిక్షణ పొందింది ఇక్కడే. ఇది 2000లో పుట్టుకొచ్చింది. పాక్ సైనిక, ఐఎస్ఐ అధికారులు ఇక్కడికి నిత్యం వస్తూ పోతూ ఉంటారు. ఏకకాలంలో 250 మందికి పైగా ఉగ్రవాదులు ఉండేందుకు ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయి. ఇక్కడినుంచి వారు ప్రధానంగా ఉత్తర కశ్మీర్లోకి చొరబడుతుంటారు. కొత్తగా చేర్చుకున్న వారికి మత, ఉగ్రవాద శిక్షణ కూడా ఇక్కడ అందుతుంది. పహల్గాంలో ఉగ్రవాదులపై దాడులకు తెగబడింది ఇక్కడినుంచి చొరబడ్డ ఉగ్రవాదులే! 2024లో కశ్మీర్‌లోని సోన్మార్గ్, గుల్మార్గ్లో భద్రతా బలగాలు, పౌరులపై దాడులు కూడా వారి పనే. 7: గుల్పూర్ క్యాంప్నియంత్రణ రేఖకు 30 కి.మీ. దూరంలో కోట్లిలో ఉంది. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఆపరేట్ చేసే లష్కరే ఉగ్రవాదులకు బేస్. పూంచ్ 2023 దాడులు, 2024లో యాత్రికులపై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ పొందారు. ముంబై దాడుల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ ఈ శిబిరానికి తరచూ వచ్చి రిక్రూటీలకు మతోన్మాద ప్రసంగాలిచ్చేవాడు. 8: అబ్బాస్ క్యాంప్ నియంత్రణ రేఖకు 13 కి.మీ. దూరంలో కోట్లీలో ఉంది. లష్కరే ఆత్మాహుతి బాంబర్లకు ప్రధాన కేంద్రం. 150 మందికి పైగా ఉగ్రవాదులకు ఏకకాలంలో శిక్షణ ఇచ్చేందుకు వసతులున్నాయి. పూంచ్, రాజౌరీల్లో చొరబాట్లు, ఉగ్ర దాడులకు వ్యూహరచన మొత్తం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక్కడి వ్యవహారాలు చూసేది క్వారీ జరార్. జేషే చీఫ్ మసూద్ సోదరుడైన అస్గర్‌కు సన్నిహితుడు. పలు ఎన్ఐఏ కేసుల్లో జరార్ ప్రధాన నిందితుడు. హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణ కేంద్రం కూడా ఇక్కడే ఉంది. బోర్డర్ యాక్షన్ టీం (బీఏటీ)తో పాటు స్నైపర్ దాడులు తదితరాలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. 9: సయీద్నా బిలాల్ క్యాంప్జైషే ఉగ్ర శిబిరం. ముజఫరాబాద్‌లో ఉంది. తొలుత ఉగ్ర సామగ్రి నిల్వ కేంద్రం. తర్వాత ఆధునీకరించి ఉగ్రవాదులకు ఆయుధాలు, పేలుడు పదార్థాల వాడకం, అడవులు, ప్రతికూల పరిస్థితుల్లో సుదీర్ఘకాలం ఉండటం తదితరాల్లో శిక్షణ ఇచ్చే కేంద్రంగా మార్చారు. నిత్యం కనీసం 100 మందికి పైగా ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. పాక్ సైన్యానికి చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ వీరికి నేరుగా శిక్షణ ఇస్తుంది! -
పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..
-
ముష్కర మూకలకు ముచ్చెమటలు
శ్రీనగర్: పహల్గాంలో ఉగ్రవాదుల రాక్షసకాండ తర్వాత కోపంతో రగిలిపోతున్న భారతసైన్యం ఏక్షణంలోనైనా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేయొచ్చనే భయా నుమానాలు పాక్ సైన్యంలో ఎక్కువయ్యాయి. దీంతో ఇన్నాళ్లూ తాము పెంచి పోషించిన ఉగ్రవాదులను పాక్ సైన్యం వెంటనే ఆయా ‘లాంచ్‌ప్యాడ్’ల నుంచి సురక్షితంగా దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ముందస్తుగా ఆ ముష్కరులను తమ సైనిక శిబిరాలు, బంకర్లలోకి పంపేస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సరిహద్దు వెంట ఉన్న లాంచ్ప్యాడ్లను ఖాళీచేయిస్తోంది. ఈ లాంచ్ప్యాడ్లు క్రియాశీలకంగా ఉన్న విషయాన్ని భారత సైనిక నిఘా వర్గాలు పసిగట్టడంతో ముందుజాగ్రత్తగా పాక్ సైన్యం అప్రమత్తమై అక్కడి ఉగ్రవాదులను వేరే చోట్లకు పంపేస్తోంది.ఇవన్నీ కీలక స్థావరాలుపాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కేల్, సర్దీ, దుధ్నియాల్, అథ్ముఖాన్, జురా, లిపా, పచ్ఛిబన్, ఫార్వర్డ్ కహూతా, కోట్లీ, ఖుయిరాట్టా, మంధార్, నిఖాయిల్, ఛమన్కోట్, జాన్కోటేలలో ఈ ఉగ్రస్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలన్నింటి నుంచీ ఉగ్రవాదులు తాత్కాలికంగా వెళ్లిపోతున్నట్లు వార్తలొచ్చాయి. వాస్తవానికి ఇవన్నీ ఉగ్రవాదులకు కీలక స్థావరాలు(లాంచ్‌ప్యాడ్). వాస్తవాధీన రేఖ గుండా భారత్‌లోకి చొరబడటానికి ఉగ్రవాదులు ఈ స్థావరాల నుంచే బయల్దేరతారు. ఇక్కడే వీళ్లకు నెలల తరబడి ఉగ్రశిక్షణ ఇస్తారని తెలుస్తోంది. పీఓకేలో క్రియాశీలంకంగా ఉన్న 42 లాంచ్ప్యాడ్లను ఇటీవల భారత భద్రతా బలగాలు గుర్తించాయి. పహల్గాం దాడి ఉదంతం తర్వాత ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న భారతసైన్యం ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చనే ఉద్దేశంతో ఉగ్రవాదులను పాక్ సైన్యం హుటాహుటిన ఇతర ప్రదేశాలకు పంపేస్తోంది. ఇలా తరలిస్తున్న ఉగ్రవాదుల సంఖ్య 150 నుంచి 200దాకా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే హిజ్బుల్ మొజాహిదీన్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందిన దాదాపు 60 మంది విదేశీ కిరాయి ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడ్డారని జాతీయ మీడియాలో కథనం వెలువడింది. వీరిలో 17 మంది స్థానికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత సైన్యం సరిహద్దు వెంట గాలింపును మరింత ఉధృతంచేసింది. -
పాకిస్తాన్‌కు మరో చావుదెబ్బ
భారత బలగాలు భారీగా కాల్పులతో విరుచుకుపడటంతో ధ్వంసమైన పాక్ ఆర్మీ పోస్టులు, ఉగ్ర శిబిరాల నుంచి వెలువడుతున్న పొగ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ ప్రతీకార కాల్పులు న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్తాన్‌ను మరోసారి భారత్ చావుదెబ్బ తీసింది. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడుల అనంతరం.. ఆ స్థాయిలో ఆదివారం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పీఓకేలోని నీలం లోయలో ఉన్న నాలుగు ఉగ్ర స్థావరాల్లో సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించింది. పక్కా ప్రణాళికతో, స్పష్టమైన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని భారత జవాన్లు కాల్పులు జరిపారు. మూడు స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసి, మరో స్థావరాన్ని భారీగా నష్టపరిచిన భారత జవాన్లు.. ఆ స్థావరాల్లో భారీ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదులను మట్టుపెట్టారు. ఆ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు వీలుగా భారత పోస్ట్‌లపై కాల్పులు జరపడం కోసం అదే ప్రాంతంలో ఉన్న పాక్ జవాన్ల స్థావరాలను సైతం నేలకూల్చారు. ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు వీలుగా శనివారం తంగధర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులపై పాక్ కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు పదమ్ బహదూర్ శ్రేష్ఠ, గమిల్ కుమార్ శ్రేష్ఠ, ఒక పౌరుడు మృతి చెందారు. ప్రతిగా ఆదివారం పీఓకే లోని ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్ తీవ్రస్థాయిలో దాడులు ప్రారంభించింది. భారత్ కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య 35 వరకు ఉండొచ్చని, వారు జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థలకు చెందినవారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాక్ జవాన్లు కూడా భారీగానే హతమయ్యారని పేర్కొన్నాయి. ఆదివారం సాయంత్రం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. ‘ ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు భారత్ కాల్పుల్లో 6 నుంచి 10 మంది పాక్ జవాన్లు, అంతే సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు’ అని అన్నారు. వీరమరణం పొందిన భారత జవాన్లు పదమ్ బహదూర్, గమిల్ కుమార్ పీఓకేలోని ఉగ్రస్థావరాల నెట్వర్క్ చాలావరకు ధ్వంసమైందన్నారు. ‘మూడు ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా నాశనమయ్యాయి. నాలుగోది దాదాపు ధ్వంసమైంది. పక్కా సమాచారంతోనే దాడులు చేశాం’ అన్నారు. ‘దీపావళి పండుగ సమీపిస్తోంది. భారత్‌లో దాడులు చేసేందుకు కొందరు ఉగ్రవాదులు పీఓకేలోని నీలం లోయలో ఉన్న కొన్ని ఉగ్రస్థావరాల్లో సిద్ధంగా ఉన్నట్లు మాకు సమాచారమందింది. వారు చొరబాటుకు ప్రయత్నించే వరకు ఎదురుచూడకుండా.. ముందే పక్కా ప్రణాళికతో దాడులు చేశాం’ అని వివరించారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసిన ఆగస్ట్ 5వ తేదీ నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మాకు వస్తూనే ఉందని ఆర్మీ చీఫ్ రావత్ వ్యాఖ్యానించారు. నెల రోజులుగా గురెజ్, మచిల్, కేరన్ సెక్టార్ల ద్వారా పలు చొరబాటు ప్రయత్నాలు జరిగాయన్నారు. ‘భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించే ప్రయత్నాలను పాక్ నిలిపేయకపోతే.. మా స్పందన మరింత తీవ్రంగా ఉంటుంది’ అని రావత్ స్పష్టం చేశారు. ‘కశ్మీర్లో సాధారణ స్థితి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం’ అన్నారు. ఒక్కో స్థావరంలో 10 నుంచి 15 మంది జమ్మూకశ్మీర్‌లోని తంగధర్ సెక్టార్‌కు ఆవలివైపు పీఓకేలో ఉన్న నీలం లోయలోని ఒక్కో ఉగ్రస్థావరంలో భారత్ దాడులు చేసిన సమయంలో 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు భారత్‌లోని కశ్మీర్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు, తదనంతర పరిస్థితులను వివరించారు. మరోవైపు, దాడుల్లో ఉగ్రవాదులు, పాక్ జవాన్లు చనిపోయారన్న భారత్ వాదనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. భారత్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలోని 5 శాశ్వత సభ్య దేశాల ప్రతినిధులను ఉగ్రస్థావరాలున్నాయని భారత్ చెబుతున్న నీలం లోయ ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వారే నిజానిజాలను నిర్ధారిస్తారని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ సవాలు చేశారు. పాకిస్తాన్లో భారత రాయబారి గౌరవ్ అహ్లూవాలియాను పాక్ ప్రభుత్వం పిలిపించి భారత్ కాల్పులకు నిరసన తెలిపింది. భారత్ కాల్పుల్లో ఐదుగురు పౌరులు చనిపోయారని పాక్ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశారు. పాక్ ఆర్మీ కాల్పుల్లో 9 మంది భారత జవాన్లు చనిపోగా, రెండు భారత బంకర్లు ధ్వంసమయ్యాయన్నారు. పాక్ వాదనను భారత ఆర్మీ తోసిపుచ్చింది. ‘ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు వీలుగా శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. అందుకు ప్రతిగా భారత్ జరిపిన కాల్పుల్లో పీఓకేలోని పలు ఉగ్రస్థావరాలు, ఆ స్థావరాలకు రక్షణ కల్పిస్తున్న పాక్ ఆర్మీ పోస్ట్‌లు ధ్వంసమయ్యాయి’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, రాజకీయ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ పేరును వాడుకోవడం బీజేపీ నేతలు ఇకనైనా ఆపేయాలి’ అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కోరింది. పఠాన్‌కోట్.. ఉడి. పుల్వామా! 2016 జనవరి 2: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్న వైమానిక స్థావరంపై 2016 జనవరి 2వ తేదీ వేకువజామున ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది నేలకొరగగా నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. రాత్రి సమయంలో వైమానిక స్థావరంలోకి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ప్రవేశించిన ఉగ్రవాదులు పేలుళ్లు, కాల్పులతో విధ్వంసం సృష్టించారు. ఉగ్ర మూకలను ఏరిపారేసేందుకు సైన్యానికి 17 గంటలకుపైగా సమయం పట్టింది. 2016 సెప్టెంబర్ 28 ఉడి సైనిక స్థావరంపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు 18 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో రగిలిపోయిన భారత్.. సరిగ్గా పది రోజుల తర్వాత పగ తీర్చుకుంది. 2016 సెప్టెంబర్ 28వ తేదీన అర్థరాత్రి 12 గంటలకు కమాండోలతో కూడిన వైమానిక దళం విమానాలు ఎల్వోసీలోకి ప్రవేశించాయి. దాదాపు మూడు కిలోమీటర్ల దూరం లోపలికి చొచ్చుకుని వెళ్లి భింబేర్, కేల్, హాట్ స్ప్రింగ్, లిపా సెక్టార్లలోని 7 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ సందర్భంగా 38 మంది ఉగ్రవాదులతోపాటు ఇద్దరు పాక్ సైనికులను హతం చేశాయి. నాలుగు గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ లక్ష్యాలను సాధించి, పూర్తిగా విజయవంతమైందని సైన్యం ప్రకటించింది. 2019 ఫిబ్రవరి 14 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై వస్తున్న భద్రతా బలగాల కాన్వాయ్‌ని ఆత్మాహుతి దళ సభ్యుడు వాహనంతో ఢీకొట్టాడు. భారీ విస్ఫోటం సంభవించి 40 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ ఘటన అనంతరం భారత్ మరోసారి ఎల్వోసీలోకి వైమానికదళాన్ని పంపింది. బాలాకోట్‌లో నడుస్తున్న ఉగ్ర శిక్షణ శిబిరంపై భీకర దాడులు జరిపి, తీవ్ర నష్టం కలిగించింది. అనంతరం సరిహద్దుల్లో పాక్ ఎఫ్–16 కూల్చివేత, తదనంతర పరిణామాల్లో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ పట్టుబడటం, పాక్ అతడిని సురక్షితంగా విడిచి పెట్టడం తెలిసిందే. -
మెరుపు దాడుల వివరాలు ఏడుగురికే తెలుసు
పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన మెరుపు దాడుల నిర్ణయం గురించి కేవలం ఏడుగురికే తెలుసని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, ప్రధాని జాతీయ భద్రత సలహాదారు అజిత్‌కుమార్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు, పరిశోధన, విశ్లేషణ విభాగం (రా), ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతులకు మాత్రమే వాయుసేన జరిపే దాడులకు సంబంధించిన సమాచారం ఉంది. పాక్‌పై మెరుపు దాడులకు లక్ష్యాలను గుర్తించాలని ఈ నెల 14న పుల్వామా ఉగ్రదాడి జరిగిన వెంటనే ‘రా’ను ప్రభుత్వం ఆదేశించింది. ‘రా’ ఆరు లక్ష్యాల జాబితా సమర్పించింది. బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ శిక్షణ శిబిరం, జైషే స్థాపకుడు మసూద్ అజహర్ బావ యూసుఫ్ అజహర్ నడుపుతున్న ఉగ్ర శిబిరం ఈ జాబితాలో అగ్రభాగాన ఉన్నాయి. భారత్ దాడి చేయడానికి అనుకూలమైనదిగా బాలాకోట్ ఉగ్ర స్థావరం కనిపించింది. దీనిపై మెరుపుదాడి చేస్తే జైషే మహమ్మద్‌ను సూటిగా హెచ్చరించినట్టవుతుందని, పుల్వామాలో భారత భద్రతా దళాలకు జరిగిన నష్టానికి సమానంగా బాలాకోట్‌లో జైషేకు నష్టం కలగజేయవచ్చని ప్రభుత్వం భావించిందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. అలాగే బాలాకోట్ శిబిరంపై దాడి వల్ల సాధారణ పౌరులెవరూ మరణించే అవకాశం లేకపోవడం వల్ల వెంటనే పాక్ ప్రతిదాడికి దిగే అవకాశంగానీ, ప్రపంచదేశాల నుంచి భారత్‌పై విమర్శలుగానీ ఉండవని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో దాడులు చేసేందుకు ప్రధాని మోదీ ఈ నెల 18న తుది నిర్ణయం తీసుకున్నారు. -
ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయండి :రాందేవ్
యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పులను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. యోగా గురు బాబా రాందేవ్ సైతం ఈ ఉగ్ర ఘాతుకంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి భారత సైన్యం చొచ్చుకుని వెళ్లి, పాకిస్తాన్ తీవ్రవాద శిక్షణా శిబిరాలను నాశనం చేయాలని సైన్యానికి పిలుపునిచ్చారు. బుద్ధ, యుద్ధ రెండింటి సహకారంతో ప్రధాని మోదీ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ట్వీట్ చేశారు. ఆదివారం వేకువ జామున నలుగురు పాక్ ముష్కరులు యూరి సైనిక స్థావరంపై విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 18 మంది సైనికులు మరణించారు. ఈ ఘటనను భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పాకిస్తానే ఈ ఉగ్ర దాడికి పురిగొల్పిందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చర్యకు పాల్పడిన వారిని వదిలేది లేదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) హెచ్చరించింది. ఇటువంటి దాడులకు భారత్ భయపడబోదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో సైతం ఈ దాడిపై తీవ్రస్థాయిలో స్పందనలు వస్తున్నాయి. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మిలటరీ చర్యలను పెంచాలని, దౌత్య మార్గాలను వదులుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. Now it's time to enter illegally occupied Kashmir region and destroy all the Pakistan organised terror training camps #UriAttack — Swami Ramdev (@yogrishiramdev) September 19, 2016